సంక్రాంతి కోళ్ల పందేలు...ఎన్ని వేల కోట్లంటే!?
posted on Jan 16, 2026 4:01PM

ఈ సంక్రాంతి సీజన్లో కేవలం రెండు రోజులకే ఎన్ని వేల కోట్ల మేర కోళ్ల పందేలు జరిగాయో చూస్తే ఏకంగా 2 వేల కోట్ల రూపాయల మేర కోళ్ల పందేల్లో చేతులు మారాయని తెలుస్తోంది. కొన్ని కొన్ని అంచనాల ప్రకారం ఈ మొత్తం ఇంకా ఎక్కువగానే ఉంటుంది తప్ప తగ్గే ప్రసక్తే లేదంటున్నారు. గత సంక్రాంతి సంబరాల్లో ఒక్క కనుమరోజే వెయ్యి కోట్ల మేర చేతులు మారాయి.
మూడో రోజు మరింత పెద్ద మొత్తంలో పందెంరాయుళ్లు కోళ్ల పందేలు ఆడుతారని చెబుతారు. కారణం ఇదే ఆఖరు రోజు కావడంతో.. మరింతగా చెలరేగిపోయి పందెంరాయుళ్లు పందేలు కాస్తారని అంటారు.
బేసిగ్గా కోళ్ల పందేలపై దేశ వ్యాప్తంగా నిషేధముంది. కానీ ఆ నిషేధం ఎక్కడా అమలవుతున్నట్టే కనిపించడం లేదు. తమిళనాడులో జల్లికట్టు ఎలాగో ఇక్కడ కూడా కోళ్ల పందేలు అలాగ. అయితే తమిళనాడులో వీటి విషయంలో పందేల నిర్వహణ ఉండదు. కేవలం వీరులకు బహుమానాలు ఇస్తారు. అంతే. అదే ఏపీలో అలాక్కాదు కోళ్ల పై పందేలు కాయడం ఎప్పటి నుంచో వస్తోన్న అలవాటు.
భీమవరం ఆ పరిసర ప్రాంతాల్లోని గోదావరి జిల్లాలకు పరిమితమైన కోళ్ల పందేలు ఇప్పుడు ఉభయ గుంటూరు, కృష్ణా జిల్లాల వరకూ పాకిపోయాయి. ఉమ్మడి కృష్ణాజిల్లాలో అయితే సినిమా హాళ్లను తలపించేలా సీటింగ్ గేలరీలు ఏర్పాటు చేయడం చూసి ఆశ్చర్య పోయారు పోలీసులు. అప్పటికీ వారి ఏర్పాట్లను ధ్వంసం చేసి ఆపై అక్కడక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.. వాటిని కూడా లెక్క చేయకుండా బరుల నిర్వాహకులు బరి తెగించినట్టు కనిపిస్తోంది.
పోలీస్టేషన్ కి పది లక్షలు ఇచ్చేలా తాము మాట్లాడామని.. వాళ్ల కేసులు వాళ్లవే మన పందేలు మనవే అంటూ నిర్వాహకులు.. రెచ్చిపోయి వీరు మాట్లాడిన వీడియోలు వైరల్ అయ్యాయి కూడా. దీన్నిబట్టీ చూస్తే.. గుంటూరు కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా కోళ్ల పందేలు ఏ స్థాయిలో జరిగాయో ఊహించుకోవచ్చు.ఒక వ్యక్తి కోటిన్నర గెలిచినట్టు సమాచారం అందగా.. తాడేపల్లిగూడెంలో దగ్గర్లో జరిగిన ఒక పందెంలో 6 కోట్ల మేర పందెం కాచినట్టు వార్తలు వెలువడ్డాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పందేల కోళ్ల కట్టల కథలు కోకొల్లలు.