ధర్మాన, యర్రన్నలకు ముందు నుయ్యి వెనక గొయ్యి
posted on Mar 14, 2012 12:04PM
శ్రీకాకుళం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరపున మంత్రి ధర్మాన ప్రసాదరావు, టిడిపి తరపున కింజరావు యర్రంనాయుడు తిరుగులేని నాయకులుగా చలామణి అవుతున్నారు. అయితే వీరిద్దరికీ నర్సన్నపేట ఉప ఎన్నికలు ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా సంకటంగా మారాయి. ఈ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున తాజా మాజీ ధర్మాన కృష్ణదాస్ పోటీచేస్తున్నారు. ఈయన రాష్ట్రమంత్రి ధర్మాన ప్రసాదరావుకు స్వయానా సోదరుడు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎంపిక చేసి, అతన్ని గెలిపించే బాధ్యత అధిష్టానం మంత్రి ధర్మానపైనే ఉంచింది. ఇది ధర్మానకు ఏమాత్రం మింగుడు పడటం లేదు. ఇప్పటికే ధర్మాన కుటుంబంలో చీలికలు వచ్చాయి. తన అన్నకు వ్యతిరేఖంగా మంత్రి ధర్మాన ప్రసాదరావు చురుకుగా వ్యవహరిస్తే కుటుంబంలో విబేధాలు మరింత పెరిగే అవకాశం వుంది. ఒకవేళ ఉప ఎన్నికల్లో ధర్మాన సూచించిన వ్యక్తి ఎన్నికల్లో ఓడిపోతే జిల్లాలోనూ, రాష్ట్ర రాజకీయాల్లోనూ మంత్రిగారి ప్రతిష్ట మసకబారిపోతుంది. పరిస్థితులు ఇంకా ప్రతికూలంగా మారితే ఆయన పదవే ఊడిపోయే ప్రమాదం ఉంటుంది.దీంతో ఆయన దిక్కుతోచక వ్యూహంతో ఎన్నికలో గట్టెక్కాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
దీనిలో భాగంగా ఆయన టిడిపి నేత ఎర్రంనాయుడుతో లాలూచీ పడే అవకాశం ఉన్నట్లు రాజకీయ పరీశీలకులు అంటున్నారు. మరోవైపు ఈ ఎన్నిక కింజరాపు ఎర్రంనాయుడుకు కూడా పెద్ద సవాలుగా మారింది. కృష్ణదాస్ ను, కాంగ్రెస్ నిలబెట్టబోయే అభ్యర్థిని సమర్ధవంతంగా ఢీకొనాలంటే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున కింజరాపు సోదరుల్లో ఒకరిని పోటీకి నిలపాలని చంద్రబాబునాయుడు యోచిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఎర్రంనాయుడు గొంతులో పచ్చివెలగకాయ పడినట్లయింది. ఉపఎన్నికల్లో పోటీచేసే ఓటమి పాలైతే రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్లే అవుతుందని ఎర్రంనాయుడు భయపడుతున్నాడు. అందుకే తన కుటుంబ సభ్యులను ఈ ఎన్నికలకు దూరంగా పెట్టడంతోపాటు కాంగ్రెస్ తో మ్యాచ్ ఫిక్సింగ్ కు ప్రయత్నిస్తున్నారు. నిజానికి ధర్మాన, కింజరాపు మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ కొత్తేమీ కాదని, 1996 నుంచి వారిద్దరూ ఈ సూత్రాన్నే పాటిస్తే రాజకీయంగా ఎదిగారని వారి ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. ఉప ఎన్నికల్లో నర్సన్నపేటలో కాంగ్రెస్ అభ్యర్థికి టిడిపి లోపాయికారీగా మద్దతునివ్వటం, టిడిపి ద్వితీయశ్రేణి నాయకుడిని అభ్యర్థిగా నిలబెట్టి నామమాత్రంగా పోటీలో ఉండటం, అందుకు ప్రతిగా విశాఖజిల్లా పాయకారావుపేట నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టిడిపికి కాంగ్రెస్ సహకరించడం అన్న మ్యాచ్ ఫిక్సింగ్ విధానాన్ని ఈ ఇద్దరు నాయకులు అమలు చేయబోతున్నట్లు తెలిసింది.