తెలంగాణలో కనిపించని జగన్ అరెస్టు ప్రభావం
posted on May 29, 2012 2:13PM
వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహనరెడ్డి అరెస్టు ప్రభావం తెలంగాణా ప్రాంతంలో పెద్దగా కనిపించలేదు. జగన్ అరెస్టుపై ఆదివారం నాడు రాష్ట్రం మొత్తంగా ఉత్కంఠ నెలకొన్నప్పటికీ తెలంగాణా ప్రాంతంలో ప్రధానంగా కరీంనగర, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, వరంగల్ లలో పరిస్థితి ప్రశాంతంగానే వుండి. జగన్ ను తాము ప్రత్యేక తెలంగాణా ఏర్పాటును వ్యతిరేకించే సమైక్యవాదిగానే పరిగణిస్తామని, జగన్ అరెస్టుతో మాకు సంబంధం లేదని టి.ఆర్.ఎస్. నేత చంద్రశేఖర రావు ముందుగానే ప్రకటన చేశారు. జగన్ అరెస్టు కంటే తమకు ప్రత్యేక తెలంగాణా ఉద్యమమే ముఖ్యమని తెలంగాణా నేతలు భావిస్తున్నారు. త్వరలో ఉప ఎన్నిక జరగనున్న వరంగల్ జిల్లాజ్ పరకాల ప్రాంతంలో కూడా ఎటువంటి హడావుడి కనిపించలేదు. రాష్ట్రంలో మొత్తం 18 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నప్పటికీ తెలంగాణాలో కేవలం ఒక్క పరకాలలో మాత్రమే ఉప ఎన్నిక జరుగుతోంది. ఇక్కడ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొండా సురేఖ గతంలో తాను తెలంగాణా కోసం రాజీనామా చేశానేకాని ... జగన్ కోసం కాదని ప్రకటించారు. ఆ స్థితిలో ఇప్పుడు జగన్ కు మద్దతుగా మాట్లాడితే తెలంగాణా వాదాన్ని విస్మరించినట్టు అవుతుందని, దాంతో ఓటింగ్ లో నష్టపోవాల్సి వస్తుందని సురేఖ వర్గీయులు ఆందోళన చెందుతున్నారు.