విశాఖలో ఇన్ఫోసిస్ కార్యాలయానికి జగన్ రిబ్బన్ కట్టింగ్.. అసలు కథ ఇదీ!
posted on Oct 16, 2023 2:38PM
విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ సంస్థ కార్యాలయాన్ని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఫోసిస్ ప్రతినిధులతో పాటు పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు. రూ. 35 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుచేసిన ఈ కేంద్రం సాప్ట్‌వేర్ డెవలప్‌మెంట్ సెంటర్‌గా పనిచేస్తుందని.. దాదాపు 1000 మంది ఉద్యోగులు ఈ సెంటర్ నుంచి పనిచేయనున్నట్లు రిబ్బన్ కట్ చేసిన అనంతరం సీఎం జగన్ తెలిపారు. ఇక గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలకు అనుగుణంగా ఉందా అని సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకోగా.. విశాలమైన ఆడియో, వీడియో కాన్ఫరెన్స్ హాల్స్, అధునాతన కెఫ్‌టేరియా, విశాలమైన పార్కింగ్ సౌకర్యాలతో తీర్చిదిద్దినట్లు సంస్థ ప్రతినిధులను సీఎంకు వివరించారు.
విశాఖలో ఇన్ఫోసిస్ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేసిన సీఎం.. ఈ తరహా పరిశ్రమలు రావడం వల్ల విశాఖ కూడా త్వరగా ఎదుగుతుందని చెప్పారు. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు స్థాయిలో అభివృద్ధి చెందడానికి అన్ని అనుకూలతలు ఉన్న నగరం విశాఖ ఒక్కటే అన్నారు. ఇక, పనిలో పనిగా ఇక్కడ నుండే డిసెంబర్ లో తాను కూడా విశాఖ నుండే పాలన మొదలు పెడతామని చెప్పారు.
అయితే, ఇన్ఫోసిస్ కార్యాలయం ప్రారంభోత్సవాన్ని కాస్త నిశితంగా ఆలోచించి గమనిస్తే.. దిగ్భ్రాంతికర విషయాలు బయట పడతాయి. అసలు విశాఖలో ఇన్ఫోసిస్ ఏంటి.. విశాఖలో కొత్తగా ఆఫీసు పెట్టడం ఏంటి? అది కూడా ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజ సంస్థ విశాఖ లాంటి నగరంలో జస్ట్ రూ.35 కోట్ల పెట్టుబడితో ఆఫీసు ప్రారంభించడం ఏంటి? రూ.35 కోట్ల పెట్టుబడితో మొదలు పెట్టిన కార్యాలయంలో వెయ్యి మందికి ఉపాధి ఏంటి? అనే అనుమానాలు రాకమానవు. సీఎం ప్రారంభించిన ఈ కార్యాలయానికి సంబధించి ప్రభుత్వ వర్గాలు మీడియాకి ఇచ్చిన సమాచారంలో ఎక్కడా పొంతన లేదు. దీనికి కారణం ఇది కేవలం రిబ్బన్ కటింగ్ కార్యక్రమం మాత్రమే. ఈ కంపెనీతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు.
కనీసం కంపెనీ ఇక్కడ ఆఫీసు ప్రారంభించడంలో కూడా ప్రభుత్వ పాత్ర ఏమీ లేదు. ప్రోత్సాహకాలు ఇచ్చి, స్థలం కేటాయించి ఇక్కడ కంపెనీ ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చేసిందేమీ లేదు.
ఇన్ఫోసిస్ కంప్లీట్ గా ప్రైవేట్ ఐటీ సంస్థ అనే సంగతి తెలిసిందే. ఇన్ఫోసిస్ దేశంలో ఎక్కడ తమ కంపెనీ ఆఫీసు ప్రారంభించినా ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ఉంటుంది. పూర్తిస్థాయి కార్పొరేట్ కల్చర్ లో పనిచేసే ఈ సంస్థ తమ కార్యాలయాలను కూడా అదే స్థాయిలో రూపొందించుకుంటుంది. కానీ విశాఖలో మాత్రం ఇన్ఫోసిస్ స్టాండర్డ్స్ కి తగ్గట్లుగా కార్యాలయం లేదు. ఇంకా చెప్పాలంటే ఇది ఇన్ఫోసిస్ తమ అవసరం కోసం ఒక మోస్తరుగా తమ బ్రాంచి ఏర్పాటు చేసుకుంది. కరోనా తర్వాత ఐటీ కంపెనీలన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ ఉద్యోగులకు అవకాశం ఇచ్చారు. ఈ మధ్యనే మళ్ళీ బ్యాక్ టూ ఆఫీస్ అంటూ ఉద్యోగులను కార్యాలయాలకు రావాలని చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ఇన్ఫోసిస్ కూడా అందరినీ తమ బెంగళూరు, హైదరాబాద్ ఆఫీసుకు పిలుస్తున్నది. కానీ చిన్న నగరాలు, పట్టణాల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిలో పనిచేసే వారు బెంగళూరు, హైదరాబాద్ వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. దీంతో ఇన్ఫోసిస్ కూడా ఆయా ప్రాతాల్లో కార్యాలయాలు ప్రారంభించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే విశాఖలో కూడా ఆఫీస్ ప్రారంభించింది.
ఈ ఆఫీసు ప్రభుత్వంతో సంబంధం లేకుండానే ఆగస్టులో నే ప్రారంభమైంది. అక్కడ కార్యకలాపాలు కూడా సాగుతున్నాయి. కానీ విశాఖకు ఇన్ఫోసిస్ ను తామే తీసుకువచ్చామని ప్రచారం చేసుకుని, తమ భుజాలు తామే చరుచుకోవడానికి జగన్ ప్రభుత్వం ఇప్పుడు ఇలా రిబ్బన్ కటింగ్ కార్యక్రమం పెట్టింది. అయితే విశాఖ ఇన్ఫోసిస్ తో కొత్తగా ఉద్యోగాలు వచ్చేది లేదు. కొత్తగా చేసుకున్న క్యాంపస్ రిక్రూటమెంట్లను కూడా ఆపేసిన ఇన్ఫోసిస్ వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఇక ఈ విశాఖ ఆఫీసులో కూడా పాత వాళ్ళకే అవకాశం ఉంది తప్ప కొత్తగా నియామకాలు ఉండవు. అందుకే రూ.35 కోట్లతో ఇన్ఫోసిస్ సింపుల్ గా మూడు నెలల క్రితమే విశాఖలో కార్యాలయం ప్రారంభించింది. కానీ, దాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు జగన్ ఇప్పుడు ఇలా రూ.50 కోట్లు ఖర్చు పెట్టి రిబ్బన్ కట్ చేశారు.