ఆ జిల్లా పేరు మారనుందా? వివాదం కానుందా? 

తెలంగాణలో ప్రస్తుతం 33 జిల్లాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినపుడు 10 జిల్లాలు మాత్రమే ఉండగా.. కేసీఆర్ సర్కార్ 10 జిల్లాలను విభజించి 33 జిల్లాలు చేసింది. గతంలో ఉమ్మడిగా ఉన్న కొన్ని జిల్లాలు ఐదు ముక్కులు ,కొన్ని నాలుగు ముక్కలు , కొన్ని మూడు ముక్కలు అయ్యాయి. మరికొన్ని ఉమ్మడి జిల్లాలను రెండుగా విభజించారు. కొన్ని జిల్లాలకు దేవతల పేర్లు కూడా పెట్టారు. భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, జోగులాంబ గద్వాల ఆ కోవలోనివే. జయశంకర్, కొమరం భీమ్ పేర్లు కూడా జిల్లాలకు పెట్టారు. అయితే తాజాగా ప్రస్తుతం ఉన్న ఒక జిల్లా పేరు మార్చబోతున్నారని తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకోబోయే ఈ నిర్ణయంపై అక్కడి ప్రజలు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది. కొత్త వివాదం అవుతుంగా.. అంతా సాఫీగానే సాగుతుందా అన్న చర్చ కూడా మొదలైంది. 

ఈనెల 21న సీఎం కేసీఆర్ వరంగల్‌లో పర్యటించనున్నారు. సెంట్రల్ జైలు స్థానంలో నిర్మించ తలపెట్టిన సూపర్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి సీఎం కేసీఆర్ భూమి పూజ చేయనున్నారు.కేసీఆర్ కాళోజీ హెల్త్ వర్సిటీ, కొత్త కలెక్టరేట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లాల విభజనలో వరంగల్ ఐదు ముక్కలైంది. భూపాలపల్లి, జనగామ, ములుగుతో పాటు వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాలు ఏర్పాటయ్యాయి. అయితే వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ పేర్లను మార్చాలని ప్రభుత్వం భావిస్తుందని చెప్పారు ఎర్రబెల్లి. వరంగల్ రూరల్ జిల్లాకు వరంగల్ పేరు ఖరారు చేస్తూ.. వరంగల్ అర్బన్ జిల్లా పేరును హన్మకొండగా సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని చెప్పారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. 

మంత్రి ఎర్రబెల్లి ప్రకటన వరంగల్ లో చర్చనీయాంశంగా మారింది. జిల్లాల విభజన సమయంలోనే వరంగల్ రూరల్, అర్బన్ పేర్లపై అసంతృప్తి వ్యక్తమైంది. హన్మకొండ పేరు పెట్టాలనే డిమాండ్ వచ్చింది. వరంగల్ రూరల్ కేంద్రంగా నర్సంపేటను ప్రకటించాలని కొందరు ఆందోళన చేశారు. అయితే ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. తాజాగా జిల్లాల పేర్లు మార్పు తెరపైకి రావడంతో జనాల్లో చర్చ జరుగుతోంది. వరంగల్, హన్మకొండ పేర్ల పెడితే ఎక్కువ మంది జనాలు సంతృప్తి వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ పేర్లు కాకుండా వరంగల్ తో సంబంధం లేని పేర్లు పెడితే మాత్రం జనాల నుంచి వ్యతిరేకత రావొచ్చని చెబుతున్నారు. మరీ ముఖ్యమంత్రి పర్యటనలో ఏం ప్రకటిస్తారో చూడాలి మరీ..