కేటీఆర్ అరెస్టు అయితే.. తెలంగాణ సమాజం స్పందన ఎలా ఉంటుంది?

ఫార్ములా ఈ  కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్ కు ఉచ్చు బిగిసింది. ఆయన అరెస్టు కావడం అనివార్యంగా కనిపిస్తోంది. కేటీఆర్ అరెస్టైతే పరిస్ధితి ఏమిటి? అందరూ అనుకుంటున్నట్లుగా హరీష్ ఇక పార్టీపై పూర్తి పెత్తనం తీసుకుంటారా? లేక దాదాపు రాజకీయ సన్యాసం తీసుకున్నట్లుగా కనిపిస్తున్న పార్టీ అధినేత కేసీఆర్ మళ్లీ యాక్టివ్ అవుతారా? లేక.. ఇటీవలి కాలంలో కొద్దిగా చురుకుగా కనిపిస్తున్న కవిత పార్టీపై పట్టు సాధిస్తారా? అన్న ప్రశ్నలు తెలంగాణ రాజకీయాలలో గట్టిగా వినిపిస్తున్నాయి. 

అయితే దానిని పక్కన పెడితే  ఆర్‌బిఐ నిబంధనలను ఉల్లంఘించి ఫార్ములా-ఇ రేసింగ్ కోసం చెల్లింపులు జరిపిన కేసులో విచారణకు హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) మాజీ మంత్రి కె. తారక రామారావుకు సమన్లు ​​జారీ చేసింది. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జనవరి 7న విచారణకు హాజరుకావాల్సి ఉంటుంది. ఇంతలో, కెటిఆర్ క్వాష్ పిటిషన్ హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. దాని కంటే ముందు అంటే మంగళవారం (డిసెంబర్ 31)తో కేటీఆర్ కు కోర్టు ఇచ్చిన అరెస్టు నుంచి మినహాయింపు ముగుస్తుంది.  కోర్టు కేటీఆర్ పై కేసును క్వాష్ చేయకుంటే  ఏసీబీ ఆయనను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి.  అదే జరిగితే రాష్ట్రం అట్టుడికిపోతుందా? ఆందోళనలు మిన్నంటే అవకాశం ఉందా?  క్వాష్ కేసులో చంద్రబాబును అప్పటి జగన్ సర్కార్ అక్రమంగా అరెస్టు చేసినప్పుడు ఉవ్వెత్తున ఎగసిన ప్రజాగ్రహంలా  కేటీఆర్ ను అరెస్టు చేస్తే కూడా ప్రజలు స్పందిస్తారా?  అన్న ప్రశ్నలు గట్టిగా వినిపిస్తున్నాయి.  కెటిఆర్ విషయంలో ప్రజల నుంచి ఆ స్థాయిలో స్పందన వచ్చే అవకాశం లేదన్న భావనే పరిశీలకుల నుంచి వ్యక్తం అవుతోంది.  

కేటీఆర్ ఈ ఫార్ములా రేస్ విషయంలో సొమ్ముల బదలాయింపుతో తనకు సంబంధం లేదని టెక్నికల్ అంశాలను తెరపైకి తీసుకువచ్చి అధికారులను బలిపశువులను చేసైనా తాను బయటపడాలని భావిస్తున్నారు. అంతే తప్ప అక్రమంగా సొమ్ముల బదలాయింపు జరగలేదని చెప్పడం లేదు. అన్నిటికీ మించి తాను అరెస్టు కావడం ఖాయమన్న భావనలో ఆయన ఉన్నట్లు ఆయన మాటలను బట్టి అవగతమౌతున్నది. దీంతో ఆయన ప్రజల సానుభూతి కోసం వెంపర్లాడుతున్నారు. అయితే చంద్రబాబు విషయంలో జరిగింది వేరు. ఆయనను అన్ని నిబంధనలనూ తుంగలోకి తొక్కి కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అర్థరాత్రి అరెస్టు చేశారు. అరెస్టుకు కారణాలు కూడా చూపలేదు. అరెస్టు చేసిన తరువాత స్కిల్ కేసులో ఆయన పేరు చార్జిషీట్ లో పెట్టారు. అన్నిటికీ మించి చంద్రబాబు స్కిల్ విషయంలో ఎలాంటి తప్పూ జరగలేదన్న వాదనకే నిలబడ్డారు. అయితే కేసీఆర్ తప్పు జరగలేదని గట్టిగా చెప్పడం లేదు. తప్పు జరిగిందనీ, అయితే ఆ తప్పుకు తాను బాధ్యుడిని కాననీ చెప్పుకుంటున్నారు. 

ఇక్కడ గతంలో కవితను ఈడీ అరెస్టు చేసినప్పుడు కూడా ప్రజల నుంచే కాదు, పార్టీ కార్యకర్తల నుంచి కూడా పెద్దగా స్పందన రాలేదన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఆమె అరెస్టు కూడా అనూహ్యంగా ప్రాపర్ విచారణ లేకుండా జరగలేదు. నోటీసులు ఇచ్చారు. పలు మార్లు విచారించారు. ఇప్పుడు కేటీఆర్ విషయంలో కూడా అదే జరుగుతోంది. ఏసీబీ, ఈడీలు ఆయనకు నోటీసులు ఇచ్చాయి. సోమ్ము అక్రమ తరలింపునకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. దీంతో ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో అవకతవకలు జరిగాయన్న భావన ప్రజలలో వ్యక్తం అవుతున్నది. దీంతో కేటీఆర్  అరెస్టు విషయంలో నిరసనలు వ్యక్తమైనా అవి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేంత స్థాయిలో ఉండే అవకాశం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.