రాజస్తాన్ కాంగ్రెస్ లో కిస్సా కుర్సీకా ?

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ ఏడాది చివర్లో అంటే నవంబర్ లేదా డిసెంబర్ లో లేదా  అంతకంటే ముందుగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అంటే ఎన్నికలకు   నిండా ఎనిమిది నెలల సమయం కూడా లేదు. మరోవంక  ప్రధాన ప్రతిపక్షం బీజేపీ, ఇప్పటికే ఎన్నికల కసరత్తు ప్రారంభించింది. హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నడ్డా ఇతర కీలక నేతలు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. బూత్ స్థాయి నుంచి కార్యకర్తలను ఎన్నికలకు సిద్దం చేస్తున్నారు. భరత్‌పూర్‌లో బూత్ ప్రెసిడెంట్ సంకల్ప్ సమ్మేళనంలో అమిత్ షా పాల్గొన్నారు. బూత్ స్థాయి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. 

అయితే, ఇదే సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీలో మరో యుద్ధానికి తెరలేచింది. అంటే మరో ‘వార్’ మొదలైంది. నిజమే కాంగ్రస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, ముఠా తగాదాలు  గ్రూప్ రాజకీయాలు కొత్త కాదు. ముఖ్యంగా రాజస్థాన్ విషయంలో అయితే గత నాలుగు సంవత్సరాలుగా గెహ్లాట్ వర్సెస్ పైలట్ వర్గాల మధ్య నిత్య సంఘర్షణ  డైలీ సీరియల్  గా నడుస్తూనే వుంది.

అవును  కథ పాతదే ... కిస్సా కుర్సీకా కహానీ. గత నాలుగు సంవత్సరాలుగా వివిధ దశల్లో  వివిధ రూపాల్లో నడుస్తున్న నాటకమే, ఇప్పడు మరో రూపంలో తెరమీదకు వచ్చింది.  ముఖ్యమంత్రి అశోక్ గెభహ్లాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇదేమీ రహస్యం కాదు. ఆ ఇద్దరి మధ్య గల శతృమిత్ర సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం కూడా లేదు. ఒకరిని ఒకరు అనని మాట లేదు. ఒకరిపై ఒకరు చేయని ఆరోపణ లేదు. అశోక్ గెహ్లాట్ అయితే సొంత పార్టీకి చెందిన పైలట్ ను ద్రోహి’ అని దూషించారు. పైలట్ అదే మాటను ఇంకో భాషలో అన్నారు.

నిజానికి  గడచిన నాలుగు సంవత్సరాలలో ఆ ఇద్దరి మధ్య తలెత్తిన విభేదాలు అనేకం పతాక శీర్షికలకు ఎక్కాయి. ఒకటి రెండు సందర్భాలాలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం అంచుల వరకు వెళ్లి వచ్చింది. ఇలా ఇద్దరి విభేదాలు తెరపైకొచ్చిన ప్రతి సందర్భంలోనూ కాంగ్రెస్  అధిష్టానం జోక్యం చేసుకుంది. అయినా  ప్రతి సందర్భంలోనూ గెహ్లాట్ దే పై చేయి అయింది. అన్ని సందర్భాలలో కాంగ్రెస్ అధిష్టానం కారణాలు ఏవైనా   గెహ్లాట్ కే జై కొట్టింది. చివరకు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల సందర్భంగా గెహ్లోట్  అధిష్టానం దూతలను (అందులో ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఆన్నారు) అవమానించి పంపినా ఆయన పై చర్యలు తీసుకునే సాహసం కాంగ్రెస్ అధిష్టానం (సోనియా, రాహుల్) చేయలేక పోయింది.  గత ఏడాది కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి ఎన్నిక సందర్భంగా గెహ్లాట్ కు పార్టీ అధ్యక్ష బాధ్యతలు  అప్పగించి, పైలట్ కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది.

కానీ,గెహ్లాట్ అందుకు ఓకే అంటూనే తెర వెనక చక్రం తిప్పారు. ఆఖరు నిముషంలో గెహ్లాట్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఏగరేశారు. మెజారిటీ ఎమ్మెల్యేలు అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకించారు. కాంగ్రెస్ అధిష్టానం చివరకు దిగిరాక తప్పలేదు. చివరకు  గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలన్న పైలట్‌ డిమాండ్‌ కూడా నెరవేరలేదు. ఇదిగో అదిగో అంటూ చివరకు ఆ ఉదంతానికి  కాంగ్రెస్ హైకమాండ్ ముంగింపు పలికింది. 

అందుకే ఇప్పుదు ఎన్నికల ముందు పైలట్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పై మరోమారు యుద్దాన్ని ప్రకటించారు. ఆయన ఎత్తుకున్న రాగం గత బీజేపీ ప్రభుత్వం హయాంలో, అప్పటి ముఖ్యమంత్రి వసుంధర రాజే ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలనే డిమాండే అయినా ఆయన టార్గెట్ మాత్రం ముఖ్యమంత్రి గెహ్లాట్ అనేది వేరే చెప్పనక్కరలేదు. అవును గెహ్లాట్ టార్గెట్ గానే పైలట్  మిస్సైల్ ఫైర్ చేశారు. కాంగ్రెస్ అధిష్టానం హెచ్చరికలను బేఖాతారు చేస్తూ ముందు ప్రకటించిన విధంగా  ఏప్రిల్ 11న తమ మద్దతుదారులతో కలిసి ఒక  రోజు నిరశన దీక్షకు కూర్చున్నారు. 

గత ప్రభుత్వ అవినీతిపై దర్యాప్తు జరిపిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ ఊసే ఎత్తకుండా రేపటి ఎన్నికల్లో ఏ ముఖంతో ప్రజలముందుకు పోగలమని సచిన్‌ ప్రశ్నిస్తున్నారు.  ప్రశ్న బానే వుంది కానీ, నాలుగేళ్ళ తర్వాత ఎన్నికలు తరుము కొస్తున్న సమయంలో పైలట్  రోడ్డెక్కడం ఏమిటి ? ఎందుకు అంటే  అదేమీ బ్రహ్మ రహస్యం కాదు. గెహ్టాట్ ను ఆయనను వెనకేసుకువస్తున్న పార్టీ అధిష్టానాన్ని ఇరకాటంలోకి నెట్టేందుకు పైలట్  వ్యూహత్మకంగా పావులు కదుపుతున్నారని వేరే చెప్పనక్కరలేదు. 

గత ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలను అస్త్రాలుగా చేసుకుని ముఖ్యమంత్రి గెహ్లాట్ ను డిఫెన్సులోకి నేట్టే  వ్యూహంతోనే పైలట్  పావులు కదుపుతున్నారు. ముఖ్యమంత్రి  గెహ్లాట్ తమ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే, గత ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించేందుకు భయపడుతున్నారని ఆరోపిస్తున్నారు. గెహ్లాట్ ను అవినీతి ఎండగట్టేందుకు సచిన్ పైలట్  బీజీపీ భుజాల్ పై తుపాకీ పెట్టి గెహ్లాట్ పైకి తూటాలు గురి పెడుతున్నారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుంది అనేది ఆసక్తి కరంగా మారింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu