సి ఎం లెక్క.. భట్టి బడ్జెట్.. ఏది నిజం?
posted on Mar 20, 2025 9:42AM

బడ్జెట్ గురించి చర్చ వచ్చినప్పుడు, బడ్జెట్ అంటే కేవలం అంకెల కుప్ప కాదు. బడ్జెట్ అంటే మన విలువలు, మన ఆశలు, ఆశయాల ప్రకటన. అలాగే, ఒక మంచి బడ్జెట్ నాణేనికి ఒక వైపు నుంచి మాత్రమే కాదు, రెండు వైపుల నుంచీ, (బొమ్మ బొరుసు) రెండూ చూపిస్తుంది అంటారు బడ్జెట్ విలువ తెలిసిన పెద్దలు.
అయితే అధికారంలో ఎవరున్నా, పార్టీలు, జెండాలు, ఎజెండాలతో సంబంధం లేకుండా, బడ్జెట్ అంటే అంకెల గారడీ అనే అభిప్రాయం స్థిర పడి పోయింది. విలువలు, ఆశలు, ఆశయాల ప్రకటన అయితే, గాంధీ, నెహ్ర, అంబేద్కర్ లను ఉటంకిస్తూ.. అంత ఘనంగా ఉంటాయి కానీ అమలు చేసే ఆలోచన మాత్రం సామాన్యంగా కనిపించదు. అలాగే, వాస్తవ పరిస్థితిని ప్రజల ముందు ఉంచే ప్రయత్నం ( సాహసం అనాలేమో) ఏ ఆర్ధిక మంత్రి సహజంగా చేయరు.తెలంగాణ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అందుకు మినహాయింపు కాదు. బుధవారం (మార్చి 19) ఆయన ప్రవేశ పెట్టిన 2025 – 2026 పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ కూడా అందుకు మినహాయింపు కాదు.
ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి దాపరికం లేకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని కుండ బద్దలు కొట్టారు. ఏ నెలకు ఆ నెల రిజర్వు బ్యాంకు నుంచి రూ. 400 కోట్లు చేబదులు తెచ్చుకుంటేనే ప్రభుత్వ ఉద్యోగులకు ఫస్ట్ తారీకుకు జీతాలు ఇవ్వ గలుగు తున్నామని అసెంబ్లీ వేదికగా చెప్పారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ నెలసరి ఆదాయ వ్యయపట్టికను ఏ గోప్యతా లేకుండా సుత్తి లేకుండా, సుతి మెత్తగా మూడు ముక్కల్లో చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వ నెలసరి ఆదాయం రూ. 18 వేల కోట్ల నుంచి రూ. 18, 500 కోట్లు, అందులో, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల చెల్లింపుకు రూ. 6,500కోట్లు ఖర్చవుతుంది. మరో రూ. 6,500కోట్లు అప్పుల వడ్డీల చెల్లింపునకు పోతుంది. చివరకు చేతిలో మిగిలేది, రూ. 500 నుంచి రూ.5,500 కోట్లు. సంక్షేమ, అభివృద్ధి పధకాలు వేటికైనా.. ఈ రూ.500 ప్లస్ కోట్ల నుంచే ఖర్చు చేయాలని ఖుల్లం ఖుల్లాగా ఉన్నది ఉన్నట్లు చెప్పారు. కాదంటే, రాష్ట్ర అవసరాల రీత్యా ఇంకా ఏదైనా చేయాలంటే, ఏమి చేయాలో ఆయన చెప్పారో లేదో కానీ, అదేమంత రహస్యం కాదు. గత ప్రభుతం చేసి చూపిన మార్గంలోనే అప్పు చేయడం, ఆస్తులు, అమ్మడం ద్వారా ఖాజానాను కాపాడుకో వచ్చును. అలాగే, ప్రభుత్వ ఉద్యోగులకు డిఎ పెంపు పై ఆశలు పెట్టుకోవద్దని చెప్పినంత నిజాయతీగా సక్షేమ పధకాల అమలు విషయంలోనూ , నిజాయతీగా ‘ఆల్ ఫ్రీ, అందరికీ ఫ్రీ’ అనే పద్దతిలో కాకుండా, ఏట్లో పారేసినా ఎంచి పారేయాలన్న ఆర్థిక సూక్తిని, లబ్దిదారుల ఎంపికలో అంత్యోదయ విధానాన్ని పాటించడం ద్వారా ఖజానా బరువు ఇంకొంచెం పెంచుకోవచ్చును, అంటున్నారు. అయితే అలా చేయడం ఆర్థిక సూత్రాల పరంగా అంటే ఎకానమికల్లీ రైట్ అయినా రాజకీయంగా కొంప ముంచుతుంది. అందుకే భట్టి విక్రమార్క తమ దారిలోనే వెళ్ళారు. మొత్తం పద్దు రూ.3,04,965 కోట్లలో రెవెన్యూ వ్యయం రూ. 2,26,982 కోట్లుగా, మూలధన వ్యయం రూ. 36,504 కోట్లుగా చూపించారు. అంటే అభివృద్ధిని ఆఫీషియల్ గా అటక ఎక్కిచారు.
