మర్రిని నిందించే నైతిక హక్కు జగన్‌కు లేదు!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇక భవిష్యత్తు లేదనే సంగతి ఆ పార్టీలోని నాయకులు అందరికీ అర్థం అవుతోంది. భవిష్యత్ లేని పార్టీలో ఉండడం కంటే.. రాజకీయాలు మానుకోవడమే బెటర్ అని కొందరు రాజీనామా చేస్తున్నారు. వెళ్లిపోయిన వారు పార్టీ మీద నిందలు వేయడం.. వెళ్లిపోయిన వారు ద్రోహులని పార్టీ నింద వేయడం చాలా మామూలు సంగతి.  వైసీపీ నుంచి వెళ్లిపోయిన వారందరి గురించి జగన్ కూడా ఇలాగే మాట్లాడుతూ వచ్చారు. అయితే ఇప్పుడు చిలకలూరిపేట నాయకుడు, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేసిన నేపథ్యంలో, ఆయనను నిందించడానికి గానీ, పార్టీకి ద్రోహం చేశాడని అనడానికి గానీ జగన్ కి  నైతిక హక్కు లేదని.. పార్టీ కార్యకర్తల్లోనే చర్చ జరుగుతోంది.

వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విధేయుడిగా ఉంటూ.. ఆయన వెంట నడిచినందుకు.. ఆయన వంచనకు గురైన వారిలో మర్రి రాజశేఖర్ ముందు వరుసలో ఉంటారు. ఆయనకు జగన్ చేసిన అన్యాయానికి ఆయన ఇన్నాళ్లూ పార్టీని అంటిపెట్టుకుని ఉండడమే చాలా పెద్ద విషయం అని ఆ పార్టీలో ఉన్న వారే వ్యాఖ్యానిస్తున్నారు.  
వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ ను అంటిపెట్టుకుని ఉన్న మర్రి రాజశేఖర్ కు.. 2014 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి జగన్ టికెట్ ఇచ్చారు. ఆయన ఓడిపోయారు. అప్పటినుంచి పార్టీ కోసం పనిచేస్తున్నప్పటికీ..  2019 ఎన్నికల్లో మర్రికి టికెట్ నిరాకరించారు జగన్!  అప్పుడే పార్టీలో చేరిన విడదల రజనికి జగన్ టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల ప్రచార సమయంలో మాత్రం.. మర్రి అభిమానులను ప్రలోభ పెట్టే మాటలు చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. మర్రి రాజశేఖర్ ను ఎమ్మెల్సీని చేసి, మంత్రిగా చేస్తానని బహిరంగ సభల్లోనే ప్రకటించారు. ఆయనకూడా విడదల రజని విజయం కోసం కష్టపడి పనిచేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత.. పదవి రజనికి దక్కింది తప్ప మర్రి రాజశేఖర్ ఊసు వినపడలేదు. ఎమ్మెల్సీగా మాత్రం చేశారు.
మధ్యలో మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించినప్పుడు.. మర్రికి పదవి గ్యారంటీ అని పార్టీలో అంతా అనుకున్నారు. కానీ.. అప్పుడు కూడా జగన్ మాట నిలబెట్టుకోలేదు. రాజశేఖర్ ఎంత సహనంతో ఉన్నప్పటికీ.. 2024 ఎన్నికల సమయానికి సర్వేల్లో విడదల రజనికి ప్రతికూల వాతావరణం ఉన్నట్టు తేలడంతో ఆమెను నియోజకవర్గం మార్చి గుంటూరు వెస్ట్ నుంచి పోటీచేయించారు. అప్పుడు మర్రి రాజశేఖర్ టికెట్ ఆశించినా ఇవ్వలేదు. చివరికి ఆ ఎన్నికల్లో పరాజయం తర్వాత.. మళ్లీ విడదల రజినిని వెనక్కు తీసుకువచ్చి పార్టీ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఇవన్నీ ఆయనకు మనస్తాపం కలిగించాయి. చాలా కాలంగా ఆయన పార్టీని వీడదలచుకున్నట్టుగా ప్రచారం జరిగింది.  వైవీ సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి లాంటి వాళ్లు ఆయనను బుజ్జగించడానికి ప్రయత్నించారు. బుధవారం మండలి ఛైర్మన్ కు రాజీనామా సమర్పించే ముందు బొత్స సత్యనారాయణ, ఇతర ఎమ్మెల్సీలు కొందరు కూడా రాజీనామా ఆలోచన మానుకోవాలని సూచించారు. అయితే మర్రి వారి మాటలను ఖాతరు చేయలేదు.  ఏ రకంగా చూసినా సరే.. మర్రికి జగన్ చేసిన అన్యాయాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి గనుక.. ఆయన నిష్క్రమణ.. రాజీనామా గురించి నింద వేయగల నైతిక హక్కు జగన్ కు లేదని.. పార్టీ కార్యకర్తలే గుసగుసలాడుకుంటున్నారు.