భారత సరిహద్దుకు భరోసా ఇచ్చే సోల్జర్.. ఇండియన్ ఆర్మీ డే 2025..!

"జై జవాన్.. జై కిసాన్" అనే నినాదం అందరికీ తెలిసిందే.. దేశానికి తిండి పెట్టేవాడు రైతన్న అయితే.. దేశానికి, దేశ ప్రజలకు రక్షణ ఇస్తూ దేశ ప్రజలు అందరూ ప్రశాంతంగా నిద్రపోవడానికి కారణం అవుతున్నది సైనికులు. దేశాన్ని రక్షించే వీర సైనికుల ధైర్యం,  అంకితభావం, వారు చేసే త్యాగాలు వెలకట్టలేనివి.  ఇలాంటి  వీర సైనికులను గౌరవించే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం జనవరి 15వ తేదీన ఇండియన్ ఆర్మీ డే లేదా ఇండియన్ సోల్జర్ డే జరుపుకుంటారు.  దేశ సరిహద్దులలో శాంతి భద్రతలను కాపాడటంలోనూ, సంక్షోభాల సమయంలో అపన్న హస్తం అందించడంలోనూ దేశ సైన్యం చేసే కృషి మాటల్లో వర్ణించలేనిది. ఇంతకీ ఇండిన్ సోల్జర్ డే లేదా ఇండియన్ ఆర్మీ డే ని ఎందుకు జరుపుకుంటారు? ఇదే రోజు ఈ భారతదేశ సైనిక దినోత్సవం జరుపుకోవడం వెనుక కారణం ఏంటి తెలుసుకుంటే..

జనరల్  KM కరియప్ప గౌరవార్థం భారతదేశ సైనిక దినోత్సవాన్ని జరుపుకుంటారు. మొదట్లో జనరల్ గానూ ఆ తరువాత ఫీల్డ్ మార్షల్ గానూ .. ఈయన జనవరి 15, 1949న భారత సైన్యం  కమాండర్-ఇన్-చీఫ్‌గా పనిచేశారు.  చివరి బ్రిటీష్ అధికారి జనరల్ సర్ ఫ్రాన్సిస్ రాయ్ బుచెర్ స్థానంలో KM కరియప్ప  నిలిచాడు. అందుకే ప్రతి సంవత్సరం భారతీయ సైనిక దినోత్సవాన్ని జరుపుకుంటారు. భారత సైన్యం పూర్తి స్వాతంత్ర్యం పొంది, ప్రజాస్వామ్య దేశంగా మారింది. ఇది దేశ స్వాతంత్య్రం తరువాత  చరిత్రలో ఒక మలుపు. జనరల్ కరియప్ప ఆధ్వర్యంలో దేశం స్వాతంత్ర్యం వైపు,  స్వయం నిర్ణయాధికారం వైపు పురోగతి దిశగా సాగింది.

ఇండియన్ ఆర్మీ డే ని దేశం యావత్తూ ఒక వేడుకగా జరుపుకుంటారు. అయితే ఇండియన్ ఆర్మీ డే  అనేది కేవలం ఒక వేడుక మాత్రమే కాదు. ఈ రోజు ఆత్మపరిశీలన చేసుకోవడం,  కృతజ్ఞత తెలుపుకోవడం ముఖ్యమైన విషయం. సంక్షోభ సమయాల్లో దేశం బలంగా ఉండటం,   బయటి నుండి  దాడి చేసేవారి నుండి దేశాన్ని రక్షించడంలో భారత సైన్యం అందించిన, అందిస్తున్న  సేవలను గౌరవించడం ఈ రోజు ఉద్దేశం.  భారత సైన్యంలో 1.4 మిలియన్లకు పైగా క్రియాశీల సైనికులు ఉన్నారు.  భారతదేశ ఆర్మీ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద స్టాండింగ్ ఆర్మీగా నిలిచింది.

భారతీయ సైన్యం స్వీయ నియంత్రణ, ధైర్యం,  సాహసోపేతమైన పనితీరుుకు ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమిగా పేరొందిన సియాచిన్ గ్లేసియర్‌లోని రాజస్థాన్ ఎడారులు,  మంచుతో కూడిన ఎత్తులతో సహా కఠినమైన వాతావరణంలో భారత సైన్యం సైన్యం పని చేస్తుంది. అయితే చాలామందికి ఇండియన్ ఆర్మీ గురించి కొన్ని విషయాలు తెలియవు. అవేంటంటే..

2019 నాటికి భారతదేశంలో అధికారికంగా  61 కంటోన్మెంట్లు ఉన్నట్టు గుర్తించబడింది.  

శత్రు సేనలను ఎదుర్కొని అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించిన 21 మంది సైనికులకు భారతదేశ అత్యున్నత సైనిక అలంకరణ అయిన పరమవీర చక్ర అవార్డు లభించింది.

భారత సైన్యం  మానవతా ప్రయత్నాలలో  ఆపరేషన్ రాహత్ కూడా ఉంది.  ఇది 2013లో ఉత్తరాఖండ్ వరదల సమయంలో నిర్వహించిన అతిపెద్ద పౌర రెస్క్యూ ఆపరేషన్లలో ఒకటి.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనను నిర్మించిన ఘనత భారత సైన్యానికి దక్కింది. బెయిలీ వంతెనగా పిలువబడే ఇది లడఖ్ లోయలో, కఠినమైన హిమాలయ పర్వతాల మధ్య ద్రాస్,  సురు నదుల మధ్య విస్తరించి ఉంది. ఈ ఇంజనీరింగ్ అద్భుతాన్ని ఆగస్టు 1982లో భారత సైన్యం పూర్తి చేసింది.

భారత సైన్యం 27 రెజిమెంట్లను కలిగి ఉంది. ప్రతి దానికి స్వంత,  ప్రత్యేక చరిత్ర,  సంప్రదాయాలు ఉన్నాయి. సిక్కు రెజిమెంట్ అత్యధికంగా అలంకరించబడిన రెజిమెంట్ కాగా, 1750లో స్థాపించబడిన మద్రాస్ రెజిమెంట్ పురాతనమైనది.

భారతదేశం ఎన్నడూ నిర్బంధాన్ని అమలు చేయలేదు. భారతీయ సైన్యంలోని సిబ్బంది అందరూ స్వచ్ఛంద సేవకులు, వృత్తిపరమైన సైనిక దళం పట్ల దేశం  నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.

కుమావోన్ రెజిమెంట్ తొలిసారిగా శౌర్య పురస్కారాలను అందుకుంది.

సముద్ర మట్టానికి 5,000 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి అయిన సియాచిన్ గ్లేసియర్‌ను భారతదేశం నియంత్రిస్తుంది.

ప్రముఖ బాలీవుడ్ చలనచిత్రం "బోర్డర్"కి స్ఫూర్తినిచ్చిన లాంగేవాలా యుద్ధంలో భారతదేశం వైపు కేవలం రెండు మరణాలు మాత్రమే జరిగాయి.

డిసెంబర్ 1971లో భారతదేశం-పాకిస్తాన్ సంఘర్షణ సమయంలో జరిగిన ఈ యుద్ధంలో కేవలం 120 మంది భారతీయ సైనికులు మాత్రమే పాల్గొన్నారు, వారు ఒకే జీపులో అమర్చిన M40 రీకాయిల్‌లెస్ రైఫిల్‌తో ఆయుధాలు ధరించి పాకిస్తాన్ బలగాలకు వ్యతిరేకంగా కోటను రక్షించారు. శత్రు దళాలు దాదాపు 2,000 మంది ఉన్నారు, వీరికి 45 ట్యాంకులు,  మొబైల్ పదాతిదళ బ్రిగేడ్ మద్దతు ఉంది. అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ భారత సైనికులు రాత్రంతా తమ మైదానాన్ని నిలబెట్టుకున్నారు. భారత వైమానిక దళం నుండి కీలకమైన వైమానిక మద్దతుతో పాకిస్తాన్ దళాలను  ఓడించగలిగారు. ఇలా భారత సైన్యం విజయాలు,  పోరాట పటిమ దేశం యావత్తూ స్మరించుకోదగినవి, వేడుక చేసుకోదగినవి.

 *రూపశ్రీ.

 

 ⁠