జగన్ ఆస్తులపై సిబిఐ విచారణ ఆపే ఎత్తుగడ
posted on Sep 10, 2011 12:31PM
న్యూఢి
ల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తులపై సిబిఐ దర్యాప్తును ఆపించాలని విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మరిన్ని పిటిషన్లు వేసే ఎత్తుగడలో ఉన్నారు. జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, సండూర్ పవర్ కంపెనీల పేరిట మూడు పిటిషన్లను సుప్రీంకోర్టులో దాఖలు చేయడం అందులో భాగమేనని అంటున్నారు. ప్రతివాదులు ఎర్రన్నాయుడు, శంకర్‌రావులపై జగతి పబ్లికేషన్స్ దాఖలు చేసిన ప్రత్యేక లీవ్ పిటీషన్లు న్యాయమూర్తులు జస్టిస్ దల్వీర్ భండారీ, జస్టిస్ దీపక్‌వర్మలతో కూడిన ధర్మాసనం ముందుకు శుక్రవారం విచారణకు వచ్చాయి. జగన్మోహనరెడ్డి తమ కంపెనీల్లో ఒక ప్రమోటర్ మాత్రమేనని, అంతకుమించి ఆయనకు తమ కంపెనీలకు సంబంధమేం లేదని అన్నారు. జగన్‌పై రాజకీయంగా జరుగుతున్న విచారణకు, తమ సంస్థలకు సంబంధం లేదన్నారు. కాబట్టి, తమ సంస్థలపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. కొత్తగా వేసిన మూడు పిటిషన్లలో ఒకటి శుక్రవారం విచారణకు రాగా, సండూర్ పవర్ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. ఇందిరా టెలివిజన్ పిటిషన్‌పై విచారణ ఇంకా జరగాల్సి ఉంది. అయితే సీబీఐ విచారణకు హైకోర్టు వద్ద అన్ని ఆధారాలూ ఉన్నాయని గతంలోనే సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో, జగన్ ఎన్ని పిటిషన్లు వేయించినా అవి తిరస్కరణకే గురవుతాయని న్యాయనిపుణులు చెబుతున్నారు.