త్వరలో మరో నలుగురు మంత్రులు అరెస్టు ?
posted on May 30, 2012 12:36PM
జగన్ అక్రమ ఆస్తుల కేసులో ఇతర మంత్రులు కూడా అరెస్టు అవుతారా? అనే అంశం పై
సచివాలయంలో చర్చించుకొంటున్నారు. జగన్ అక్రమ ఆస్తుల కేసు విషయంలో అరెస్టు అయిన మంత్రి మోపిదేవితోపాటు నాటి మైనింగ్ శాఖ మంత్రి, నేటి హోమంత్రి సబిత ఇంద్రారెడ్డి, నాటి ఇరిగేషన్ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మీరో సీనియర్ మంత్రి కన్నా లక్ష్మీనారాయణలు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వారిని కూడా సిబిఐ అధికారులు అరెస్టు చేసే అవకాశం వుందని చర్చించుకొంటున్నారు. ఇతర మంత్రులు అరెస్టు కాకపోతే సిబిఐ అపఖ్యాతికి గురయ్యే అవకాశం వుంటుందని వారు భావిస్తున్నారు. సిబిఐ అధికారి లక్ష్మీనారాయణ నిజాయితీ కలిగిన అధికారే కావచ్చు...కాని తన విధినిర్వహణలో ముఖ్యంగా మంత్రులు వంటి కీలక వ్యక్తులను అరెస్టు చేసే సమయంలో ఉన్నతాధికారుల సలహా, సూచనలు పాటించాల్సిందే. ఆ ఉన్నతాధికారులను ఢిల్లీ స్థాయి నాయకులు ప్రభావితం చేసే అవకాశం వుంది.
సబితను అరెస్టు చేస్తే తెలంగాణ వాదులతో ఇబ్బంది కలుగుతుంది ఇదే సమయంలో రెడ్డి సామాజికవర్గం కాంగ్రెస్ పార్టీకి మరింత దూరం అవుతుంది, కన్నా, పొన్నాలను అరెస్టు చేస్తే బలమైన కాపు సామాజికవర్గం పార్టీకి దూరమవుతుందనే భయం వుంది. చివరకు ఏ సపోర్టులేని అర్భకుడు, బిసీవర్గానికి చెందిన మోపిదేవిని అరెస్టు చేసే విధంగా సిబిఐను ఢిల్లీ నేతలు ప్రభావితం చేసే అవకాశం వుందని భావిస్తున్నారు. జగన్ అక్రమ ఆస్తుల కేసును సిబిఐ సమర్ధవంతంగా దర్యాప్తు చేస్తున్నప్పటికీ వివక్షతకు తావిచ్చే ఇటువంటి అంశాల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తోంది.