ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాశ్ విఆర్ఎస్ చెల్లుబాటు అవుతుందా? 

ఆంధ్ర ప్రదేశ్ లో ఐఏఎస్ ప్రవీణ్  ప్రకాశ్ వాలెంటరీ రిటైర్మెంట్ దరఖాస్తు వివాదానికి కేంద్రబిందువయ్యింది. జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి ప్రస్తుతం స్వచ్ఛంద పదవీ విరమణకు సిద్ధమైన ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్ తీరు మరోసారి వివాదాస్పదమైంది. ఏడేళ్ల సర్వీసు ఉండగానే ఆయన వీఆర్‌ఎస్‌కు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రవీణ్ ప్రకాశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో వ్యవహరించిన తీరుపై జీఏడీ అధికారులే విస్తుపోతున్నారు. 
సాధారణంగా వీఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఆయా విభాగాల ఉన్నతాధికారులను కలిసి దరఖాస్తు సమర్పిస్తారు. కాబట్టి, ప్రవీణ్ కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్‌ను కలిసి వీఆర్ఎస్ దరఖాస్తును ఆయనకు సమర్పించాలి. ఎందుకు పదవీ విరమణ చేస్తోందీ వివరించాలి. కానీ ప్రవీణ్ ప్రకాశ్ మాత్రం ఇందుకు భిన్నంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫోనులో మెసేజ్ పెట్టారు. తన దరఖాస్తును కేవలం ఓ తెల్లకాగితంపై రాసి తపాలా పెట్టెలో వేసి వెళ్లిపోయారు. ఇది చూసి అవాక్కైన జీఏడీ అధికారులు సదరు కాగితాన్ని తిప్పికొట్టారు. దీంతో, దిగివచ్చిన ప్రవీణ్ ప్రకాశ్ తగిన ఫార్మాట్‌లో వీఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు. కానీ సంతకం చేయాల్సిన చోట డిజిటల్ సిగ్నేచర్ కాపీ పేస్ట్ చేసి సరిపుచ్చారు. దీంతో, ఇది చెల్లుబాటు అవుతుందా? కాదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. 
ప్రవీణ్ ప్రకాశ్ గతంలోనూ వివాదాలకు కేరాఫ్‌గా నిలిచిన సందర్భాలున్నాయి. గుంటూరు, విజయవాడ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన సందర్భాల్లో ఆయన తీరుపై ప్రశ్నలు తలెత్తాయి. ఇక జగన్ హయాంలో విద్యా శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమితులైనప్పుడు కూడా ఆయన టీచర్లను బెంబేలెత్తించారు. తాను ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే క్షమించాలంటూ ఓ వీడియో కూడా ఇటీవల విడుదల చేశారు.