హిట్ లిస్ట్ లో పేరు.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు భద్రత పెంపు..
posted on Aug 29, 2020 11:24AM
తెలంగాణాలో ఉన్న ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు రాష్ట్ర ప్రభుత్వం భద్రత పెంచింది. అయన పేరు ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో ఉండడంతో ఆయనకు భద్రత పెంచుతున్నట్లు నగర పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేసారు. ఇప్పటి నుండి డిసిపి స్థాయి అధికారి ఆయన భద్రత చూసుకుంటారని కమిషనర్ తెలిపారు. అంతేకాకుండా ఇక పై నుండి బైక్ పై ప్రయానాలు మానుకోవాలని ప్రభుత్వం ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ను ఉపయోగించాలని కమిషనర్ రాజాసింగ్ ను కోరారు.
ఇది ఇలా ఉండగా ఈ రోజు ఉదయాన్నే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటికి పోలీసులు వచ్చి భద్రతాపరమైన చర్యలు చేపట్టారు. అయితే ఎటువంటి సమాచారం లేకుండా పొలుసులు హడావిడి చేస్తుండటంతో రాజాసింగ్ పోలీసులను వివరణ కోరగా "ఈ మధ్య కొందరు ఉగ్రవాదుల్ని నిఘా వర్గాలు అదుపులోకి తీసుకున్నాయి. వారి దగ్గర దొరికిన హిట్ లిస్టులో మీ పేరు ఉంది. మిమ్మల్ని చంపాలని వారు ప్లాన్ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం మీకు భద్రతను పెంచింది" అని పోలీసులు చెప్పడంతో అవాక్కయిన రాజాసింగ్ "నన్ను చంపే ప్రయత్నం ఎవరు చేస్తారు.. అసలు ఆ ఉగ్రవాదులు ఎవరో చెప్పండి" అని పోలీసులను కోరారు. అయితే హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ మాత్రం ఇకపై మీరు బైక్‌పై తిరగొద్దు. ప్రభుత్వం ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ కారులోనే వెళ్లండి అని ఎమ్మెల్యేకి సూచించారు. అయితే ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రం ఇవన్నీ కాదు... అసలు నాకు ఎవరి నుంచి ప్రాణాహాని ఉందో చెప్పండి అని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు చెప్పకపోయినా ఎలా తెలుసుకోవాలో నాకు తెలుసు. దీనిపై కేంద్ర హోంశాఖ కు లెటర్ రాసి నిజానిజాలు బయటకు లాగుతాను అన్నట్లుగా సమాచారం.