పరీక్షల సమయంలో మనసు ప్రశాంతంగా ఉండాలంటే.. ఇలా చేయండి..!

 

పరీక్షలు.. పిల్లల జీవితాలను మార్చేవి.  ఏడాది మొత్తం చదివిన విషయాలను ఒక పరీక్షతో సమాధానాలు ఇచ్చి ప్రతిభను నిరూపించుకుంటేనే తదుపరి  తరగతికి లేదా తదుపరి దశకు అవకాశం ఉంటుంది.  అయితే పిల్లలు అయినా, పెద్దలు అయినా పరీక్షల కోసం సన్నద్ధం అయ్యేటప్పుడు ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. అలా ఒత్తిడికి గురైతే చదివిన విషయాలు గుర్తుండవు,  సిలబస్ తొందరగా పూర్తీ చేయలేం. పరీక్షల సమయంలో ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా ఉండాలంటే.. కొన్ని టిప్స్ పాటించాలి.

ఒత్తిడి తగ్గడానికి చాలా మంది శ్వాస వ్యాయామాలు చేస్తారు.  లోతైన శ్వాస అనేది ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తుంది. కళ్లు మూసుకుని కొన్ని నిమిషాలు ధీర్ఘంగా శ్వాస తీసుకోవడం వల్ల ఒత్తిడి అనేది దరిచేరదు.

ఎప్పుడూ నాన్ స్టాప్ గా చదువుకుంటూ ఉంటారు కొందరు. దీని వల్ల తాము బాగా చదువుతున్నాం అనుకుంటారు. కానీ ఇలా నాన్ స్టాప్ గా చదువుకోవడం వల్ల మనసు  అలసిపోతుంది. అందుకే ప్రతి గంటకు కనీసం 5 నుండి 10 నిమిషాల విరామం తీసుకోవాలి. ఈ 5, 10 నిమిషాల సమయంలో నీరు త్రాగడం, కాస్త ధీర్ఘశ్వాస తీసుకోవడం,  అటు ఇటు నడవడం వంటి పనులు ఏదో ఒకటి చేయవచ్చు.

ధ్యానం చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ఏకాగ్రతతో ఉంటుంది. ప్రతి రోజూ కొన్ని నిమిషాలు ధ్యానం చేయడం అలవాటు చేసుకుంటే పరీక్షల ఒత్తిడి అనిపించదు.

నిద్ర శరీరానికి ఔషధం వంటిది.   నిద్ర సరిగా లేకపోతే శరీరం అలసిపోయినట్టు అనిపిస్తుంది. మెదడు కూడా చురుగ్గా ఉండదు. అందుకే  ఎంత సిలబస్ ఉన్నా, పరీక్షలు ఎలాంటివి అయినా రాత్రి సమయంలో హాయిగా నిద్రపోవడం ముఖ్యం. అది కూడా కనీసం 7 నుండి 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి.

వ్యాయామం శరీరాన్నిమాత్రమే ఫిట్ గా ఉంచుతుంది అనుకుంటే పొరపాటు.  వ్యాయామం ఫిట్ గా ఉండటానికే కాకుండా మనసు ఏకాగ్రత పెరగడానికి,  ఒత్తిడి తగ్గడానికి కూడా వ్యాయామం సహాయపడుతుంది.  అందుకే రోజూ కనీసం 30 నిమిషాలు అయినా వ్యాయామం చేయాలి.

ఒక్కొకరికి ఒకో  అభిరుచి ఉంటుంది.  ఈ అభిరుచిని బట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు.  కొందరు సంగీతం వింటారు.  కొందరు తోట పని చేస్తారు.  ఇలా నచ్చిన పని కొద్దిసేపు చేయడం వల్ల మనసు ఆందోళన తగ్గుతుంది. ఇది ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.

స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎప్పుడూ  సహకారంగా ఉంటారు.  ఒత్తిడిగా అనిపించిన సందర్భాలలో చదవాలని అనుకోవడం తప్పు.  ఒత్తిడిగా అనిపించినప్పుడు సింపుల్ పుస్తకాలు పక్కన పెట్టి స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో గడపాలి.  ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.

పాజిటివ్ ఆలోచనలు సగం పైగా ఒత్తిడిని తగ్గిస్తాయి.   ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. పరీక్షల కోసం బాగా చదవాలన్నా, పరీక్షలు బాగా రాయాలన్నా పరీక్షల గురించి పాజిటివ్ గా ఉండాలి. అలాగని పరీక్షలను లైట్ గా తీసుకోకూడదు. సీరియస్ గా చదువుతూనే పరీక్షలలో మంచి ఫలితాలు సాధించగలం అనే నమ్మకం పెట్టుకోవాలి.

                          *రూపశ్రీ.