సుప్రీం నోటీసులు..మంత్రులు, ఐఏఎస్‌లలో కలవరం

హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల కేసులో ఆరుగురు మంత్రులు, ఎనిమిది మంది ఐఏఎస్‌లకు నోటీసులు జారీ చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలు కలకలం సృష్టిస్తున్నాయి. 'ఆ 26 జీవోలు' జారీ చేసిన మంత్రులు, అధికారపక్ష నేతలు పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా... లోలోపల మాత్రం ఆందోళన కనిపిస్తోంది. 'ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో!? ఇది ఎవరెవరి మెడకు చుట్టుకుంటుందో?' అనే చర్చ మొదలైంది. ఆస్తుల కేసులో సిబిఐ విచారణ ఎదుర్కొంటున్న కడప లోక్‌సభ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్‌రెడ్డికి సుప్రీంకోర్టు నిర్ణయం సానుకూలం కానుందా? సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్‌లో పిటిషన్‌దారుడు పేర్కొన్న ఇరవై ఆరు జీవోలను అప్పటి సంబంధిత మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వం సమర్థించుకుంటుందా? లేక తప్పు జరిగినట్టు అంగీకరిస్తారా? అన్న దానిపై జగన్ ఆక్రమ ఆస్తుల కేసులో సిబిఐ జరుపుతున్న విచారణపై ప్రభావం చూపించవచ్చునని భావిస్తున్నారు.

ఆ జీవోలు సక్రమమే అని వాదించే పక్షంలో జగన్ మీద చేస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని స్పష్టమవుతుంది. ఫలితంగా జగన్‌కు ఊరట లభిస్తుంది. ఒకవేళ జీవోలు సక్రమం కాదని చెప్పిన పక్షంలో సంబంధిత మంత్రులపై చర్యలు తీసుకోవలసి ఉంటుంది. ఫలితంగా ప్రభుత్వం ఇరకాటంలో పడుతుంది. ఈ నేపథ్యంలో... మంగళవారం అసెంబ్లీ లాబీల్లో మంత్రులు, ఇతర నేతలు సుప్రీం నోటీసులపైనే చర్చించుకోవడం కనిపించింది. డాక్టర్ వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆయన ప్రభుత్వం కొందరికి ప్రయోజనం కలిగించేలా నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా జగన్ సంస్థల్లో పెట్టుబడులు వచ్చాయన్నది ఆరోపణ.

దివంగత వైఎస్ ప్రభుత్వం ‘ఇచ్చి పుచ్చుకునే విధానం ’ (క్విడ్ ప్రో క్యూ) అనుసరించడం వల్లే జగన్‌కు అక్రమంగా ఆస్తులు సమకూరాయన్నది అభియోగం. దీనిమీదనే ప్రస్తుతం సిబిఐ విచారణ జరుపుతోంది. వైఎస్ హయాంలో ఇరవై జీవోలు అక్రమంగా జారీ అయ్యాయని, జీవోల జారీకి బాధ్యులుగా పేర్కొంటూ ఆరుగురు మంత్రులు, ఎనిమిది మంది అధికారులపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.


ఒకవేళ మంత్రులకు కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసే పక్షంలో వ్యక్తిగతంగా జారీ చేస్తుందా? లేక ప్రస్తుత మంత్రులుగా జారీ చేస్తుందా? అన్న చర్చ కూడా మంత్రుల్లో జరిగింది. సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌లో ‘అప్పటి మంత్రులు (ది దెన్‌ది మినిస్టర్స్) అని పేర్కొన్నారు కాబట్టి, వ్యక్తిగత హోదాలోనే వారికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయవచ్చని, ప్రభుత్వానికి ఇందులో సంబంధం ఉండదని గాదె వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు. అందువల్ల సుప్రీం నోటీసులకు ప్రస్తుత మంత్రులు వ్యక్తిగత హోదాలోనే సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని, ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం లేదని వారికి ఆయన చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu