యోగం జీవనరాగం!

భారతీయ సనాతన వ్యవస్థ చాలా గొప్పది. ఎన్నో వేల సంవత్సరాల నుండి మహర్షులు, ఋషులు, పూర్వీకులు కొన్ని విశిష్టమైన జీవనవిధానాలను ఆచరిస్తూ తమ ముందు తరాల వారికి కూడా వాటిని అందజేశారు. అలా తరాలుగా వస్తున్న గొప్ప జీవనశైలిలో ఎంతో అద్భుతమైనమార్గం యోగ. యోగను రోజువారీ చేసేపనులలో అంటే ఉదయం లేవడం, ఇంటి  పనులు, వ్యాయామం, ఆహారం తినడం వంటి పనుల్లా యోగా కూడా ఒక గంటనో, లేక కొన్ని నిమిషాలో సాగే ప్రక్రియగా భావిస్తారు చాలామంది.

యోగ అంటే ఏంటి?

యోగ అంటే శరీరాన్ని వివిధ భంగిమలలోకి వంచి ఆసనాలు వేయడం అని కొందరు అనుకుంటారు. ధ్యానం చేయడం అని మరికొందరు అనుకుంటారు. రెండింటిని కలిపి చేయడం అని కొందరు అనుకుంటారు. కానీ యోగ అనేది ఒకానొక జీవనవిధానం అనే విషయం కొద్దిమందికే మాత్రమే తెలుసు.

 మనుషుల జీవన విధానాలు కూడా వర్గాలుగా ఉన్నాయా?? వేరు వేరుగా ఉంటాయ అని అనుమానం వస్తుంది. మనిషి జీవనశైలిని బట్టి మనిషి జీవనవిధానం విభిన్నంగా ఉంటుంది. ఆ విభిన్నతే మనిషి శారీరకంగా మానసికంగా ఎలా ఉన్నాడు అనే విషయాన్ని నిర్ధారిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే మనిషిని శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంచుతూ ఈ వేగవంతమైన కాలంలో కూడా నిశ్చలమైన మనసును కలిగి ఉండటం, సహజత్వానికి, ప్రకృతికి దగ్గరగా జీవించడమే యోగమని ఆ మార్గాన్ని యోగ అని అంటారు.

జీవితాన్ని రీఛార్జి చేస్తుంది!

యోగ అనేది జీవితాన్ని రీఛార్జి చేసే గొప్ప మార్గం. నిజానికి ఇది ఒక మంచి మెడిసిన్ లాంటిది. జీవితం నిస్సారంగా మారిపోయి ఎలాంటి ఆశ లేదనుకునే స్తాయిలోకి జారిపోయినప్పుడు యోగ మనిషికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుంది. 

జీవన సరళి!

అప్పటివరకు గందరగోళంగా ఉన్న జీవితాన్ని ఒక గట్టుకు చేర్చేదే యోగ.  క్రమశిక్షణను, స్పష్టతను కలిగి ఉండేది. 

ఉదయాన్నే లేచి ఆసనాలు చేసి, ముక్కు మూసుకుని ప్రాణాయామం, ధ్యానం చేయగానే యోగ చేసినట్టు కాదు. జీవితంలో ప్రతిరోజూ ప్రతి  క్షణాన్ని, ప్రతి నిమిషాన్ని, ప్రతి పనిని అనుభూతి చెందుతూ చేయడమే యోగం. 

నేటి కాలంలో యోగ ప్రాముఖ్యత!

ప్రస్తుత కాలంలో యోగ అంటే ధ్యానం, ఆసనాలు, ప్రాణాయామం ఇవే అనుకుంటున్నారు. నిజానికి ఇవన్నీ చేయడం కూడా ఇప్పటి జనాలకు పెద్ద టాస్క్ లాగా తయారయ్యింది. పట్టుమని పది నిమిషాల ధ్యానం, నాలుగు రకాల ఆసనాలు వేయడం రానివాళ్లు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్లకు అందరూ చెప్పుకునే యోగ గురించి అయినా సరిపడినంత అవగాహన కలిగించడం ఎంతో ముఖ్యం.

యోగా క్లాసులు, అవగాహన సదస్సులు, నాటి మన మహర్షుల జీవనవిధానం వంటివి తెలుసుకుంటూ ఉండాలి.

ఇప్పట్లో అయితే సద్గురు జగ్గీ వాసుదేవ్, బాబా రాందేవ్ వంటి గురువులు యోగా మీద అవగాహన పెంచడానికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. భారతీయ యోగ గొప్పతనాన్ని గుర్తించిన విదేశీయులు సైతం భారతీయ జీవనవిధానానికి తమ మద్దతు తెలుపుతూ దాన్ని పాటిస్తూ తమ తమ జీవితాలను ఎంతో అందంగా మార్చుకుంటున్నారు.

పెద్ద పెద్ద వృత్తులలో ఉన్నవారు, విద్యాధికులు యోగా మార్గాన్ని అనుసరిస్తూ లక్ష్యాలు సాధిస్తూ తమ విజయాలు అందరి ముందుకు తెస్తున్నారు.

కాబట్టి యోగ అనేది రోజువారీ జీవితంలో మనం అన్నం తిన్నట్టు, నిద్రపోయినట్టు అప్పుడప్పుడూ చేసే ప్రక్రియ కాదు. నిరంతరంగా శ్వాసక్రియ జరిగినట్టు నిరంతరంగా జీవితంలో అది ఒక భాగం అయిపోవాలి. అప్పుడు ఆ యోగ మనిషి శరీరానికి జీవశక్తిని పెంపొందిస్తుంది, జీవితానికి అద్భుత రాగమవుతుంది.


                                 ◆వెంకటేష్ పువ్వాడ.