ఊహలకు రెక్కలు ఇచ్చేదే కళ.. 

 


కళ అనేది ఒక వ్యక్తిలోని ప్రతిభను,  సృజనాత్మకతను బయటకు తీసేది. మనిషి జీవితం చాలా వరకు కళలతో ముడి పడి ఉంటుంది.  ఒక పనిని సృజనాత్మకంగా చేయడాన్ని అందులో నైపుణ్యంగా చెబుతారు.  ఈ నైపుణ్యం అందంగా కనిపిస్తే ఆ పనిలో కళ ఉంది అంటుంటారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 15వ తేదీన ప్రపంచ కళ దినోత్సవం జరుపుకుంటారు.  ఈ సందర్భంగా కళల గురించి ముఖ్యంగా లలిత కళల గురించి, సృజనాత్మకత గురించి ప్రపంచ వ్యాప్తంగా  ఉన్న ఎన్నో విషయాలను తెలుసుకుంటూ కళల ప్రాధాన్యతను  ప్రస్తావిస్తారు. అన్ని సంవత్సరాల లాగే ఈ ఏడాది థీమ్ ను ఎంపిక చేశారు. "ఐక్యత మరియు పరివర్తన కోసం కళ" అనే అంశంతో ఈ ఏడాది కళల గురించి ప్రణాళికలు సాగుతాయి.   దీని గురించి పూర్తీ వివరంగా తెలుసుకుంటే..

ప్రపంచ కళా దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం ఏప్రిల్ 15న జరుపుకునే లలిత కళలు,  సృజనాత్మకతకు సంబంధించిన అంతర్జాతీయ వేడుక. ఈ రోజు కళాత్మక వ్యక్తీకరణ, సాంస్కృతిక వైవిధ్యం,  సమాజంలో కళ  ప్రాముఖ్యతను ప్రోత్సహించడానికి  ఒక వేదికగా నిలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఈ వేడుక కళ సమాజాలలో శాంతి, కమ్యూనికేషన్ ను,  అవగాహనను ఎలా పెంపొందించగలదో గుర్తు చేస్తుంది.

2025 లో ప్రపంచ కళా దినోత్సవం మానవాళిని రూపొందించడంలో, ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడంలో,  ఊహలను  ఆవిష్కరణలను నిజం చేయడంలో..  కళ,  కళాకారుల విలువను గౌరవించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

ప్రపంచ కళ దినోత్సవం..

ప్రపంచ కళా దినోత్సవ చరిత్ర

ప్రపంచ కళా దినోత్సవాన్ని UNESCO భాగస్వామి అయిన ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఆర్ట్ (IAA/AIAP) స్థాపించింది. దీనిని మొదటిసారిగా 2012లో జరుపుకున్నారు. 1452లో జన్మించిన   అత్యంత ప్రసిద్ధ కళాకారులు,  ఆలోచనాపరులలో ఒకరైన లియోనార్డో డా విన్సీ పుట్టినరోజును పురస్కరించుకుని ఏప్రిల్ 15ని ప్రపంచ కళ దినోత్సవంగా ఎంపిక చేశారు. 2019లో UNESCO అధికారికంగా ప్రపంచ కళా దినోత్సవాన్ని గుర్తించింది, ఇది దీనికి ప్రపంచ ప్రాముఖ్యతను ఇచ్చింది. లియోనార్డో డా విన్సీ సృజనాత్మక స్వేచ్ఛ, బహుళ విభాగ మేధావి,  దార్శనిక ఆలోచనలను కలిగి ఉన్న వ్యక్తి.

ప్రపంచ కళా దినోత్సవం కేవలం పెయింటింగ్‌లు లేదా శిల్పకళా వేడుక కాదు. ఇది అన్ని రకాల కళాత్మక వ్యక్తీకరణల గురించి తెలుపుతుంది.  ఇందులో దృశ్య కళలు,  ప్రదర్శన కళలు,  సాహిత్య కళలు,  డిజిటల్ ఆర్ట్స్, న్యూ మీడియా మొదలైనవి ఇందులో ప్రముఖంగా ఉన్నాయి.

కళలు ఎందుకు ముఖ్యం..

కళ వ్యక్తిలో సృజనాత్మకతను,  భావ ప్రకటనా స్వేచ్ఛను ప్రోత్సహిస్తుంది.  సాంస్కృతిక మార్పిడి,  వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తుంది

సమాజంలో కళాకారుల పాత్రను ఇది నొక్కి చెబుతుంది.  కళా కారుల వల్లే ప్రపంచంలో చాలా విషయాలు వ్యాప్తి చెందాయి.  సంస్కృతులు,  చరిత్ర ఒక తరం నుండి మరొక తరానికి అందుతూ వచ్చింది.  

కళల విద్య,  అభ్యాసంలో సృజనాత్మకత  ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచుతుంది. చాలా మంది మల్టీటాలెంట్ అంటూ ఉంటారు.  ఇది  ప్రపంచం గురించి అవగాహనను బలోపేతం చేస్తుంది.

                            *రూపశ్రీ