ఆంధ్రప్రదేశ్ ఇక రావణకాష్టమేనా..?!

మూడు రాజధానుల మంకుపట్టు కోసం ఉత్తరాంధ్రలో విద్వేషాల నిప్పు రాజుకుంటోంది. రాయల సీమ జనంలో కూడా కొందరు ఆవేశాలు ప్రేరేపించే పరిస్థితి కనిపిస్తోంది. అధికారపార్టీ నేతలే అశాంతి సృష్టికర్తలుగా మారుతున్న సందర్భాలు వస్తున్నాయి. అధికార పార్టీ అంటించిన మంటను ఆర్పివేసే సత్తా ఎవరికి ఉంది? రాష్ట్రం ఇక రావణకాష్టంగా మారనుందా..? అనే భయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.

మూడు రాజధానుల అంశాన్ని సీఎం జగన్ రెడ్డి ప్రతిష్టగా తీసుకుంటున్నారు. ఆరు నూరైనా నూరు ఆరైనా అమరావతిలో రాజధాని కొనసాగించకూడదనే పంతం ఆయనలో రోజురోజుకూ పెరిగిపోతోంది. న్యాయపరంగా, చట్టపరంగా అమరావతిని అడ్డుకోవడం సాధ్యం కాదని తెలిసినా జగన్ పంతం వీడుతున్న దాఖలాలు కనిపించడంలేదు. తన నిర్ణయంలో మార్పు లేదని ప్రజలకు అర్ధమయ్యేట్లు చెప్పాలనే ప్రయత్నం గట్టిగానే చేస్తున్నట్లున్నారాయన. అలా జగన్ పంతంలో నుంచి పుట్టుకొచ్చిందే ఉత్తరాంధ్ర జాయింట్ యాక్షన్ కమిటీ అంటున్నారు. విశాఖలో రాజధాని ఏర్పాటు చేయాలని, తద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఊతం ఇవ్వాలని కోరుతూ జేఏసీ పలు కార్యక్రమాలతో ఉద్యమిస్తోంది.  వివిధ రూపాల్లో ఉత్తరాంధ్ర ప్రజల్ని ప్రభావితం చేసేందుకు యత్నిస్తోంది.

ఈ క్రమంలో చోడవరం వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఓ లేఖ రాసి, దాన్ని జేఏసీ నేతలకు అందజేయడంతో వైసీపీ డ్రామా మొదలైంది. ఆ డ్రామాను కొనసాగిస్తూ మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పి.. జేఏసీకి ఊపు తెచ్చారు. ప్రసాదరావు రాజీనామా చేసింది లేదు కానీ, ఆయన ప్రకటనతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రత్యేక రాష్ట్రం భావనలు అంకురిస్తున్నాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. తెలంగాణా ఉద్యమ సమయంలో కూడా బొత్స సత్తిబాబు ఉత్తరాంధ్ర  రాష్ట్రం ప్రస్తావన తీసుకొచ్చిన విషయం ఇక్కడ గుర్తుచేసుకోవాలి. అప్పట్లో ఆ వివాదంలో బొత్స ఇంటి మీద దాడి కూడా జరిగింది. ఇప్పుడు ఉత్తరాంధ్ర ఉద్యమంలో కేవలం వైసీపీ నేతలు మాత్రమే పాలు పంచుకుంటున్నారు.

ఏపీలోని టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు అన్నీ అమరావతి రాజధానికే మొగ్గు చూపుతున్నాయి. ఒక్క వైసీపీ మాత్రమే విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధాని అంటోంది. అయితే.. వైసీపీ అధికారంలో ఉన్న పార్టీ కనుక దాని వద్ద అర్ధ బలం, అంగ బలం దండిగా ఉంటాయి. అధికార యంత్రాంగం సహకారమూ ఉంటుంది. దానితో విశాఖ రాజధాని ఉద్యమం విస్తృతంగా వ్యాప్తిచేసే అవకాశమూ లేకపోలేదు. అయితే.. ఇది విశాఖ రాజధానికే పరిమితం అవుతుందా..? లేక అటు తిరిగి ఇటు తిరిగి ప్రత్యేక ఉత్తరాంధ్ర ఉద్యమంగా రూపాంతరం చెందుతుందా? అనేది తాజాగా తెర మీదకు వస్తున్న ప్రశ్న. అలాంటి ప్రమాదమూ లేకపోలేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం పేరుతో ఏ చిన్న శబ్దం వచ్చినా.. కదలిక జరిగినా అది కార్చిచ్చుగా మారే ప్రమాదం ఉంది.

