త్వరలో హైదరాబాద్ టు వైజాగ్ హై స్పీడ్ రైలు కారిడార్...4 గంటల్లోనే ప్రయాణం
posted on Feb 20, 2024 9:34AM
హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం వరకు విజయవాడ మీదుగా జాతీయ రహదారి వెంట హైస్పీడ్ రైలు కారిడార్ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది.కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైల్వేశాఖ ప్రిలిమినరీ ఇంజనీరింగ్ అండ్ ట్రాఫిక్ (పెట్) సర్వే చేపట్టింది.ఇందుకు సంబంధించిన బాధ్యతలను గత సంవత్సరం మే నెలలోనే ఎస్‌ఎం కన్సల్టెన్సీకి అప్పగించింది.మార్చి నెలాఖరు నాటికి ప్రాథమిక సర్వే పూర్తి చేయనున్నట్టు సమాచారం.ఈ సర్వే ఆధారంగా సమగ్ర నివేదిక (డీపీఆర్) రూపొందించనున్నారు.దీని వల్ల రంగారెడ్డి,ఉమ్మడి నల్లగొండ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో జాతీయ రహదారి వెంట ఉన్న ప్రాంతవాసుల రైలు కల సాకారం కానుంది.హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు ప్రస్తుతం నల్గొండ, గుంటూరు మీదగా ఒక మార్గం, వరంగల్, ఖమ్మం మీదగా మరో మార్గం అందుబాటులో ఉన్నాయి. రెండూ రద్దీగానే ఉంటాయి. వరంగల్ మార్గంలో ట్రాక్ గరిష్ట సామర్థ్యం 150 కిలోమీటర్లుగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన రహదారులను హైస్పీడ్ రైలు కారిడార్ ద్వారా అనుసంధానం చేయాలని భారత రైల్వే భావిస్తోంది.
హైదరాబాద్ నుంచి విజయవాడ మీదగా విశాఖపట్నం, కర్నూలు నుంచి విజయవాడకు ఈ హైస్పీడ్ కారిడార్లు ఉండేలా రైల్వేశాఖ ప్రణాళికలు రచిస్తోంది. 220 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడుస్తాయి. ఈ రెండు మార్గాలకు సంబంధించి ఇంజనీరింగ్, ట్రాఫిక్ అధ్యయనం కోసం రైల్వేశాఖ టెండర్లు పిలిచింది. త్వరలోనే సంస్థను ఎంపిక చేయబోతున్నారు. హైస్పీడ్ రైలు ఏ మార్గంలో ఉంటే లాభదాయకంగా ఉంటుంది అనే విషయంలో ఈ సంస్థ 6 నెలల్లో నివేదిక అందజేస్తుంది. ఇది అందిన తర్వాతే అంచనా వ్యయం ఎంతనేది స్పష్టత వస్తుంది.
ఏపీలో రాయలసీమ ప్రాంతానికి చెందిన ప్రజలు విజయవాడకు చేరుకోవడానికి ఎక్కువ సమయం పడుతోంది. హైస్పీడ్ రైలు కారిడార్ వస్తే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు ప్రస్తుతం 12 గంటల సమయం పడుతోంది. దురంతో 10.30 గంటలు, వందే భారత్ 8.30 గంటల సమయంలో విశాఖకు చేరుకుంటున్నాయి. హైస్పీడ్ కారిడార్ కార్యరూపం దాలిస్తే హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు కేవలం నాలుగు గంటల్లో చేరుకోవచ్చు.