నకిలీ స్నేహితులను గుర్తించే మార్గాలు ఇవే..!


తల్లిదండ్రులను, తోడబుట్టిన వారిని ఎవరూ ఎంచుకోలేరు.  అవి దేవుడు ఇచ్చే బందాలు.  కానీ ప్రతి వ్యక్తి స్నేహితులను ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. మంచి స్నేహితులు ఉన్న వారి జీవితం చాలా బాగుంటుంది. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితులు,  సమస్యలలో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్న స్నేహితుల అవసరం,  వారి సహాయం ఎంతో అవసరం అవుతుంది.  అయితే ప్రతి ఒక్కరి జీవితంలో నిజాయితీగా ఉన్న, నిజమైన స్నేహితులు ఉండరు. కొందరి జీవితాలలో నకిలీ స్నేహితులు కూడా ఉంటారు.  కేవలం స్వార్థం కోసం, మోసం చేయాలనే ఉద్దేశంతో స్నేహం చేసే వారు ఉంటారు. నకిలీ స్నేహితులు వెనక గోతులు తీస్తూ ఉంటారు. చాలా నష్టాలు కూడా కలిగించే అవకాశం ఉంటుంది. నిజమైన స్నేహితుడికి,  నకిలీ స్నేహితుడికి మధ్య వ్యత్యాసాన్ని చెప్పే మార్గాలు కొన్ని ఉన్నాయి.  అవేంటో తెలుసుకుంటే..

దూరం..

నకిలీ స్నేహితులను బయటపెట్టే మంచి మార్గం వారు పాటించే దూరం. స్నేహితులు సమస్యలు ఏమీ లేకుండా బాగున్నప్పుడు,  పార్టీలు చేసుకుంటున్నప్పుడు,  ఆర్థికంగా  బాగున్నప్పుడు,  ప్రయాణాలు ప్లాన్  చేస్తున్నప్పుడు  అందరికంటే ముందు వీళ్లే కనిపిస్తారు.  కానీ స్నేహితులు ఏవైనా సమస్యలలో ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బందులలో ఉన్నప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు  దూరం మెయింటైన్ చేస్తారు. అంతేకాదు నేను చాలా బిజీగా ఉన్నాను అని చెప్పడం  లేదా ఫోన్  ఆఫ్ లో ఉందని చెప్పడం లాంటివి చేస్తారు. కొన్నిసార్లు కేవలం దూరంగా ఉంటూ మాటల్లో సానుభూతి తెలుపి తప్పించుకుంటారు.

ఈర్ష్య..

నిజమైన స్నేహితుడు తన స్నేహితుల  విజయాన్ని తనదిగా భావిస్తాడు.  కానీ  నకిలీ స్నేహితులు తన స్నేహితులు  అభివృద్ధి చెందడం చూసి ఎప్పటికీ సంతోషించడు.  ప్రమోషన్ వచ్చినప్పుడు లేదా గుడ్ న్యూస్ చెప్పినప్పుడు ఓర్వలేరు.  పైగా   అలాంటి సంతోష సమయాల్లో  నీ అదృష్టం బాగుంది అందుకే నీకు అవన్నీ దొరికాయి వంటి ఎగతాళి మాటలు కూడా మాట్లాడతారు.  విజయం పట్ల అసూయ పడే స్నేహితులు ఉంటే వారితో జాగ్రత్తగా ఉండాలి.

అవమానం..

స్నేహితుల మధ్య జోకులు వేసుకోవడం, ఆటపట్టించడం సర్వసాధారణం, కానీ నకిలీ స్నేహితులు  తరచుగా అందరిముందు   తక్కువ చేయడానికి, తక్కువ చేసి మాట్లాడటానికి  ప్రయత్నిస్తారు. బలహీనతలు బయటపెట్టడం,  ఎగతాళి చేయడం వంటివి చేస్తారు.  అలాంటి సందర్భాలలో బాధపడితే నేను జోక్ చేశా.. దీనికే బాధపడాలా, కనీసం ఫ్రెండ్ గా నేను ఇలా కూడా మాట్లాడకూడదా అని కవరింగ్ కూడాచేస్తారు.

రహస్యాలు..

స్నేహితులు  ఇతరుల రహస్యాలను కథలు కథలుగా లేదా కబుర్లు లాగా చెప్పేవాడు అయితే అతను  ఇక్కడ వినే రహస్యాలు కూడా అవతలి వారికి చెప్పేస్తాడు. నకిలీ స్నేహితుడు ఎప్పుడూ రహస్యాలను దాచి ఉంచలేరు.  పోస్ట్‌మ్యాన్ లాగా వ్యవహరించి అవతలి వారి విషయాలను ఇవతలికి,  ఇవతలి వారి విషయాలను అవతలికి చెబుతూ ఉంటారు.  ఇలాంటి వ్యక్తి అస్సలు మంచివాడు కాదు.

స్వార్థం..

నకిలీ స్నేహితులు ఎప్పుడూ తమ స్వార్థం గురించే ఆలోచిస్తారు.  ఎవరైనా తన దగ్గర  ఏదైనా  చెప్పుకునేటప్పుడు మధ్యలో తన సమస్యలు,  తన ఇబ్బందులు చెప్పి తన స్నేహితుల మాటలు డైవర్ట్ చేస్తారు. ఇతరుల భావాలు, ఎమోషన్స్ అస్సలు వారికి పట్టవు. అందరూ తను చెప్పేది వింటే చాలని అనుకుంటారు తప్ప అందరి విషయాలు తనకు అవసరం లేనట్టు బిహేవ్ చేస్తారు.

పైన చెప్పుకున్న లక్షణాలు మీ స్నేహితులలో ఉంటే దయచేసి వారిని దూరం ఉంచడం ఉత్తమం. వారికి పర్సనల్ విషయాలు,  ముఖ్యమైన విషయాలు, జీవితంలో ఏవైనా రహస్యమైన విషయాలు చెప్పకుండా ఉండటమే మంచిది. అలాంటివారి కోసం సమయాన్ని వృథా చేయడం కూడా తప్పే.

                            *రూపశ్రీ.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu