ధనవంతులైనా సరే.. ఈ అలవాట్లు మానకపోతే కటిక పేదవాడిగా మారిపోతాడట.!
posted on Dec 18, 2023 11:00AM
ధనవంతులు, పేదవారు అనే వర్గాలు ఎప్పుడూ తారుమారవుతూ ఉంటాయి. ఈ రోజు పేదవాడిగా ఉన్నవాడు రేపు ధనవంతుడు కావచ్చు. అలాగే ఈ రోజు ధనవంతుడిగా ఉన్నవాడు రేపు పేదవాడిగా కూడా మారవచ్చు. చిన్న ఉద్యోగాలలో చేరి, వ్యాపారాలు మొదలు పెట్టి ఈ రోజు అపర కుభేరులుగా మారినవారున్నారు. అలాగే ఒకప్పుడు భవంతులలో నివసించి అన్నీ పోగొట్టుకుని పేదలుగా నివసిస్తున్నవారు కూడా ఉన్నారు. అయితే మనిషి తన దగ్గరున్న డబ్బును నిలుపుకోవడం అనేది అతని వ్యక్తిత్వం, అతని అలవాట్లపైనే ఆధారపడి ఉంటుంది. ఆచార్య చాణక్యుడి ప్రకారం కింది అలవాట్లున్నవారు ఎంత ధనవంతులైనా సరే పేదవాడిగా మారడం ఖాయమంటున్నారు.
అపరిశుభ్రంగా ఉండేవారు..
అపరిశుభ్రంగా మురికి బట్టలతోనూ, ఇల్లంచా అస్తవ్యస్తంగానూ ఉండే వారు ఎప్పటికీ పేదరికంతోనే జీవిస్తారట. దీనికి కారణం డబ్బున్నా బయటకు తీయకపోవడం, దాన్ని అలాగే దాచడం, తనూ సుఖపడక, డబ్బును సరైన అవసరాలకు వినియోగించక పేదవాడిగానే ఉండిపోవడం.
చెడుగా మాట్లాడేవారు
మాటతీరు మంచిగా లేని వ్యక్తులు ఎప్పటికీ డబ్బును నిలుపుకోలేరు. అబద్దాలు చెప్పడం, చెడుగా మాట్లాడటం చేస్తుంటే ఆ వ్యక్తి ఆర్థిక స్థోమత ఎప్పటికి మెరుగుపడదు. లక్ష్మీదేవి కూడా ఇలాంటి వ్యక్తుల వద్ద ఉండటానికి ఇష్టపడదట.
సూర్యాస్తమయం తరువాత నిద్రపోవడం
చాలామంది సాయంత్రం సూర్యుడు అస్తమించగానే నిద్రపోతుంటారు. అయితే ఈ సమయాన్ని లక్ష్మీదేవికి పవిత్రమైనదిగా భావిస్తారు. అలాంటి సమయంలో నిద్రపోవడం వల్ల లక్ష్మీదేవి ఆ ఇంట్లో నిలవదని అంటారు.
సోమరితనం
సోమరితనం ఉన్నవారు ఏ పనులను సరిగా చేయరు. పనులను వాయిదా వేడయం, ఏవో ఒక సాకులు చెప్పడం, తప్పించుకోవడం చేస్తుంటారు. ఇలాంటి వ్యక్తులు జీవితంలో ఎదగలేరు. తమ దగ్గరున్న డబ్బును మెల్లిగా కరిగించి చివరికి పేదవాడిగా మారిపోతాడు. తరాలు కూర్చుని తిన్నా తరగనంత ఉంది అని డాంబికాలు పలికేది ఇలాంటి వారే. ఇలాంటి వారు తమ ముందు తరాలను పేదరికంలోకి చాలా సులువుగా నెట్టేస్తారు.
ఖర్చుల విషయంలో జాగ్రత్త లేకుంటే..
డబ్బు సంపాదించడం ఒక కళ. అయితే ఆ డబ్బును ఎలా ఖర్చుపెట్టాలనేది కూడా కళే. ఆదాయానికి అనుగుణంగా డబ్బు ఖర్చు పెట్టడం, పొదుపుకు కొంత కేటాయించడం, ఎమర్జెన్సీ ఫండ్స్ అరెంజ్ చేసుకోవడం వంటి మనీ మేనేజ్మెంట్ ప్లాన్స్ లేకుండా పేదవాడిగానే ఉండిపోతాడు.
*నిశ్శబ్ద.