ఏపీలోని మరో ప్రాంతం రాయల సీమలో ఇప్పటికే ప్రత్యేక రాష్ట్రం భావనలు వ్యాపిస్తున్నాయి. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఈ కోరిక బలంగా వినిపిస్తోంది. రాయలసీమకు మూడవ రాజధానిగా హైకోర్టు కావాలనే నెపంతో ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, ఆయన సోదరుడు భూమన్ పెద్ద తీవ్ర స్వరంతో మాట్లాడుతున్నారు. వారి మాటలు వింటుంటే.. అవి హైకోర్టు కోసం మాత్రమే కాదనే అనుమానాలు కలుగుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం వారు నినదిస్తున్నట్లు కన్పిస్తోంది అంటున్నారు.

మూడు ప్రాంతాల్లో మూడు ప్రాంతీయ వాదనలను ప్రేరేపించే ప్రయత్నం అధికార పార్టీ నుంచే జరగడం విచిత్రమైన పరిస్థితి. ప్రజల్లో అశాంతి సృష్టించే ప్రయత్నం ప్రభుత్వ పరంగా జరగడం చరిత్రలో చూడలేదు. మూడు రాజధానుల అంశాన్ని వచ్చే ఎన్నికల్లో ప్రధాన చర్చగా మలిచేందుకు సీఎం ఈ వ్యూహం రూపొందిస్తున్నట్లు చెబుతున్నారు. తానే మళ్లీ అధికారంలోకి రాబోతున్నాను కాబట్టి ఈ ఉద్యమాలను నియంత్రించడం తన చేతిలో పని అనేది ఆయన ధీమా కావచ్చు. అయితే ఇలాంటి ఉద్యమాల నిప్పు రాజేయడం సులువు. కానీ, ఆర్పడమే కష్టం అని, అది ఏ రూపం ధరిస్తుందో, ఎప్పుడు ఎవరి చేతిలోకి వెళ్తుందో ఊహించలేం అంటున్నారు పరిశీలకులు. ఒకవేళ నిజంగానే జగన్ మళ్లీ ఏపీలో అధికారంలోకి వచ్చినా.. ఓడిన పార్టీలు ఈ ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లే ప్రమాదం ఉండొచ్చు. అసలే  రాజధాని లేని రాష్ట్రంగా ఇప్పటికే ఎగతాళికి గురవుతోంది. ఆర్థిక కష్టాలు, అప్పుల బాధలు, తప్పులతో దేశమంతా ఏపీ ప్రజల్ని చూసి నవ్వే పరిస్థితులు వస్తున్నాయి.

రాష్ట్రం విడిపోతే ఆంధ్రా అభివృద్ధి చెందుతుంది.. తెలంగాణా వెనకబడుతుందనుకొన్నారు కొందరు. కానీ వారి భావన ఇప్పుడు తలకిందులైంది. ఎన్ని ఆరోపణలు, విమర్శలు ఉన్నా కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణా రాష్ట్రం, హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతున్నాయి.

ఏపీకి మాత్రం ఒక్క పరిశ్రమ కూడా రావడం లేదు. రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్ట్ కట్టడం లేదు. ఒక్క రోడ్డు మీద గుంతలు పూడ్చడం లేదు. ఒక్క ఉద్యోగం కల్పించడం లేదు. ఒక్క ఐటీ సంస్థ ఏపీ వైపు చూడడం లేదు. ఒక్క కార్పొరేట్ సంస్థ ఏపీలో ఆఫీసు తెరవడం లేదు. అన్నింటికీ మించి పలువురు ఏపీ మంత్రులు, ఐఎఎస్ అధికారులు హైదరాబాద్ ను వదలిపెట్టి రావడం లేదు. శుక్రవారం వస్తే చాలు హైదరాబాద్ కు ఎగిరిపోతున్నారు. వారి దృష్టికి ఏపీ ఒక రాష్ట్రంగా కనిపించడం లేదు. పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్న సమయంలో మూడు ప్రాంతాల్లో మూడు ఉద్యమాలకు అంకురార్పణ జరిగితే.. ఆ నిప్పు మరింతగా రాజుకుంటే ఏపీ భవిష్యత్ ఏమిటి అనేది ఊహించుకునేందుకే భయంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.