జగన్ రెడ్డికి కేసీఆర్ షాక్.. ఇక సమరమే!
posted on Jun 19, 2021 9:54PM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. తన జిగ్రీ దోస్తీ అయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఊహించని షాక్ ఇచ్చారు. జగన్ రెడ్డి సర్కార్ పై సమరనాదం మోగించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ఏపీతో తాడోపేడో తేల్చుకుంటామని ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం, రాజోలిబండ (ఆర్ డిఎస్) కుడి కాల్వ నిర్మాణాలను తెలంగాణ కేబినెట్ తీవ్రంగా నిరసించింది. ఏపీ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించిందని, సుప్రీంకోర్టులో కేసులు వేసిందనీ నీటిపారుదల శాఖ కేబినెట్ కు తెలిపింది. ఎన్ జీ టీ తో పాటు కేంద్రం కూడా ఆదేశించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఆదేశాలను బేఖాతరు చేస్తుందని తెలంగాణ కేబినెట్ ఆరోపించింది. తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఎంత దూరమైనా పోవాలని కేబినెట్ అభిప్రాయ పడింది.
ఏపీ ప్రభుత్వం తలపెట్టిన ప్రాజెక్టుల వలన.. పాలమూరు, నలగొండ,ఖమ్మం,వరంగల్, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరు.. హైద్రాబాద్ కు తాగునీరు విషయంలో తీవ్ర అన్యాయం జరగనున్ననేపథ్యంలో.. న్యాయంగా దక్కాల్సిన కృష్ణా నీటి వాటాను దక్కించుకోవడానికి ఎంత దూరమైనా వెళతామని కేసీఆర్ ప్రకటించారు. ఇందులో భాగంగా కొత్తగా పలు ప్రాజెక్టులు చేపడట్టాలని తీర్మానించారు. జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల మధ్య కృష్ణా నదిపై అలంపూర్ వద్ద.. గుమ్మడం, గొందిమల్ల, వెలటూరు, పెద్ద మారూరు గ్రామాల పరిధిలో.. బారేజీ (జోగులాంబ) ని నిర్మించి 60-70 టిఎంసీల వరద నీటిని పైపు లైను ద్వారా తరలించాలని కేసీఆర్ కేబినెట్ నిర్ణయించింది. దీంతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అంతర్బాగమయిన ఏదుల రిజర్వాయర్ కు ఎత్తిపోసి, పాలమూరు కల్వకుర్తి ప్రాజెక్టుల ఆయకట్టు అవసరాలను తీర్చాలని కేబినెట్ నిర్ణయించింది.
పులిచింతల ఎడమ కాల్వను నిర్మాణం చేసి నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ణయించింది. సుంకేశుల రిజర్వాయర్ నుంచి మరొక ఎత్తిపోథల పథకం ద్వారా నడిగడ్డ ప్రాంతానికి మరో లక్ష ఎకరాలకు సాగునీటిని అందించాలని నిర్ణయించింది. కృష్ణా ఉపనది అయిన భీమా నది తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించే ప్రాంతమైన కృష్ణ మండలంలోని కుసుమర్తి గ్రామం వద్ద.. భీమా వరద కాల్వను నిర్మించాలని నిర్ణయించింది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో జలాశయాల నిల్వ సామర్ధ్యాన్ని 20 టిఎంసీలకు పెంచాలని కేబినెట్ నిర్ణయించింది. నాగార్జున సాగర్ టేల్ పాండ్ నుంచి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి, నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిధిలోని రెండు లక్షల ఎకరాల ఎగువ భూములకు, సాగునీటి సౌకర్యం కల్పించాలనే ఆలోచన చేసింది.
తెలంగాణకు కృష్ణా జలాలపై హక్కులను పరిరక్షించుకొని తెలంగాణ రైతులను, వ్యవసాయాన్ని కాపాడుకోవడానికి కార్యాచరణ నిర్ణయించింది కేసీఆర్ సర్కార్. ఈ విషయంలో ప్రధాన మంత్రిని, కేంద్ర జల శక్తి మంత్రిని కలిసి వినతి పత్రం సమర్పించి.. ఏపీ ప్రాజెక్టులను ఆపించే విధంగా చూడాలని నిర్ణయించింది. ప్రజా క్షేత్రంలో, న్యాయస్థానాలతో రపాటు రాబోయే వర్షకాల పార్లమెంటు సమావేశాల్లో గళం విప్పి.. జాతికి వివరించాలని అభిప్రాయం వ్యక్తమైంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రాజెక్టుల పర్యవసానంగా కృష్ణా బేసిన్ ప్రాంతాలకు సాగునీటి రంగంలో జరిగబోయే తీవ్ర నష్టాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ప్రజల్లోకి తీసుకుపోవాలని నిర్ణయించింది.