జగన్ జైలులో ఎంతకాలం ఉంటారు?

తాను అరెస్టు అయితే తన తల్లి, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ పార్టీ వ్యవహారాలను చూస్తారని అరెస్టుకు ముందు ఆ పార్టీ అధ్యక్షులు జగన్మోహనరెడ్డి వ్యాఖ్యానించినట్టుగానే జగన్ అరెస్టు అయిన వెంటనే ఆమె ఇతర కుటుంబ సభ్యులతో కలిసి దిల్ కుషా ఎదురుగా ధర్నా చేయడం ద్వారా పార్టీ బాధ్యతలు చేపట్టినట్లయింది. జగన్ అరెస్టు అయినట్టు సమాచారం అందిన వెంటనే దిల్ కుషాకు విచ్చేసిన విజయమ్మ ఇతర కుటుంబ సభులు జగన్ తో సంప్రదింపులు జరిపి బయటికి వచ్చిన వెంటనే అనూహ్యంగా అరెస్టుకు నిరసన వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు. అయితే అప్పటికే పోలీసులు నగరంలో 144వ సెక్షను అమలు చేస్తున్నందున ధర్నాలు వంటి కార్యక్రమాలు చేయకూడదంటూ ఆమెకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఆమె వినిపించుకోకపోవడంతో పోలీసులు బలవంతంగా వారిని అదుపులోకి తీసుకుని ఇంటికి తరలించారు.


 

అనూహ్యంగా ధర్నాకు దిగడం, గంటన్నరపాటు కూర్చున్న చోటునుంచి కదలకపోవడం ద్వారా ఆమె పార్టీలో క్రియాశీలక బాధ్యతలు చేపట్టినట్టు ఇటు ప్రజలకు, అటు పార్టీ కార్యకర్తలకు తెలియచేసినట్లయింది. గడ్డి కుంభకోణం సందర్భంగా బీహార్ లో నాటి ముఖ్యమంత్రి లల్లూ ప్రసాద్ యాదవ్ అరెస్టు అయినప్పుడు అప్పటి వరకు వంటింటికే పరిమితంగా వున్న ఆయన సతీమణి రబ్రీదేవీ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి చక్రం తిప్పినట్టుగా ప్రస్తుతం కొడుకు అరెస్టు కావడంతో తల్లి విజయమ్మ రాజకీయ రంగంలోకి ప్రవేశించారు. తెరముందు రబ్రీదేవి ముఖ్యమంత్రిగా వున్నా అంతా తెరవెనుక వుండే లల్లూ పాలన కొనసాగించినట్టు ప్రస్తుతం విజయమ్మను ముందు పెట్టి తెరవెనుక వుండి జగన్ పార్టీని నడిపిస్తారా? అసలు జగన్ జైలులో ఎంతకాలం వుంటారు? ఎప్పటికి బెయిల్  వస్తుంది అనే అంశాలపై ప్రజలలో చర్చలు జరుగుతున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu