ఏపీ అసెంబ్లీలో ప్రాతినిథ్యం.. ఇదే కాంగ్రెస్ లక్ష్యం!

ఈ సారి న్నికలలో  ఎలాగైనా సరే ఏపీ అసెంబ్లీలో ప్రాతినిథ్యం ఉండాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ అడుగులు వేస్తున్నది.  రాష్ట్ర విభజన తరువాత జరిగిన రెండు ఎన్నికలలోనూ కూడా కాంగ్రెస్ కనీసం బోణీ  కూడా కొట్టలేదు. సుదీర్ఘ కాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న ఆ పార్టీ.. గత రెండు అసెంబ్లీలలోనూ జీరో స్థానాలతో  సరిపెట్టుకుంది. అయితే ఈ సారి ఎలాగైనా సరే అసెంబ్లీలో కాలుపెట్టాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పావులు కదుపుతోంది.  టార్గెట్ 20 స్థానాలు అంటూ పట్టుదలగా అడుగులు వేస్తున్నది.  పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆ లక్ష్యంతో రంగంలోకి దిగిపోయిన వైఎస్ షర్మిల.. కుమారుడి పెళ్లి పనులలో ఒక వైపు బిజీగా ఉంటూనే.. రాష్ట్రమంతా ఇప్పటికే ఓ సారి సుడిగాలిలా చుట్టేశారు.

ఇప్పుడు కుమారుడి పెళ్లి వేడుక కూడా పూర్తి అయిపోవడంతో  ఇక అమె అవిశ్రాంతంగా ప్రచార పర్వంలో పాల్గొననున్నారు. ముఖ్యంగా  దళిత-మైనారిటీ వర్గాల్లో ఆమెకు వస్తున్న మంచి స్పందన వస్తుండటంతో  కాంగ్రెస్  కేడర్ లో కూడా జోష్ పెరిగింది.  విభజన తర్వాత ఏపీలో.. ఉనికి మాత్రంగా మిగిలిపోయిన కాంగ్రెస్ కు జవజీవాలు తీసుకువచ్చేందుకు ఉన్న ఏ అవకాశాన్నీ పార్టీ హై కమాండ్ వదలడం లేదు.  ఏపీసీసీ అధ్యక్షురాలిగా  దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కుమార్తె షర్మిలారెడ్డికి బాధ్యతలు అప్పగగించడం కూడా కాంగ్రెస్ వ్యూహంలో భాగమే అంటారు. రాష్ట్ర విభజన తరువాత అప్పటి వరకూ కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా ఉన్న దళిత-మైనారిటీ లు వైసీపీకి మళ్లిపోయింది. షర్మిల పార్టీ రాష్ట్ర పగ్గాలు అందుకున్న తరువాత ఆ ఓటు బ్యాంకు మళ్లీ కాంగ్రెస్ వైపు మరలే అవకాశాలున్నాయిని కాంగ్రెస్ గట్టిగా భావిస్తోంది.  రాష్ట్ర విభజన తరువాత  స్తబ్దతగా ఉన్న కాంగ్రెస్ నేతలు  షర్మిల  పార్టీ రాష్ట్ర పగ్గాలు అందుకున్న అనంతరం మళ్లీ చురుకుగా మారారని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.  అంతే కాకుండా ఏపీ పీసీసీ పగ్గాలు షర్మిల అందుకున్న తరువాత మీడియా  కూడా కాంగ్రెస్ పార్టీకి ఒకింత ప్రాధాన్యత ఇస్తున్న వాతావరణం కనిపిస్తోంది.  ముఖ్యంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీపై షర్మిల విరుచుకుపడుతున్న తీరు జనాలను కూడా ఆకర్షిస్తోంది. ముఖ్యంగా సొంత అన్న, ఏపీ సీఎం జగన్ పై షర్మిల సూటిగా, నిర్మొహమాటంగా చేస్తున్న విమర్శలు ఇప్పటికే జగన్ పాలనపై విసుగెత్తి ఉన్న ప్రజలకు కనెక్ట్ అవుతున్నాయి.

ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలపై షర్మిల సీరియస్ గా దృష్టి సారించడంతో ఈ సారి ఆయా నియోజకవర్గాలలో వైసీపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొనే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో  అన్నకే కాదు, తనకూ సొంత జిల్లా అయిన కడపపై కూడా షర్మిల దృష్టి సారించారు. సొంత బాబాయ్ వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో జగన్ సర్కార్ వ్యవహరించిన తీరును, ఆ హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డిని కాపాడేందుకు మొత్తం అధికారాన్నంతా జగన్ ఉపయోగిస్తున్న వైనాన్ని ఎండగట్టేలో వివేకా కుమార్తె డాక్టర్ సునీతను కాంగ్రెస్ గూటికి చేర్చుకుని కడప పార్లమెంటు నియోజకవర్గం నుంచి బరిలోకి దింపేలా షర్మిల వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండటంతో జగన్ కడప కోట బద్దలయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. అంతే కాకుండా  వైసీపీలోని అసంతృప్త నేతలు, టికెట్ దక్కని వారికి ‘చేయి’ అందించి వైసీపీని దెబ్బకొట్టేందుకు కూడా షర్మిల నేతృత్వంలో వ్యూహ రచన జరుగుతోందని అంటున్నారు.

అయితే షర్మిల ఏపీసీసీ పగ్గాలు అందుకున్న తరువాత కాంగ్రెస్ లో మునుపటి నిస్తేజం పోయి జోష్ కనిసిస్తున్నా.. షర్మిల ఒంటరి పోరు ఒక్కటే కాంగ్రెస్ ను లక్ష్యానికి చేరుకునేలా చేసే అవకాశం లేదన్న పరిశీలకుల విశ్లేషణల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఏపీ ఎన్నికల ప్రచారంలోకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దించేందుకు రెడీ అయిపోయింది. ఒక వైపు తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచార బాధ్యతలు భుజస్కంధాల మీద ఉన్నప్పటికీ రేవంత్ కూడా సాటి తెలుగురాష్ట్రమైన ఏపీలో కాంగ్రెస్ పుంజుకునేందుకు తన వంతు సహకారం అందించేందుకు సై అన్నారని అంటున్నారు.   రేవంత్ కు తోడు వైఎస్ ఆత్మగా గుర్తింపు పొందిన రాజ్యసభ మాజీ సభ్యుడు కెవిపిరామచంద్రరావు కూడా షర్మిలకు అండదండగా నిలుస్తున్నారు.

ఇప్పటికే ఆయన సారథ్యంలో అసెంబ్లీ అభ్యర్ధుల ఎంపిక మొదలైంది.  ఏపీలో రాజకీయ పరిస్థితులు, నియోజకవర్గాలలో బలాబలాలు, సామాజిక సమీకరణాలపై సంపూర్ణ అవగాహన ఉన్న కెవిపి తన అనుభవాన్నంతా రంగరించి కాంగ్రెస్ లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన వ్యూహాలు రచిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  మొత్తం మీద ఏపీలో కాంగ్రెస్ ఏ మేరకు పుంజుకుంటే.. ఆ మేరకు వైసీపీ కుదేలు కావడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద దాదాపు పదేళ్ల తరువాత ఏపీ కాంగ్రెస్ లో ఉత్సాహం, ఉత్తేజం కనిపిస్తున్నాయన్నది మాత్రం వాస్తవమని సామాన్య జనం కూడా అంగీకరిస్తున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu