విడదల రజనీకి మళ్లీ స్థాన భ్రంశం? మళ్లీ మార్పులు.. జగన్ తీరుతో వైసీపీ నేతలకు తలనొప్పులు!
posted on Feb 20, 2024 8:52AM
ఎన్నికల వేళ రాజకీయాల్లో సర్వేల హవా నడుస్తోంది.. సర్వేల్లో గెలుస్తారని తేలిన వారికే అధిష్టానాలు సీట్లు కేటాయిస్తున్నాయి.. ముఖ్యంగా వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి పూర్తిగా సర్వేలపైనే ఆధారపడ్డారు. సర్వేల్లో ఓటమి తప్పదని తేలితే ఎంతటి స్థాయి నేతకైనా టికెట్ ఇవ్వడం లేదు. నిర్ధాక్షణ్యంగా వారిని పక్కన పెట్టేస్తున్నారు.. తెలివైన రాజకీయ నేత, ప్రజల నాడి తెలిసిన రాజకీయ నేత ఎవరైనా పూర్తిస్థాయిలో సర్వేలపై ఆధారపడరు. నియోజకవర్గంలో అభ్యర్థుల కుటుంబం కీర్తి ప్రతిష్టలు, వారు ప్రజలకు చేస్తున్న సేవా కార్యక్రమాలు, ప్రజల్లో వారికిఉన్న పలుకుబడి. వీటినికూడా పరిగణనలోనికి తీసుకునే అధినేతలు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సర్వేల్లో ప్రజా వ్యతిరేకతకు కారణమైన అంశాలను సదరు అభ్యర్థులకు తెలియజేసి వాటిని సరిచేసుకొనేలా జాగ్రత్తలు సూచిస్తారు. కానీ, జగన్ మోహన్ రెడ్డి మాత్రం.. సర్వేల్లో ఏది తేలితే దాని ప్రకారమే వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో ముందుకెళ్తున్నారు. దీంతో అభ్యర్థుల ఎంపికలో ఆయనకు తలనొప్పి తప్పడం లేదు. ఇప్పటికే ఏడు దఫాలుగా జాబితాలు విడుదల చేసి నియోజకవర్గాల వారిగా ఇంచార్జులను కేటాయించిన జగన్, తాజాగా నిర్వహించిన సర్వేల పేరుతో మళ్లీ వారిలో కొందరి విషయంలో మార్పులు చేర్పులు చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో జగన్ కు ఏమైనా అయిందా.. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎందుకిలా ప్రవర్తిస్తున్నారంటూ వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
ఏపీలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార, విపక్ష పార్టీలు వ్యూహాలను అమలు చేస్తున్నాయి. సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు నానా తంటాలు పడుతున్నారు. నేల విడిచి సాము చేస్తున్నారు. వైసీపీ నాలుగున్నరేళ్ల పాలనలో అభివృద్ధి ఆనవాలే కనిపించకపోవడంతో ఎమ్మెల్యేలపై తీవ్ర ప్రజావ్యతిరేకత వ్యక్తమౌతోంది. దీంతో నియోజకవర్గాల వారిగా సర్వేల ఫలితాల ప్రకారం సిట్టింగ్ లను తొలగించాలన్న నిర్ణయానికి వచ్చిన జగన్ ఇప్పటికే ఏడు విడుతలుగా జాబితాలు విడుదల చేసి 65 అసెంబ్లీ, పదహారు లోక్‌సభ సీట్లకు కొత్త అభ్యర్థులను ప్రకటించారు. వీరిలో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు నిరాకరించగా.. మరికొందరికి నియోజకవర్గాలను మార్చేశారు. దీంతో స్థానికంగా వైసీపీ శ్రేణుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అయితే నియోజకవర్గాల్లో కొత్తగా ఇంచార్జులుగా నియమితులైన వారికి జగన్ మోహన్ రెడ్డి మరో షాక్ ఇవ్వబోతున్నారని పొలిటికల్ సర్కిల్ లో టాక్ నడుస్తోంది. మళ్లీ కొత్తగా వచ్చిన సర్వేల ఆధారంగా పలువురు ఇంచార్జులను తొలగించేందుకు జగన్ సిద్ధమయ్యారట.
పెడన నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి జోగి రమేష్ ను పెనమలూరు వైసీపీ ఇంఛార్జిగా జగన్ నియమించారు. మరోవైపు మైలవరం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ను మార్చేసి తిరుపతిరావుకు ఇంచార్జి బాధ్యతలు అప్పగించారు. వీరిద్దరి సీట్లను మళ్లీ మార్పుచేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. గుడివాడ సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానిని మైలవరం నుంచి బరిలోకి దింపాలని జగన్ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీని పెనమలూరు నియోజకవర్గానికి పంపిస్తారని కూడా వైసీపీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతున్నది. దీనికితోడు గుంటూరు పార్లమెంట్ ఇంఛార్జి ఉమ్మారెడ్డి వెంకటరమణను కూడా మార్చేయనున్నారని అంటున్నారు. లోక్ సభ కు పోటీ చేయడానికి ఆయన ససేమిరా అంటుండటంతో మార్పు తప్పడం లేదని అంటున్నారు. ఉమ్మారెడ్డి వెంకటరమణను గుంటూరు వెస్ట్ కు పంపించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయితే, చిలకలూరిపేట నియోజకవర్గం ఎమ్మెల్యే విడుదల రజనీ మార్పులు చేర్పుల్లో భాగంగా గుంటూరు వెస్ట్ ఇంచార్జిగా నియమితులైన విషయం తెలిసిందే. అంటే ఇప్పుడు విడదల రజనీకి కూడా మరోసారి స్థాన భ్రంశం తప్పదని అర్ధమౌతోంది. వీటికితోడు మరికొన్ని నియోజకవర్గాల్లో నూతనంగా నియమించిన ఇంచార్జులను తాజా సర్వేల ప్రకారం మళ్లీ మార్చేసేందుకు జగన్ సిద్ధమయ్యారని పార్టీ వర్గాల సమాచారం.
నియోజకవర్గాల వారిగా టికెట్ల కేటాయింపు విషయంలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు వైసీపీ నేతలకు తలనొప్పిగా మారాయి. ఇటీవల నియోజకవర్గాల్లో నియమించిన ఇంచార్జులను తాజా సర్వేల పేరుతో మళ్లీ మార్పులు చేసేందుకు జగన్ సిద్ధమవుతుండటంతో ఎప్పుడు ఎవరి సీటు ఊడిపోతుందోనన్న ఆందోళనలో వైసీపీ నేతలు ఉన్నారు. ఇప్పటికే కొత్తగా నియమితులైన ఇంచార్జులు ఆయా నియోజకవర్గాలలో తమ తమ ప్రచారాన్ని ప్రారంభించారు. గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో మళ్లీ మార్పులు చేర్పులు జరుగుతాయని అధిష్టానం నుంచి సంకేతాలు వస్తుండటంతో సదరు వైసీపీ నేతలకు ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితిలో పడ్డారు. మొత్తానికి జగన్ మోహన్ రెడ్డిని వెంటాడుతున్న ఓటమి భయం.. వైసీపీ నేతలను ముప్పులు తిప్పలు పెడుతుందన్న టాక్ ఏపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.