22 ఏళ్ళ తర్వాత చరిత్ర సృష్టించిన యంగ్ ఇండియా
posted on Sep 1, 2015 4:22PM

టెస్ట్ క్రికెట్ లో ఉండే మజా ఏమిటో క్రికెట్ అభిమానులకు తెలియజెప్పింది భారత్ శ్రీలంక సిరీస్. మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత్ గెలిచే స్థితిలోంచి ఓటమి చెందడం అప్పుడు భారత్ క్రికెట్ అభిమానులకు బాధకలిగించింది. దీంతో పట్టుదలతో ఆడిన టీం ఇండియా రెండో టెస్ట్ మ్యాచ్ లో విజయం సాధించింది.ఇక, సిరీస్ గెలవాలంటే ఈ మ్యాచ్ గెలవాల్సిందే అనే లక్ష్యంతో మూడో టెస్ట్ బరిలోకి దిగిన రెండు జట్లు నేటితో చారిత్రాత్మక ఫలితాన్ని ఇచ్చాయి.
ఐదు రోజుల క్రితం ప్రారంభమయిన మూడో టెస్ట్ తొలిరోజు వర్షం కారణంగా సరిగ్గా జరగపోయిన మిగిలిన నాలుగు రోజుల ఆటలో తొలి ఇన్నింగ్స్ లో టీం ఇండియా 312 పరుగులు చేయగా, శ్రీలంక 201 పరుగులకు ఆలౌట్ అయింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ లో టీం ఇండియా 274 పరుగులు చేయగా, 386 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక నేడు 268 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఈ విజయంతో భారత్ 2-1తో సిరీస్ గెలుచుకోవడంతో పాటు 22 ఏళ్ళ తర్వాత తొలిసారిగా యువ భారత్ శ్రీలంక గడ్డపై సిరీస్ గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఈ చారిత్రాత్మక విజయాన్ని సీనియర్ల రిటైర్మెంట్ ల తర్వాత ఇప్పుడు విరాట్ కోహ్లీ సారధ్యంలోని ఈ యువ టీం ఇండియా సాధించడం విశేషం.