తెలుగు భాషా ఉద్యమ పితామహుడు

గిడుగు వెంకట రామ్మూర్తి 
(29 ఆగష్టు , 1863 - 22జనవరి, 1940)

 

తెలుగు భాష వైభవానికి పునాదులు వేసిన మహనీయుడు గిడుగు రామ్మూర్తి పంతులు. అందుకే ఆయనను తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడుగా పిలుస్తారు. గ్రాంథికభాషలో పండితులకు మాత్రమే అర్థం అయ్యేలా ఉన్ తెలుగు భాష మాధుర్యాన్ని ప్రజలందరికీ అందేలా కృషి చేశారు. తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చారు. 

 

శిష్ట వ్యవహారికం పేరిట వాడుక భాషలో బోధనకు ఆయన పెద్దపీట వేశారు. తెలుగు పదాల్లోని భావాన్ని, స్పష్టతను పామరులకు సైతం అర్థమయ్యేలా తెలియజెప్పిన మహనీయుడు. తెలుగు వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాది. ఆయన జయంతి ఆగష్టు 29 ని “తెలుగు భాషా దినోత్సవం”గా నిర్వహిస్తారు.

 

రామ్మూర్తి శ్రీకాకుళం జిల్లాలోని పర్వతాల పేటలో 29 ఆగస్టు1863న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు వెంకమ్మ, వీర్రాజు. స్థానిక పాఠశాలలో చదువుకున్న ఆయన 1875లో తండ్రి మరణించడంతో విశాఖలోని తన మేనమామ ఇంటికి వెళ్లారు. అక్కడ హైస్కూల్లో చేరాడు. పుస్తకాలు చదవడం, కొత్త విషయాలు తెలుసుకోవడంపై ఆయనకు ఆసక్తి.  దాంతో దేవాలయం శాసనాలను సొంతగా చదివి అర్థం చేసుకునేవారు. పదోతరగతి పూర్తి చేసిన తర్వాత ప్రైవేటు టీచర్ గా పనిచేస్తూ డిగ్రీ డిస్టింక్షన్‌లో పూర్తి చేశారు. గజపతి మహారాజు  కాలేజీలో అధ్యాపకుడిగా చేరారు. పిల్లలకు అర్థమయ్యేలా  తెలుగు భాష బోధనను రోజు మాట్లాడుకునే వ్యావహారికంలో చేయాలన్న ప్రయత్నం ఆయనది.  1907లో ఉత్తర కోస్తా జిల్లాలకు స్కూళ్ల ఇన్‌స్పెక్టర్‌గా వచ్చిన జె.ఎ.యేట్స్ అనే బ్రిటిష్ అధికారి నుంచి రామ్మూర్తికి మద్దతు లభించింది. దాంతో అప్పటివరకు గ్రాంధికంగా ఉన్న తెలుగుభాషా బోధనను సరళతరం చేస్తూ వ్యావహారికంలో బోధన ప్రారంభించారు. రామ్మూర్తి ఆశయాన్ని గుర్తించిన శ్రీనివాస అయ్యంగార్, గురజాడ అప్పారావు, మరికొందరితో కలిసి వ్యావహారిక భాషలో బోధనోద్యమానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం 'తెలుగు' అనే పత్రికను  ప్రారంభించారు. ఈ ఉద్యమం  ప్రభావంతో అప్పటివరకు గ్రాంధిక భాషలో నిర్వహించే పరీక్షలు వ్యావహారిక భాషలోనూ రాసే వీలు కలిగింది. దాంతో స్కూలు, కాలేజీ పాఠ్యపుస్తకాలు వ్యావహారిక భాషలో విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి.

 

తెలుగు భాషకు ఆయన చేసిన సేవలకు గుర్తుగా మద్రాసు ప్రభుత్వం రావు బహద్దూర్ బిరుదు తో ఆయనను సత్కరించింది. కైజర్ ఈ హింద్ బిరుదు ఆయనను వరించింది. 22జనవరి,1940న మరణించేంతవరకు తెలుగుభాషే ఊపిరిగా ఆయన జీవించాడు.