పెన్సిలూ - మనిషి!
posted on Apr 23, 2018 2:20PM
ఒక అజ్ఞాత వ్యక్తి పేర ప్రచారంలో ఉన్న నీతి కథ ఆధారంగా అల్లిన కథ ఇది...
ఒక ఫ్యాక్టిరీలో వేలాది పెన్సిళ్లు తయారవుతున్నాయట. ఆ హడావుడిని చూసిన ఒక సన్నటి పెన్సిల్ తనను పెట్టెలో సర్దుతున్న ఓ వ్యక్తితో ఇలా మాటలు కలిపింది. `ప్రపంచంలో ఇన్ని లక్షల పెన్సిళ్లు ఉన్నాయి కదా. వాటితో పోలిస్తే నేను ఎందుకూ పనికిరానేమో అని భయంగా ఉంది. ఒక పెన్సిల్‌గా నా లక్ష్యాన్ని నెరవేర్చడం కష్టమేమో అని భయం వేస్తోంది. నాకేదన్నా ఉపాయం చెప్పరాదా!` అని అడిగింది.
దానికా వ్యక్తి చిరునవ్వుతో `అదెంత భాగ్యం! నేను చెప్పే ఒక అయిదు విషయాలు గుర్తుపెట్టుకో చాలు! నీ జీవితం సార్థకమవుతుంది` అంటూ ఇలా చెప్పాడు...
ఒకటి: నువ్వు నీ జీవితంలో చాలా అధ్బుతాలను చేస్తావు. కానీ అందుకోసం వేరొకరి చేతిలో ఒదిగి ఉండవలసి ఉంటుంది.
రెండు: నీతో చక్కగా రాయించేందుకు ఎప్పటికప్పడు నిన్ను చెక్కవలసి ఉంటుంది. ఆ అనుభవం చాలా బాధాకరంగా ఉంటుంది. బాధపడాల్సి వస్తుంది కదా అని నువ్వు వెనుకడుగు వేశావో. ముందు మొద్దుబారి ఆ తరువాత ఎందుకూ పనికిరాకుండా పోతావు.
మూడు: నువ్వు చేసిన పొరపాట్లు ఏవన్నా ఉంటే దాన్ని చక్కదిద్దుకునే అవకాశం కూడా ఉంటుంది. వాటిని శుభ్రంగా వినియోగించి, తిరిగి నేర్పగా రాయి.
నాలుగు: నీ లోపల ఉండేదే నీ విలువకు నిజమైన కొలమానంగా ఉంటుంది.
అయిదు: గరుకైన గోడల నుంచి నున్నటి కాగితం వరకూ.... నువ్వు నానారకాల పదార్థాల మీద రాయవలసి ఉంటుంది. దేనిమీద రాస్తున్నామన్నది మర్చిపో. ప్రతి సందర్భంలోనూ నీదైన ముద్ర వేసేందుకు మాత్రమే ప్రయత్నించు.
- ఈ అయిదు సూచనలూ చేసి ఆ వ్యక్తి, పెన్సిల్‌ను ఈ లోకంలోకి పంపించాడట. ఇప్పడు పెన్సిల్ స్థానంలో మనల్ని ఊహించుకుంటే ఈ సూచనలు అర్ధవంతంగానే తోస్తాయి.
ఒకటి: ఒక పక్క మన వంతు ప్రయత్నం చేస్తూనే, విధి చేతిలో నిమిత్తమాత్రులం అన్న విషయాన్ని గుర్తించాలి. మన ద్వారా జరుగుతున్న అద్భుతాలన్నింటికీ మనమే బాధ్యలం అన్న అహంకారంతో ఉండకూడదు.
రెండు: ఎన్నో బాధాకరమైన అనుభవాల ద్వారా జీవితం మనకు కొత్త కొత్త పాఠాలను నేర్పుతుంది. అవేమీ నాకు వద్దు అనుకుంటే లోకంలో అమాయకంగానే ఉండిపోతాం. అనామకంగా మాత్రమే మిగిలిపోతాం.
మూడు: కాలం ముందుకు సాగుతూ ఉంటుంది. దాంతో పాటుగా మనం చేసిన పొరపాట్లూ మన జీవితంలో నమోదు అయిపోతాయి. వాటిని వెనక్కితోసుకోలేకపోవచ్చు. కానీ సరిదిద్దుకునే అవకాశం మాత్రం జీవితం ఎప్పటికప్పడు మనకి అందిస్తూనే ఉంటుంది. కొన్ని క్షమాపణలు, కొద్దిపాటి కష్టంతో పాటు... పెద్ద మనసు, సరైన వివేచన ఉంటే వాటిని సరిదిద్దుకోవడం సాధ్యం కావచ్చు.
నాలుగు: పైపై మెరుగులు మనకి తాత్కాలికంగానే ఉపయోగపడతాయి. మన లోపల ఉండే సంస్కారమే మన జీవితానికి, విజయానికీ కొలమానంగా నిలుస్తుంది. మన చేతలకు విలువనిస్తుంది. సంస్కారం లేనివాడు... ఎంత ఎత్తుకి ఎదిగినా, ఎన్ని ఆడంబరాలలను చుట్టుకున్నా నిరుపయోగంగానే ఉండిపోతాడు.
అయిదు: జీవితంలోని ప్రతి మలుపులోనూ, ప్రతి మజిలీలోనూ, ప్రతి మాటలోనూ, ప్రతి మమతలోనూ... మనదైన ముద్రంటూ ఒకటి ఉండాలి. వ్యక్తిత్వం పట్ల పూర్తి నిబద్ధత ఉన్నప్పుడే అది సాధ్యపడుతుంది.
- నిర్జర.