జ‌స్టిస్ క‌న‌గ‌రాజ్‌కు మ‌ళ్లీ షాక్‌.. ఇక చెన్నై వెళ్లిపోవాల్సిందేనా?

దెబ్బ మీద దెబ్బ‌. ఇటు జ‌గ‌న్ స‌ర్కారుకు.. అటు జ‌స్టిస్ క‌న‌గ‌రాజ్‌కు హైకోర్టులో దెబ్బ మీద దెబ్బ త‌గులుతోంది. గ‌తంలో ఎస్ఈసీ కుర్చీలో కూర్చోబెట్టారు. కోర్టు మొట్టికాయ‌ల‌తో దిగిపోయారు. ఆ త‌ర్వాత పోలీస్ కంప్లైంట్స్ అథార్డీ ఛైర్మ‌న్‌-పీఏసీ గా నియ‌మించారు. ఇప్పుడు ఆ పోస్ట్ కూడా ఊస్ట్ అయ్యేలా ఉంది. జస్టిస్ క‌న‌గ‌రాజ్ నియామ‌క జీవోను 6 వారాల పాటు సస్పెండ్ చేస్తూ హైకోర్టు ధ‌ర్మాస‌నం మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు ఇచ్చింది. ఇలా సీఎం జ‌గ‌న్‌ను న‌మ్ముకొని చెన్నై నుంచి ఏపీకి షిఫ్ట్ అయినందుకు.. వ‌రుస షాకుల‌తో ప‌రువంతా పోయి.. మ‌ళ్లీ చెన్నైకే వెళ్లిపోవాల్సిన దుస్థితి దాపురించింద‌ని అంటున్నారు. జగ‌న్ ఆడుతున్న రాజ‌కీయ ఆట‌కు జ‌స్టిస్ క‌న‌గ‌రాజ్ లాంటి వాళ్లు బ‌ల‌వుతున్నారా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది.

ఏపీ పోలీసు ఫిర్యాదుల అథార్టీ ఛైర్మన్‌గా మద్రాస్‌ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ వి.కనగరాజ్‌ను నియమించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నియామకంపై రాష్ట్ర హోంశాఖ జూన్‌ 20న జారీచేసిన జీవో 57ను రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది పారా కిశోర్ పిటిష‌న్‌ దాఖలు చేశారు. హోంశాఖ ముఖ్యకార్యదర్శి, ఏపీ రాష్ట్ర పోలీసు కంప్లైంట్స్‌ అథార్టీ (ఏపీఎస్‌పీసీఏ) ఛైర్మన్‌, వ్యక్తిగత హోదాలో జస్టిస్‌ కనగరాజ్‌ను ప్రతివాదులుగా చేర్చారు. నిబంధనలు పాటించకుండా నియమించారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరు వైపులా వాదనలు విన్న ధర్మాసనం జస్టిస్‌ కనగరాజ్‌ నియామక జీవోను 6 వారాల పాటు సస్పెండ్‌ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషన్‌పై విచారణ ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు తెలిపింది.  

పిటిష‌నర్ వాద‌న ఏంటంటే....
ఏపీ రాష్ట్రస్థాయి పోలీసు ఫిర్యాదుల అథార్టీ నిబంధన 4(ఏ)కు విరుద్ధంగా జస్టిస్‌ కనగరాజ్‌ను నియమించారు. ఈ అథార్టీ రాజకీయ, కార్యనిర్వాహక జోక్యం లేకుండా స్వతంత్రంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ప్రకాశ్‌సింగ్‌ కేసులో సుప్రీంకోర్టు నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్‌ కనగరాజ్‌ను నియమించింది. ప్రస్తుతం ఆయన వయసు 78 ఏళ్లు. ఛైర్మన్‌గా నియమితులయ్యే వ్యక్తి చట్టప్రకారం 65 ఏళ్లు నిండే వరకే ఆ పదవిలో కొనసాగుతారు. వయసు రీత్యా అర్హత లేని వారిని ఛైర్మన్‌గా నియమించారు.  

ఏపీ ముఖ్యమంత్రి సిఫారసు మేరకు గతంలో జస్టిస్‌ కనగరాజ్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా సర్కారు నియమించింది. దీన్ని హైకోర్టు రద్దుచేసింది. ఆ త‌ర్వాత‌ ఎస్‌ఈసీ పదవికి బదులుగా.. పోలీసు కంప్లైంట్స్‌ అథార్టీ ఛైర్మన్‌గా నియమించారు. జస్టిస్‌ కనగరాజ్‌కు ముఖ్యమంత్రితో ఉన్న సాన్నిహిత్యం ఇందుకు కారణం. ఆయ‌న‌ నియామకానికి వీలుగా నిబంధనలను సవరించారని పిటిష‌న‌ర్ తెలిపారు. దీంతో.. జస్టిస్‌ కనగరాజ్‌ నియామక జీవోను 6 వారాల పాటు సస్పెండ్‌ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషన్‌పై విచారణ ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు తెలిపింది.