గజ్వేల్ స‌భ‌పై టీఆర్ఎస్‌లో హైటెన్ష‌న్‌.. రేవంత్‌రెడ్డి స‌త్తా చాటుతారా?

ముఖ్యమంత్రి సొంత నియోజక వర్గం గజ్వేల్ గ‌డ్డ‌పై కాంగ్రెస్ పార్టీ సెప్టెంబర్ 17న తలపెట్టిన ద‌ళిత గిరిజ‌న దండోరా స‌భ సజావుగా సాగుతుందా? ఉద్రిక్తలకు దారి తీస్తుందా అనే చర్చ  ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఆరు నూరైనా, నూరు ఆరైనా ఈ సభను విజయవంతం చేయాలని, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పట్టుదలతో ఉన్నారు. అలాగే, ఈ సభను ఏడో విధంగా తుస్సు మనుపించాలని అధికార పార్టీ, ముఖ్యమంత్రి అంతే పట్టుదలతో ఉన్నారు. నిజానికి, గజ్వేల్ సభ ఖరారు అయిన సందర్భంలోనే  కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సభను భగ్నం చేసే కుట్రలు చేస్తే ఊరుకునేది లేదని తీవ్రంగా హెచ్చరించారు. రావిరాలలో గర్జన సభ జరిగిన సందర్భంలోనే రేవంత్ రెడ్డి, ‘ఇంద్రవెల్లిలో ఓ అడుగు వేశాం.. ఇంకో అడుగు రావిరాలలో  వేశాం.. మరో  అడుగు ముఖ్యమంత్రి కేసీఆర్ నెత్తి మీద పెట్టి. టీఆర్ఎస్ పార్టీని పాతాళానికి తొక్కుతాం’ మని తన‌దైన శైలిలోహెచ్చరించారు. మరోవంక తెరాస నాయకులు గజ్వేల్‌లో రేవంత్ ఆటలు సాగవని అప్పటినుంచి చెపుతూనే ఉన్నారు. దీంతో గజ్వేల్ గర్జన సభ సభ సజావుగా సాగుతుందా లేదా అన్న ఉత్కంఠ‌ నెలకొంది. 

రావిరాలలో రేవంత్ చేసిన హెచ్చరికను పరిగణలోకి తీసుకుంటే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ స‌భ‌ను ఎంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారో అర్థమవుతుంది. నిజానికి, ప్రస్తుతం ఇంటా బయట సమస్యలు, సవాళ్ళు ఎదుర్కుంటున్న రేవంత్ రెడ్డికి ఈ సభను సక్సెస్ చేయడం అవసరం. అదే ఈ సభ ఫెయిల్ అయిందంటే, బయటి నుంచే కాదు అలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తున్న పార్టీ సీనియర్ల‌ నుంఛి కూడా రేవంత్ రెడ్డికి తల నొప్పులు తప్పవు.  

మరోవంక ఈ సభను సక్సెస్ చేసుకోవడం రేవంత్ రెడ్డికి ఎంత అవసరమో, సభను ఫెయిల్ చేయడం అధికార తెరాసకు అంతే అవసరం. ముఖ్యమంత్రి సొంత గడ్డమీద కాంగ్రెస్ సభ సక్సెస్ అయితే, ఆ ప్ర‌భావం రాష్ట్రం అంతటా ఉంటుంది. ఇప్పటికే, రేవంత్ రెడ్డి పెద్ద నోరు తట్టుకోలేక పోతున్న అధికార పార్టీకి గజ్వేల్ గర్జన పెద్ద సవాలునే విసురుతోంది. అందుకే రేవంత్ రెడ్డి స‌భ‌ను ఎలాగైనా తుస్సు మనిపించాలని టీఆర్ఎస్ కుట్ర‌లు చేస్తుంద‌ని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే, టీఆర్ఎస్ నాయకులు, కీలక నేతలు తమ పార్టీకి చెందిన స్థానిక ప్రజా ప్రతినిధులు,  స్థానిక నేత‌ల‌ను, ఇతర స్థానిక పెద్దలు, వ్యాపారస్తులు, రేషన్ డీలర్లను పిలిపించుకొని, సెప్టెంబ‌ర్ 17నే ప్ర‌తి గ్రామంలో క‌నీసం 500మందికి భోజ‌నాలు పెట్టాల‌ని, ఊరూరా టీఆర్ఎస్ మీటింగులు పెట్టుకోవాల‌ని ఆదేశాలు వెళ్లాయి. అదే రోజు మంత్రి హ‌రీష్ రావు కూడా గజ్వేల్’లో ప‌ర్య‌టిస్తున్నారు. ఇవ‌న్నీ రేవంత్ స‌భ‌కు జనం రాకుండా చేస్తున్న ప్ర‌య‌త్నాలే అని కాంగ్రెస్ శ్రేణులు మండిప‌డుతున్నాయి.

అయితే, ల‌క్ష మందితో స‌భ పెట్టాల‌ని నిర్ణ‌యించిన రేవంత్ రెడ్డి, ప్ర‌తి పోలింగ్ బూతు నుండి క‌నీసం ఏడుగురు కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌లు మీటింగుకు రావాలని పిలుపునిచ్చారు. అలా వస్తే లక్ష అంకె దాటిపోతుందని లెక్కలు వేస్తున్నారు. అదలా ఉంటే అదే రోజున నిర్మల్’లో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సభ ఉన్న నేపధ్యంలో, గజ్వేల్ సభలో గందరగోళం మీడియా ఫోకస్’ ను అటు తిప్పేందుకు కాంగ్రెస్, తెరాస కుట్రలు చేస్తున్నాయని, బీజేపే నాయకులు ఆరోపిస్తున్నారు. మరోవంక ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా  అటేన్షన్ డైవెర్ట్ చేసేందుకే  అదే రోజున యాదాద్రి యాత్ర పెట్టుకున్నారని అంటున్నారు.