కూకట్‌పల్లిలో భారీ పేలుడు
posted on Feb 23, 2015 4:36PM

హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి ప్రాంతంలో వున్న ఐడీఎల్ సంస్థలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడుతో మంటలు వ్యాపించడం వల్ల ఆ సంస్థలో పనిచేస్తున్న పదిమంది తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తోంది. పేలుడు జరిగిన వెంటనే అగ్నిమాపక యంత్రాలు రంగప్రవేశం చేసి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. ఐడీఎల్ ఈ ప్రాంతంలో వున్న పెద్ద ఆయిల్ కంపెనీ. కొన్ని వందల ఎకరాల్లో ఇది ఏర్పాటయింది. గతంలో కూడా ఈ కంపెనీలో రియాక్టర్లు పేలిన ఘటనలో ఇద్దరు కార్మికులు కూడా మరణించారు. ఇప్పుడు ఈ పేలుడు సంఘటన జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు లోపలకు వెళ్ళే అవకాశం కూడా లేదు. పేలుడు శబ్దానికి ఈ ప్రాంతమంతా దద్దరిల్లింది. పేలుడు తర్వాత లోపల పరిస్థితి ఎలా వుందనే విషయంలో ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. గతంలో కూడా పేలుడు సంభవించి ఇద్దరు చనిపోయిన 20 రోజుల తర్వాత సంస్థ అధికారులు ఆ విషయాన్ని బయటకి వెల్లడించారు. ఇప్పుడు జరిగిన పేలుడుకు సంబంధించిన పూర్తి వివరాలు ఎన్నాళ్ళకు బయటకి వస్తాయో వేచి చూడాలి.