బీహార్‌లో ట్రక్కు ఢీకొని బాలుడు మృతి…మానవత్వం మరిచిన జనం
posted on Jan 16, 2026 7:00PM

బీహార్ రాష్ట్రంలోని సీతామర్హి జిల్లాలో మానవత్వాన్ని మరిచిపోయేలా చేసిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకవైపు రోడ్డు ప్రమాదంలో 13 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోతే… మరోవైపు అదే ప్రమాదానికి కారణమైన ట్రక్కు నుంచి కింద పడిన చేపల కోసం స్థానికులు ఎగబడ్డారు. రక్తపుమడుగులో పడి ఉన్న బాలుడి మృతదేహాన్ని పట్టించుకోకుండా చేపలను సంచుల్లో నింపుకుని ఎత్తుకెళ్లడం చూసి అందరూ షాక్‌కు గురయ్యారు.
ఈ ఘటన పుప్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఝాజిహాట్ గ్రామ సమీపంలో జరిగింది. స్థానిక పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న రితేష్ కుమార్ ఉదయం సైకిల్‌పై కోచింగ్ క్లాస్‌కు వెళ్తుండగా వేగంగా వచ్చిన ఓ ట్రక్కు అతడిని ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రతకు బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్కు అదుపు తప్పి పక్కకు ఒరిగింది. అందులో ఉన్న చేపలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. అదే సమయంలో ఘటనాస్థలానికి చేరుకున్న బాలుడి కుటుంబ సభ్యులు మృతదేహం పక్కన గుండెలవిసేలా రోదిస్తుంటే… మరోవైపు కొందరు స్థానికులు మాత్రం ఆ దృశ్యాన్ని పట్టించుకోకుండా చేపలను తీసుకెళ్లడంలో మునిగిపోయారు.
ఈ అమానవీయ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “మానవత్వం ఎక్కడ పోయింది?” అంటూ నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. బాలుడి మృతికి కారణమైన ట్రక్కు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
https://publish.twitter.com/?url=https://twitter.com/SomuAnand_/status/2012079958672458099#