అవినాష్ తన నెత్తిన తానే చేయి పెట్టుకున్నారా?
posted on Apr 20, 2023 10:02AM
వివేకా హత్య కేసులో అభియోగాలను ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ అరెస్టు చేయకుండా సాధించుకున్న ముందస్తు బెయిలు వల్ల ఆయన ఊరట కలిగిందా? అంటే పరిశీలకులు లేదనే చెబుతున్నారు. నిజం ఆయన ముందస్తు బెయిలు కోసం వెళ్ల కుండా ఉండి ఉంటే సీబీఐ ఆయనను అరెస్టు చేసేది. అక్కడితో ఇక విషయం కోర్టు విచారణలకే పరిమితమయ్యేది.
కానీ హైకోర్టుకు వెళ్లి సీబీఐ అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకోవడం ద్వారా అవినాష్ సాధించిందేమిటి? అంటే ఏమీ లేదనే జవాబు వస్తోంది. పై పెచ్చు ప్రతి రోజూ హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి హాజరు అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. బుధవారం (ఏప్రిల్ 19) నుంచి ఈ నెల 25 వరకూ ఆయన ప్రతి రోజూ సీబీఐ విచారణకు హాజరు కావాల్సిందే. అంటే ఆయనపై అభియోగాలు, వివేకా హత్య కేసులో ఆయన పాత్ర గురించి నిత్యం వార్తలు పతాక శీర్షికల్లో ఉంటాయి. అంతే కాకుండా అంత వరకూ హైదరాబాద్ లోనే ఉండి రోజూ సీబీఐ కార్యాలయానికి అనివార్యంగా హాజరు కావాల్సి ఉంటుంది. పురాణాల్లో భస్మాసరుడికి వరమే శాపమైనట్టు అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిలు శాపంగా మారిందని అంటున్నారు. అవినాష్ బెయిలు పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఈ నెల 25 వరకూ అరెస్టు చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
ఆ రోజు అవినాష్ బెయిలు పిటిషన్ పై తీర్పు వెలువరిస్తానని పేర్కొంది. అంటే అప్పటి వరకూ టెక్నికల్ గా అవినాష్ అరెస్టు కారు.. కానీ వాస్తవంగా మాత్రం ప్రతి రోజూ సీబీఐ ఆయనను అరెస్టు చేస్తున్నట్లేనని పరిశీలకులు అంటున్నారు. పార్లమెంటు సభ్యుడిగా అవినాష్ కు బోలెడు అధికారిక కార్యక్రమాలు ఉంటాయి. కానీ కోర్టు తీర్పు మేరకు ఆయన ప్రతి రోజూ హైదరాబాద్ సీబీఐ కార్యాలయానికి హాజరు కావాల్సి ఉంటుంది. కనుక ఆయన తన కార్యక్రమాలన్నిటినీ రద్దు చేసుకోక తప్పదు. సొంత ఊరికి వెళ్లే అవకాశమూ లేదు.
ఇక 25న బెయిలుపై హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది పక్కన పెడితే.. వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ ఇప్పటి వరకూ అరెస్టు చేసిన వారి రిమాండ్ రిపోర్టుల్లో.. మరీ ముఖ్యంగా చవరి రెండు అరెస్టులు అంటే ఉదయ్ కుమార్ రెడ్డి, అవినాష్ రెడ్డి తండ్రి భాస్కరరెడ్డిల రిమాండ్ రిపోర్టుల్లో ఈ కేసులో అవినాష్ ప్రమేయం ఉందని విస్పష్టంగా చెప్పింది. ఇక సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తును ఈ నెల 30వ తేదీతో ముగించాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో ఒక వేళ అవినాష్ కు ఈ నెల 25న ముందస్తు బెయిలు మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించినా, సీబీఐ సుప్రీంను ఆశ్రయిస్తుందని న్యాయ నిపుణులు అంటున్నారు. వివేకా హత్య కేసులో అవినాష్ ప్రమేయం గురించి సీబీఐ స్పష్టంగా చెబుతున్న నేపథ్యంలో ఆయన అరెస్టు అనివార్యమన్నది స్పష్టమేనని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు లభించిన ముందస్తు బెయిలు వల్ల తాత్కాలిక ఊరట కూడా లభించలేదని, రోజూ సీబీఐ విచారణకు వెళ్లి వచ్చి.. చవరికి అరెస్టు కావడం తప్ప సాధించేదేమీ ఉండదనీ అంటున్నారు.