శరణుజొచ్చినవాడికి అభయమిద్దాం!

సాకారుడైన హరి శరణుజొచ్చిన చాలు అంటాడు అన్నమయ్య తన కీర్తనలో. హరి అంటే విష్ణువు అని అర్థం. ఆ మహావిష్ణువును శరణు కోరితే, ప్రార్థిస్తే ఆయన సమస్యలను పరిష్కరిస్తాడు అని అర్థం.

బుద్ధం శరణం గచ్చామి

సంఘం శరణం గచ్చామి

ధర్మం శరణం గచ్చామి అనేది అందరికీ తెలిసిన మాట.

బుద్ధుడికి లొంగిపోవడం, సంఘానికి లొంగిపోవడం, ధర్మానికి లొంగిపోవడం అనేవి అర్థాలు. బుద్ధుడు చెప్పిన విషయాలు అన్నీ సమాజాన్ని మార్చే శక్తివంతమైన వాక్యాలు. అహింసను పాటించడం, దుఃఖాన్ని జయించడం, కోర్కెలను జయించడం ప్రశాంతమైన జీవితాన్ని గడపడం ఇవన్నీ. కానీ ఇవి ఎలా సాధ్యం అంటే హింస లేనప్పుడు, స్వేచ్ఛగా బతకగలిగినపుడు. 

ఎక్కడైతే హింస చోటు చేసుకుంటుందో, అక్కడ మానవ జీవితాలు ప్రభావితం అవుతాయి. సమస్యలు చిన్నగా మొదలై స్వేచ్ఛ కోల్పోవడం దగ్గర నుండి చివరకి తిండి దొరడం కష్టమయ్యి, ప్రాణహాని సంభవించేవరకు దారితీస్తుంటాయి. అలాంటి వాళ్ళు దిక్కుతోచని స్థితిలో ఇంకొకరి సహాయం కోసం ఎదురుచూడటం లేదా ఎక్కడైనా కాసింత తిండి, ఉండటానికి షెల్డర్ దొరుకుతుందేమో అని ఉన్న ప్రాంతాన్ని వదిలి మరొకచోటుకు వెళ్లిపోవడం చేస్తుంటారు. ఇలా కష్టసమయంలో ఒకచోటి నుండి మరొకచోటుకు సహాయం కోసం వలస వెళ్లే వాళ్ళను శరణార్థులు అంటారు. 

ఉద్యోగాల కోసం, బ్రతుకు తెరువు కోసం ఒక ప్రాంతం  నుండి మరొకప్రాంతనికి  వెళ్ళేవాళ్ళు వలసదారులు అయితే, సర్వం కోల్పోయి సహాయం కోరుతూ వెళ్లేవాళ్ళు శరణార్థులు అనబడతారు.

ప్రశ్నార్థక జీవితాలు!

తినడానికి తిండి, ఉండటానికి నివాసం, కాసింత ప్రాణ రక్షణ, కొద్దిగా స్వేచ్ఛ ఉంటే ఎవరూ ఉన్న ప్రాంతాలను వదిలి వెళ్లిపోరు. ముఖ్యంగా కొందరు కష్టపడి సంపాదించుకుని భూములు కొని, ఇళ్ళు కట్టుకుని, స్థిరస్థులను పొగుచేసుకుని ఎంతో చక్కగా ఉంటారు. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఉన్న ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోయి పరిస్థితి రావచ్చు.

ముఖ్యంగా యుద్ధాలు జరిగే ప్రాంతాలలో, కరువులు, ప్రకృతి వైపరీత్యాలు జరిగినపుడు బాధిత ప్రాంతాలలో నష్టం చాలా ఘోరంగా ఉంటుంది. అన్ని వదిలేసుకొని కట్టుబట్టలతో వెళ్లాల్సిన పరిస్థితులు వస్తాయి. ఒక్కసారిగా నిర్వాసితులు అయిపోతారు. అలాంటి వీళ్ళు సహాయం దొరుకుతుందనే ఆశతో వేరే ప్రాంతాలకు వెళ్తుంటారు. ప్రభుత్వాలు అలాంటి వాళ్ళను తరలించి ప్రభుత్వ సంరక్షణ హొమ్స్ లో కొద్దిరోజుల పాటు ఉంచుకుంటారు. కానీ జీవితంలో మళ్ళీ ఏదో ఒక అడుగు ముందుకు వెయ్యాలి కదా సొంతంగా ఏదో ఒకటి చేసుకుంటూ బ్రతుకు బండి నెట్టుకురావాలి. కానీ అలాంటి వాళ్లకు కొన్నిచోట్ల తగినంత ఆదరణ లభించదు. 

అపన్నహస్తం!

హిందువులు అయినా, ముస్లింలు అయినా ఇతర వర్గాల వాళ్ళు అయినా వాళ్ళ వాళ్ళ మతాలలో ఉన్న ముఖ్యసారం ఇతరులను ఆదుకోవడం, ఇతరులకు సహాయం చేయడం , ఇతరుల పట్ల ప్రేమ, అభిమానం, జాలి, కరుణ వంటివి కలిగి ఉండటమే అనే ముఖ్య విషయం తెలుసుకోవాలి.

అలా తెలుసుకున్ననాడు ఇతరుల విషయంలో మానవత్వాన్ని కలిగి ఉంటాడు. నాకెందుకులే సమస్య నాది కాదు కదా అనే స్వార్థబుద్దిని ఎప్పుడూ ప్రదర్శించడు.

మన చుట్టూనే!

ఒకప్పుడు గొప్పగా బ్రతికిన వాళ్ళు పరిస్థితుల ప్రభావం వల్ల సర్వం కోల్పోయి నిస్సహాయతతో బ్రతికిస్తూ ఉంటారు. గుడులు, రైల్వే స్టేషన్ లు, బస్టాండ్ లు, చుట్టూ ఉన్న ప్రాంతాలలో బయటకు అడగలేని వ్యక్తిత్వంతో కూడా ఉంటారు. మరికొందరు ఎక్కడినుంచో వలస వచ్చి కష్టాలు పడుతూ ఉంటారు. ప్రభుత్వాలు, స్వచ్చంధసంస్థలు చేసేవి ఎవరికీ పూర్తిగా భరోసాను ఇవ్వలేవు. అందుకే సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి శరణార్ధుల విషయంలో బాధ్యతగా ఉండాలి. శరణుజొచ్చినవాడు శత్రువు అయినా వాడిని ఆదుకోవాలని చెబుతుంది మన భారతీయ సంస్కారపు సంస్కృతి. ఎన్నెన్నో దేశాల నుండి భారతదేశానికి శరణంటూ వచ్చి ఇక్కడే ఉన్న విదేశీయులు ఎందరో ఉన్నారు. పక్కదేశాలకు మన దేశం ఆవాసం కల్పించినప్పుడు మన పక్కవాడికి కష్టం వస్తే మనం తోచిన సహాయం చేయలేమా??

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నిమిషానికి సుమారు 20 మంది తమ స్వంత ప్రాంతాలను వదులుకుని ఇతర ప్రాంతాలకు సహయాలకోసం తరలివెళ్లిపోతున్నారు. వీళ్ళలో ఎక్కువ బాగం  చిన్నపిల్లలు, మహిళలే ఉంటున్నారు. ఇలాంటి  వాళ్ళను ఆదుకోవడం ప్రతిఒక్కరి బాద్యతనే కదా!!

                               ◆వెంకటేష్ పువ్వాడ.