యోగా చేయమంటే..కునుకు తీసిన మంత్రి

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోడీ నుంచి వార్డ్ కౌన్సిలర్ స్ధాయి వ్యక్తి వరకు వేడుకల్లో పాల్గొని యోగాసనాలు వేశారు. అయితే మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు మంత్రులు మాత్రం యోగా చేయకుండా..వేరే పనులు చేసి వివాదంలో చిక్కుకున్నారు. మధ్యప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి గౌరిశంకర్ బిసేన్ చింద్వారాలో జరిగిన యోగా డే వేడుకల్లో పాల్గొన్నారు. ఆయనతో పాటు రెండు వేల మంది విద్యార్ధులు, ప్రజలు యోగాసనాలు వేశారు. వేడుకలు ప్రారంభమై పట్టుమని పది నిమిషాలు అయ్యిందో లేదో మంత్రిగారు కింద కూర్చోలేక నానా అవస్థలు పడ్డారు. వెంటనే దగ్గరలో ఉన్న సోఫాలో కూర్చున్నారు. ఆ తర్వాత కాసేపటికే కునుకు తీశారు. మరి మీడియా మిత్రులు ఊరుకుంటారా వెంటనే క్లిక్‌మనిపించారు. ఇక పాఠశాల విద్యాశాఖ మంత్రి విజయ్ షా పరిస్థితి మరీ ఘోరం. ఖంద్వా జిల్లాలో జరిగిన యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న షా..యోగాసనాలు వేసేందుకు వేదిక మీద కూర్చున్నారు. అయితే కనీసం మోకాలిని ముడవలేకపోయారు..చేసేది లేక ఫోన్ చూసుకుంటూ కనిపించారు. వీరి ప్రవర్తనపై సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో చేసిన పనిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.