ఫేక్ ఫ్రెండ్స్ ను ఇలా గుర్తుపట్టేయండి.!

మనం ప్రతిరోజూ చాలా మందిని కలుస్తాము.  చాలా మంది మనకు స్నేహితులు అవుతారు.  కానీ  నిజమైన స్నేహితులు అని పిలవగలిగే వారు చాలా తక్కువ. వీళ్లు మన స్నేహితులు అని భావించిన వారిలో కూడా  స్నేహితులుగా నటించే వారే చాలా మంది ఉంటారు. కానీ వాస్తవానికి వారు  స్నేహితులు కాదు, కేవలం నటిస్తారు.వీళ్లందరూ ఫేక్ ఫ్రెండ్స్..  ఇలాంటి స్నేహితులను సకాలంలో  గుర్తించకపోతే చాలా అత్యవసర సమయాల్లో  ద్రోహం చేస్తారు. అందుకే నకిలీ వ్యక్తులను ఎలా గుర్తించాలో తెలుసుకోవాలి. అలాంటి స్నేహితులు  జీవితంలో ఉంటే సున్నితంగానే వారిని దూరం పెట్టాలి.

మీ కోసం ఎప్పుడూ సమయం కేటాయించరు..


తరచుగా మనకు కొంతమంది స్నేహితులు ఉంటారు.  వారి కోసం మనం అవసరమైనప్పుడల్లా సమయం కేటాయిస్తాము, కానీ నకిలీ  స్నేహితులు మన కోసం సమయం కేటాయించరు. ఎప్పుడైనా అత్యవసరం అయినప్పుడు మాత్రమే వాళ్ళు కలవడం, మాట్లాడటం జరుగుతుంది. ఆ సందర్బాలలో కూడా తమ పని నెరవేర్చుకునే దిశగానే వారి ప్రవర్తన సాగుతుంది.

అనారోగ్యకర పోటీ తత్వం..

నిజమైన స్నేహితుల మధ్య పోటీ అనేది ఎప్పుడూ ఆరోగ్యకరంగా ఉంటుంది. కానీ నకిలీ స్నేహితులు  తమ స్నేహితులతో పోటీని ఆరోగ్యకరంగా కాకుండా అహంకారంతో స్వీకరిస్తారు. ఎప్పుడూ తనే నెగ్గాలనే ఆలోచనతో ఉంటారు. కొన్ని సార్లు పోటీలో గెలవడానికి స్నేహాన్ని అయినా వదలడానికి వెనుకాడరు.

బాధపెట్టడం..

నకిలీ స్నేహితులు నిజాలు చెబుతున్నామంటూ తమ స్నేహితులను బాధపెడతారు. మనసు నొచ్చుకునే మాటలు మాట్లాడతారు. ఇతరుల ముందు కూడా ఏ మాత్రం సంకోచించకుండా విమర్మలు చేస్తారు. ఇలాంటి వారు లోలోపల సంతోషపడుతుంటారు.  

ఒత్తిడి కలిగించడం

నిజమైన స్నేహితులు స్నేహితులను వారి పరిస్థితులను అర్థం చేసుకుంటారు. కానీ నకిలీ స్నేహితులు మాత్రం తాము అనుకున్న విషయాలు, పనులు  జరగడం కోసం చాలా ఒత్తిడి చేస్తారు. తమ పనులు నెగ్గేవరకు ఎమోషనల్ బ్లాక్మెయిల్ అయినా చేస్తారు. పైపెచ్చు నీది నిజమైన స్నేహం కాదంటూ  నిందిస్తారు.

డొంకతిరుగుడు..

కొంతమంది డొంకతిరుగుడు మాటలు మాట్లాడతారు.  నిజాలు చెప్పరు. దాచిపెడతారు. నిజమైన స్నేహితులు అయితే ఇలా దాచిపెట్టరు. ఎలాంటి విషయాలు అయినా సరే నేరుగా బయటకు చెబుతారు.  అదే చెడు స్నేహితులు ఇతరుల ముందు తమ స్నేహితుల గూర్చి చెడుగా చెబుతారు. వారిని నిలదీసినప్పుడు నేను చెప్పలేదంటూ వ్యతిరేకంగా మాట్లాడటం, దబాయించడం చేస్తారు.

                                             *నిశ్శబ్ద.