నిండు గర్భిణీ అయిన భార్యపై భర్త అమానుషం..కడుపులోనే
posted on Jun 10, 2016 3:10PM
భార్యలపై భర్తల అరాచకాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మిగతా రోజుల్లో ఎలాఉన్నా నిండు చూలాలైన భార్యను కంటికి రెప్పలా చూసుకోవాల్సింది పోయి.. అమానుషంగా ప్రవర్తించాడు. ప్రకాశం జిల్లా పర్చూరు మండలం ఇడుపులపాడుకు చెందిన నాగలక్ష్మీకి, బల్లికురువ మండలం కొణిదెవకు చెందిన పల్లపు గోపితో నాలుగు సంవత్సరాల క్రితం పెళ్లైంది. పని పాటా లేకుండా జల్సాలకు అలవాటు పడిన గోపి నాగలక్ష్మీని నిత్యం వేధింపులకు గురిచేసేవాడు. అడ్డుకోవాల్సిన ఆత్తమామలు కొడుక్కి సపోర్ట్‌గా నిలవడంతో ఆమె వేదన అరణ్య రోదనే అయ్యింది.
వీరికి ఇప్పటికే రెండేళ్ల పాప ఉంది. అయితే నాగలక్ష్మీ ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భిణి. ఈ క్రమంలో ఒకరోజు గోపి నాగలక్ష్మీతో గొడవపడ్డాడు. అంగన్‌వాడిలో పనిచేస్తూ సంపాదిస్తున్న డబ్బులను ఇవ్వాలని ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు. ఎంతకి ఆమె సరే అనకపోవడంతో నిద్రిస్తున్న తన రెండేళ్ల పాపను గోడకేసి కొట్టబోయాడు..అడ్డుకోబోయిన నాగలక్ష్మీని కిందకు తోసి కాలుతో తన్నాడు. మద్యం మత్తులో ఉండటంతో ఆమె పొత్తికడుపుపై పదేపదే తన్నాడు. దీంతో నాగలక్ష్మీకి తీవ్ర రక్తస్రావం కావడంతో గమనించిన స్థానికులు నాగలక్ష్మీని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ఆపరేషన్ నిర్వహించి శిశువును బయటకు తీశారు. కానీ అప్పటికే శిశువు మరణించడంతో ఆ తల్లి గుండెలు పగిలేలా రోదిస్తోంది. దీనికి కారణమైన భర్త గోపిని పోలీసులు గాలిస్తున్నారు.