అందుకే పాత పద్దతిలోనే కొంచెం అటూ ఇటుగా కేటాయింపులు చేసుకుంటూ వెళ్లారు. కేటాయింపుల విషయానికి వస్తే రైతు భరోసాకు, రూ. 18వేల కోట్లు, వ్యవసాయానికి రూ. 24,439 కోట్లు, పశు సంవర్డక శాఖకు రూ. 1,674 కోట్లు, పౌర సరఫరాల శాఖకు రూ. 5,734 కోట్లు, విద్యా శాఖకు రూ. 23,108 కోట్లు, కార్మిక ఉపాధి కల్పన శాఖకు రూ. 900 కోట్లు, పంచాయతీ రాజ్ శాఖకు, రూ. 31,605 కోట్లు, మహిళా శిశు సంక్షేమ శాఖకు రూ. 2862 కోట్లు కేటాయించారు. అందుకే, భట్టి బడ్జెట్ రాష్ట్ర వాస్తవ పరిస్థితిని, వాస్తవ అవసరాలను, అవకాశాలను అంచనావేయడంలో విఫల మైందనీ, కాదంటే, రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి రాజకీయ ప్రయోజనాలకు పెద్దపీట వేసిందనే మాటే ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే, రాజకీయంగా అయినా, ప్రయోజనం చేకురుస్తుందా అంటే, అదీ అనుమానమే అంటున్నారు.
నిజానికి ప్రతిపక్షాలు ఇప్పటికే ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలు ఏమైందని ప్రశ్నిస్తున్నాయి. ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలుకు బడ్జెట్ లో కేటాయింపులు ఏవని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షు డు కేటీఆర్ ప్రశ్నించారు. భట్టి బడ్జెట్లో కేటాయింపులు సరిగా లేవనీ, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కట్ అంటూ.. రైతులకు రుణమాఫీ కట్ , రైతులకు రైతుభరోసా కట్ , రైతులకు రైతుబీమా కట్ , ఆడబిడ్డలకు కేసీఆర్ కిట్ కట్ గర్భవతులకు న్యూట్రిషన్ కిట్ కట్, విద్యార్థినులకు హెల్త్ కిట్, ఎలక్ట్రిక్ స్కూటీ కట్, మహిళలకు నెలకు రూ.2500 మహాలక్ష్మి కట్, ఆఖరికి పేదలకు రేషన్ బియ్యం కట్, కాంగ్రెస్ అంటే కటింగ్ అంటూ ‘ఎక్స్’ వేదికగా రెచ్చిపోయారు. ఆఫ్ కోర్స్, కేటీఅర్ చెప్పిందంతా నిజమని అనవలసిన అవసరం లేదు కానీ, స్వయంగా ముఖ్యమంత్రి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇదీ అని, ‘విప్పి’ చెప్పిన నేపధ్యంలో భట్టి బడ్జెట్ మీద అనుమానాలు రావడం సహజం. ఆర్థిక నిపుణులు కూడా అదే అంటున్నారు.