కోడి కత్తి కేసులో జగన్ హాజరు కావాల్సిందే.. ఎన్ఐఏ కోర్టు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన కోడికత్తి కేసు విచారణ విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో  మంగళవారం (జనవరి 31)  జరిగింది.  విచారణ సందర్భంగా కోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. తదుపరి విచారణకు ఈ కేసులో బాధితుడిగా ఉన్న ఏపీ సీఎం జగన్ ను కూడా హాజరుపరచాలని ఎన్ఐఏను ఆదేశించింది.

విశాఖపట్నం విమానాశ్రమంలో 2018 అక్టోబర్ 25న అప్పటి విపక్ష నేత జగన్ పై కోడికత్తితో జనిపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి దాడి చేశాడు. 2019 ఎన్నికల ముందు జరిగిన ఈ ఘటన వెనుక ఉగ్ర కుట్ర ఉందన్నంతగా భూతద్దంలో చూపి కేసును ఎన్ఐఏకి అప్పగించారు. ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. కోడి కత్తి శీనును అరెస్టు చేసింది.  దీంతో ఎన్ఐఏ అప్పటి నుంచి దర్యాప్తు చేస్తోంది.  2019 ఆగస్టు 13న ఈ కేసులో ఎన్ఐఏ కోర్టులో అభియోగపత్రం దాఖలు చేసింది.  కేసు విచారణలో భాగంగా ఫిబ్రవరి 15న ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి కోర్టు విచారణకు హాజరు కావాలని ఎన్ఐఏ కోర్టు మంగళవారం (జనవరి 31) ఆదేశించింది.  

మరోవైపు వ్యక్తిగత కారణాలతో  ఈ కేసులో తొలి సాక్షిగా ఉన్న విశాఖ ఎయిర్ పోర్ట్ అసిస్టెంట్ కమాండెంట్ రాఘవ విచారణకు హాజరు కాకపోవడంతో ఆయనను కూడా హాజరు పరచాలని ఆదేశించింది. అలాగే ఈ కేసులో 3వ సాక్షిగా ఉన్న జగన్ పీఏ నాగేశ్వరరెడ్డి కూడా హాజరు కావాలని ఎన్ఐఏ కోర్టు ఆదేశించింది. గత విచారణలో కూడా ఎన్ఐఏ కోర్టు కోడికత్తి కేసులో విజయవాడ ఎన్ఐఏ కోర్టు   ఈ కేసులో బాధితుడుగా ఉన్న సీఎం (అప్పటి ప్రతిపక్ష నేత)జగన ను ఎందుకు ప్రశ్నించలేదని  ఎన్ఐఏ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది.  

బాధితుడిని ప్రశ్నించకుండా మిగిలినివారిని ప్రశ్నించి విచారించి ఏం లాభం? అంటూ వ్యాఖ్యానించింది. ఈ కేసులో నిందితుడితో పాటు సీఎం జగన్ విచారణకు హాజరైన తరువాతే ట్రయల్ నిర్వహిస్తామని స్పష్టంచేసింది. అనంతరం కేసు విచారణను జనవరి 31కు వాయిదా వేసింది. ఇప్పుడు వచ్చే నెల 15న జగన్ కోర్టుకు హాజరు కావాల్సిందిగా  ఆదేశిస్తూ విచారణను అప్పటికి వాయిదా వేసింది.