ఇక ప్రెస్ కాన్ఫరెన్సులకు A’ సర్టిఫికేట్ ..? ఏపీలో బూతు మంత్రుల జోరు?
posted on Jun 19, 2021 6:49PM
నోరు మంచిదైతే ... ఊరు మంచిదవుతుందని, సామెత. అయితే ఈ మధ్య కాలంలో రాజకీయనాయకులు ఎంతగా నోరు పారేసుకుంటే అంతగా పాపులారిటీ పెరిగిపోతుందని అనుకుంటున్నారో ఏమో కానీ, అశుద్ధంతో సమానమైన, అంతకంటే నీచమైన భాషను నోటి ద్వారా విసర్జిస్తున్నారు. నిజమే, రాజకీయలలో ఉన్నప్పుడు, కొన్ని సందర్భాలలో మాటకు మాట, తూటాకు తూటా అన్న రీతిలో సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. కానీ, తెలుగునాట, ముఖ్యంగా ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికార పార్టీలో అందరూ కాకపోయినా, కొందరు, ముఖ్యంగా ‘బూతుల మంత్రి’గా పేరొందిన గౌరవ మంత్రి గారు మరో కొందరు అసహ్యంగా, అసభ్యంగానే కాదు, ఆ స్థాయి జనాలు కూడా ఛీ’ అని చీదరించుకునే స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారు. అందుకే అధికార పార్టీ, బూతులను అధికార భాషగా ఎంచుకుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కర్నూల్ జిల్లా పెసరవాయిలో జరిగిన టీడీపీ నాయకులు జంట హత్యలకు సంబందిచి, టీడీపీ నాయకుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సహజంగానే కొంత తీవ్రంగా స్పందించారు. ఈ హత్యలపై సీబీఐ విచారణ డిమాండ్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే లోకేష్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి కొడాలి నానీ వాడిన భాష, చాలా చాలా ఛండాలంగా, అసభ్యంగా ఉందని, సీనియర్ విలేకరులు చీదరించుకుంటున్నారు. “గతంలోనూ ఇటు చట్టసభల్లో అటు మీడియా సమావేశాలు, ఇతర వేదికల నుంచి మంత్రులు, ఇతర నాయకులు తమ రాజాకీయ ప్రత్యర్ధులను దూషించడం, దుర్భాషలాడడం చూశాం, కానీ, మంత్రులు ఈస్థాయిలో దిగజారిన సందర్భాలు లేవు” అని ఒక సీనియర్ జర్నలిస్ట్ ఒక విధంగా బాధను వ్యక్త పరిచారు.
ఒక్క కొడాలి నాని మాత్రమే కాదు, వైసీపీలో ఇలాంటి దిగజారుడు భాషను ప్రయోగించే వారు ఇంకా ఉన్నారు.గతంలో అనేక సందర్భాలలో మఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహా అనేక మంది వైసీపీ నాయకులు సభ లోపలా వెలుపలా ప్రతిపక్షాన్ని, ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడు,చంద్రబాబును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, ప్రతిపక్ష నేతను సంభోదించిన తీరు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. అయితే, దున్నపోతు మీద జడివాన లాగా వాటిని తుడిచేసుకుని, ముఖ్యమంత్రి ప్రాబల్యం కోసం కొందరు, పై వారి ఆదేశాల మేరకు కొందరు పోటీపడి దిగజారిన బూతు భాషను, అచ్చోసిన ... లా యధేచ్చగా వాడిన సందర్భాలు అనేకం ఉన్నాయి.నిజమే, ఒక్క వైసీపీ మాత్రమే దిగజారిందని, ప్రతిపక్ష పార్టీలు ఎక్కడా గీత దాటలేదని కాదు. విపక్షాలు, ముఖ్యంగా తెలుగు దేశంపార్టీ నాయకులు కొందరు, కొన్ని కొన్ని సందర్భాలలో ప్రెస్ కాంఫెరేన్సులలో,మీడియా చర్చల్లో నోరు జారిన సందర్భాలున్నాయి. అయితే, అలాంటి సందర్భాలలో పార్టీ నాయకత్వం వారిని మందలించడం, క్షమాపణ చెప్పించడం ఉండేది. కొన్ని కొన్ని సందర్భాలలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా క్షమాపణలు చెప్పారు. కానీ, జగన్మోహన్ రెడ్డి అందుకు విరుద్ధంగా వ్యవహర్సితున్నారని, అయన వ్యవహార శైలిని దగ్గరగా చూస్తున్న పాత్రికేయులు అంటున్నారు.
చంద్రబాబు నాయుడు మాత్రమే కాదు చివరకు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా కొన్ని సందర్భాలలో తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. అలాగే క్షమాపణలు కూడా చెప్పారు. కానీ, ఆయన కుమారుడే అయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో అలాంటి లక్షణాలు కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదని, చిన్నంతరం పెద్దంతరం లేకుండా ప్రతిపక్ష నాయకులను దూషించడం, దుర్భాషలాడడంలో ఆయన ఒక విధమైన ఆనందం పొందుతున్నారని సీనియర్ పాత్రికేయులు అంటున్నారు. ఒక విధంగా చూస్తే, ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నట్లుగా , ‘జగన్ రెడ్డిలో శాడిజం ఛాయలు చాలా బలంగా ఉన్నాయని పిస్తుందని, అందుకే అయన మెప్పు కోసం కొందరు వైసీపీ నాయకులు తమ స్థాయిని దిగాజార్చుకుని, బజారు బాషకంటే దిగజారుడు భాషలో మాట్లాడుతున్నారని’ సీనియర్ పాత్రికేయుడు ఒకరు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.
వైసీపీ నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియాలోనూ చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు, జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఏ2 ముద్దాయి విజయసాయి రెడ్డి, పెద్దల సభ సభ్యుడిని అనే విషయం మరిచి పోయి చేస్తున్న వ్యాఖ్యలను నెట్’ జనులు కామెంట్ల రూపంలో అసహ్యించుకుంటున్నారు.అలాగే, విజయ సాయి మీడియా సమావేశాలో, ట్వీట్స్ లో వాడే భాష పట్ల కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయని అంటున్నారు. ముఖ్యంగా దాతృత్వానికి మారు పేరుగా నిలిచిన గజపతుల వంశంలో పుట్టిన అశోక గజపతి రాజును ‘దొంగ’ అని సంభోదించడం,ఆయన భూములు కాజేశారని ఆరోపించడం, జైలుకు వెళ్తారని చెప్పడం నెట్జనులే కాదు అందరూ తప్పుపడుతున్నారు. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు ఎలా ఉన్నా, అందులో నిజానిజాలు ఎలాఉన్నా, భాష విషయంలో జాగ్రత్త పడక పోతే, ఇప్పటికే అసహ్యించుకుంటున్న ప్రజలు రేపు ఇంకో అడుగు ముందుకేస్తారని హెచ్చరిస్తున్నారు. ఈపరిస్థితులను గమనిస్తే, ఇక ముందు కొందరు నేతల ప్రెస్ కాన్ఫరెన్సులకు, ఏ(అడల్ట్స్ఓన్లీ)సర్టిఫికేట్ అవసరం అవుతుందేమో ..