ఔను వాడేసుకున్నాం.. అయితే ఏంటి? కేంద్ర నిధుల దారిమళ్లింపుపై జగన్ సర్కార్!
posted on Oct 16, 2023 1:32PM
వచ్చేదేం లేదు. అయినా సొమ్యులు ఎక్కడ నుండి వస్తాయి.. అవేమైనా చెట్లకు కాస్తాయా.. లేక ప్రభుత్వ ఖజానా ఏమన్నా అక్షయపాత్రా తీసేకొద్దీ ఊరేందుకు! తెస్తే అప్పులు.. లేకపోతే అమ్మకాలు ఇంతే కదా సంక్షేమం అన్నట్లుగా మారిపోయింది ఏపీ పరిస్థితి. ఇందులో మరో గమ్మత్తైన విషయం ఏంటంటే.. ఎప్పుడో రెండు మూడు నెలల తర్వాత పంచే వాటికి కూడా ముందే బటన్ నొక్కేసి.. భారీ సభలతో ఊదరగొట్టడంతో ఎప్పుడు ఆ డబ్బులు తమ ఖాతాలోకి వస్తాయా అని వేయి కళ్ళతో ఎదురుచూడానికే లబ్ధిదారుల పాత్ర పరిమితమైపోయింది. రాష్ట్రానికి ఆదాయమూ లేదు.. ఆదాయం తెచ్చే విధానాలూ లేవు. ఉన్నదల్లా అడ్డగోలుగా అప్పులు తేవడం.. ఆ అప్పులనే బటన్ నొక్కి సంక్షేమం అమలు చేస్తున్నాం అని డప్పుకొట్టుకోవడమే పాలసీగా మారిపోయింది. ఈ క్రమంలోనే కేంద్రం నుండి వచ్చే డబ్బును కూడా ఉద్దేశించిన పథకానికి కాకుండా సొంతానికి అంటే తమకు ఓట్టు తెచ్చిపెడతాయనుకుంటున్న బటన్ నొక్కుడు సంక్షేమ పథకాలకి వాడేసింది. రాష్ట్ర డబ్బుకు అంటే లెక్కలు అడిగే వారెవరూ ఉండరు. ఒక వేళ ఉన్నా వారిపై అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు అంటూ వేధింపులకు గురి చేసి నోరు నొక్కేయవచ్చు. అడిగడానికి మీరెవరంటూ దబాయించేయచ్చు. కానీ కేంద్రం అలా కాదు కదా. మా డబ్బులు ఏం చేసారో చెప్పాలంటూ నిలదీస్తుంది. ఇప్పుడు అలాగే చేస్తోంది.
వివిధ పథకాల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.2,019 కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వానికి విడుదల చేసింది. జగన్ సర్కార్ వాటిని యథాప్రకారంగా దారి మళ్ళించేసింది. దీనిని గుర్తించిన కేంద్ర ఆర్థికశాఖ ఆ నిధులు ఎక్కడున్నాయో, ఏమయ్యాయో చెప్పాలని రాష్ట్రప్రభుత్వానికి తాజాగా లేఖ పంపింది. నిజానికి కేంద్రం విడుదల చేసిన మొత్తంతో పాటు, రాష్ట్ర వాటాగా కూడా కొన్ని నిధులు విడుదల చేసి కేంద్రం ఏ పథకానికి ఉద్దేశించి అయితే నిధులు విడుదల చేసిందో ఆ పథకాన్ని అమలు చేయాల్సి ఉంది. కానీ, ఇంత వరకు రాష్ట్రం తన వాటా నిధులు విడుదల చేయలేదు సరికాదా కేంద్ర నిధులను కూడా దర్జాగా వాడేసుకుంది. ఈ విషయంపై కేంద్ర ఆర్థిక శాఖ సీరియస్ అయి లేఖ రాయడంతో విషయం బయటపడింది. తప్పుదిద్దుకోవడం, తప్పు ఒప్పుకోవడం అలవాటు లేని జగన్ సర్కార్ అత్యవసర సమయంలో ఇలా కేంద్ర నిధులను రాష్ట్రాలు ఇతర పథకాలకు వాడు కోవడం కొత్తేమి కాదని.. మేము కూడా అలాగే వాడుకున్నామని చెప్తున్నారు. ఆ మొత్తాన్ని సాధ్యమైనంత త్వరగా సర్ధుబాటు చేస్తామని అధికారులు కేంద్రాన్ని బ్రతిమాలుకుంటున్నారు.
అయితే కేంద్ర నిధులను లెక్కా పత్రం లేకుండా వాడుకోవాల్సిన అత్యవసరం ఏంటో కూడా కాస్త వివరంగా చెప్తే బావుంటుంది. కానీ, అత్యవసరం అంటే అత్యవసరం అంతే లాజిక్కులు అడగకూడదు అన్నట్లు ఉంది జగన్ సర్కార్ తీరు. ఈ రూ.2,019 కోట్ల నిధులలోనే కాదు.. దాదాపుగా ఈ నాలుగేళ్ళలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక విధానం మొత్తం ఇలాగే అరాచకంగా ఉంది. రాష్ట్రంతో పాటు కేంద్ర పథకాల కోసం కూడా భారీగా నిధులు వస్తూంటాయి. ఈ నిధులకు తోడుగా రాష్ట్రం కూడా తన వాటా కలిపి పథకాలకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇందుకుగాను సింగిల్ నోడల్ ఏజెన్సీ ఖాతాలను ఏర్పాటుచేసి అటు కేంద్రం, ఇటు రాష్ట్రం నిధులు అందులో జమ చేసి వాటి ద్వారానే పథకాలు అమలు చేయాలన్న నిబంధన ఉంది. అయితే ఏపీకి మాత్రం ఏ నిబంధనలూ వర్తించవు అన్నట్లుగా ఇష్టారాజ్యంగా కేంద్రం నిధులను వాడేసింది.
ఈ విషయం కూడా కేంద్రానికి తెలియనిదేమీ కాదు. అయితే, అప్పుడప్పుడు ఇలా గదమాయిస్తుంది. గతంలో కూడా రెండుసార్లు ఇలాగే హెచ్చరించగా ఇది మూడవసారి. ఇప్పుడు కూడా జగన్ సర్కార్ దీన్ని సీరియస్ గా తీసుకోవడం లేదు. ఔను మాకు ఇచ్చిన నిధులే కదా మేము ఖర్చు చేసింది.. దేనికి ఎందుకు అని లెక్కలు అంటారా చెప్తాం కాస్త ఓపిక పట్టండి అన్నట్లుగానే వ్యవహరిస్తున్నది. కేంద్రం పట్ల సీఎం జగన్ వినమ్రత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదన్న సంగతి తెలిసిందే. కేంద్రంలో ఏ శాఖ అయినా కాస్త బోల్ట్ టైట్ చేస్తే ఎవరిని పట్టుకోవాలో జగన్ కు బాగా తెలుసు. అందుకే ధీమాగా కేంద్ర నిధులను వాడేసుకోగలుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.