ఇది ముమ్మాటికి అవమానించడమే
posted on Jul 19, 2022 11:37PM
తాతగారి ఆరోగ్యం బాగోలేదు రమ్మని పిలిచి వచ్చినవారితో మనవరాలి పెళ్లి గురించి మాట్లాడాడట పూర్వం ఓ పెద్దాయన. అదుగో అలా ఏడిచింది కేంద్రం అఖిలపక్ష భేటీ. శ్రీలంక సంక్షోభం గురించి చర్చించడానికి పిలిచిన కేంద్రం రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితిపై కేంద్ర ప్రజంటేషన్ ఇవ్వడం కంటే విడ్డూరం ఏమన్నా ఉంటుందా అని వెళ్లినవారంతా మండిపడ్డారు. ఇంత అనాలోచితంగా కేంద్రం వ్యవహరించడం పై టీఆర్ ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే.కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
కేంద్రం చేసిన అప్పులపై నిలదీశారు. తలసరి ఆదాయంలో దేశంలోనే రెండవ స్థానంలో తెలంగాణ ఉందని సమావేశంలో తెలిపారు. కేవలం ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల అప్పులు గురించే మాట్లాడడం వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని కే కే, నామా మండిపడ్డారు. శ్రీలంక సంక్షోభంపై చర్చకు పిలిచి దానిని వదిలేసి మరొక అంశాన్ని చర్చించడం అసందర్భంగా ఉందన్నారు.
ఇక కేంద్ర ప్రభుత్వ వైఖరిని టీఆర్ఎస్‌తో పాటు విపక్ష పార్టీలు ఖండించాయి. సందర్భం లేకుండా రాష్ట్రాల అప్పులపై ప్రజెంటేషన్ ఏంటి అని నిలదీశాయి. తెలంగాణ జీఏస్డీపీలో 23శాతం కంటే ఎక్కువ అప్పులు తీసుకుంటున్నారన్న వాదనను టీఆర్ఎస్ తోసి పుచింది. ఇదే కేంద్ర ప్రభుత్వం 59శాతం పైగా అప్పులు తీసుకుందని దీనికి జవాబు ఎవరు ఇస్తారని ఎంపీ కేశవరావు ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్ర అప్పులు కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించిన ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోనే ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం అప్పులు ఏకంగా 6.2% శాతాన్ని అధికమని ఎత్తి చూపారు. తీసుకున్న అప్పులను చెల్లించడంలో తెలంగాణ నిర్లక్ష్యం చేసిందా?. కేంద్రం చేసిన అప్పులకు సమాధానం ఎవరు ఇస్తారు?. దేశ ఆర్థిక పరిస్థితిపై చర్చ జరగాలని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కేకే డిమాండ్ చేశారు.
కేంద్రం ఇలాంటి అర్ధంలేని సమావేశాలతో ఉన్న పరువు పోగొట్టుకోవడం తప్ప ప్రయోజనమేమీ ఉండదు. రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితి మీద చర్చించడానికి ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి నిపుణులతోనూ చర్చ చేయాలి. కానీ ఈ విధంగా పిలవడంలో ఆంతర్యమేమి టన్నది కేంద్రంలోని బిజెపి వర్గాలే చెప్పాలి. అయితే రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితిని శ్రీలంకతో పోల్చడం ఈమధ్య బిజెపీ హేమా హేమీలకు పరిపాటిగా మారింది.
నిజంగానే అలా మారి తమ పాదాలమీద పడతే ఆనందించి తృణమో పణమో పడేద్దామన్న ఆలోచనలో బిజెపీ పెద్దలు ఉన్నారన్నది స్పష్టమవుతోంది. కేంద్ర ప్రభుత్వం అంటే పెద్దమనిషి పాత్ర పోషించాలనే భావన బిజెపి వారి రాకతో పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది. తమ పార్టీ అధికారంలో లేని రాష్ట్రాల్లో ఏదో ఒక సమస్యకు బీజం నాటి ఆనక వచ్చి తగాదాను లేవనెత్తి, సమస్యను జటిలం చేసి ఎందుకు పనికిరారని అనడం, అవమానించడం, ప్రచారం చేయించుకోవ డంలో బిజెపీ నాయకులు చాలా నైపుణ్యం సాధించారు. అన్ని రాష్ట్రాలను సమానంగా చూసుకోవాల్సిన కేంద్రం బిజెపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలల్లో చిన్నపిల్లల్లా గిల్లికజ్జాలు పెట్టుకోవడం అలవాటుగా చేసుకున్నారు. మనసులో కుట్ర ఉన్నవారు మన్ కీ బాత్ లో ఇక ఏమి చెప్పి ప్రజల మెప్పు పొందుతారు?