రాజు చచ్చాడు.. రాక్షసుడు బతికే ఉన్నాడు...

ఒక మృగం చనిపోయింది.. సైదాబాద్ బాలిక హత్యాచార ఘటనలో నిదితుడిగా ఉన్న.. మగ మృగం పల్లకొండ రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. రాష్ట్ర మంత్రి, ఈ కేసు విషయంలో సరైన సమాచారం లేకుండా ట్వీట్ చేసి విమర్శలు ఎదుర్కుంటున్న మంత్రి కేటీఆర్ చేసిన మరో ట్వీట్ ఇది. నిజమే, రాజు ఆత్మహత్యతో ఒక మృగం చనిపోయింది. అయితే, ఒక మృగం చావు సంబురాలు ఇంకా మొదలైనా కాక ముందే, మరో మృగం బయటకు వచ్చింది. హైదరాబాద్, పాతబస్తీ మంగళ్‌హాట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మాంగారు బస్తీలో మరో చిన్నారిపై.. మరో మృగం, మరో మృగాడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాలిక అరుపులతో స్థానికులు ఘటనాస్థలికి వెళ్లి రక్షించారు. ఈ క్రమంలో నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిజానికి ఇలాంటి దుర్ఘటనలు ప్రతి రోజు ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నా, ఎక్కడో ఒకటో ఆరో కేసులే ఇలా కొంత సంచలనం అవుతాయి. అలాగే, నిదితులను చట్టపరంగా విచారించి శిక్షించిన ఉదంతాలు చాలా అరుదుగా మాత్రమే వెలుగు చూస్తాయి. మృగాళ్ళ కథ‌ల ముగింపులు అన్నీ.. అయితే ఎన్కౌంటర్ కాదంటే, ఇదిగో ఇలా ఆత్మహత్యతో ముగిసి పోతున్నాయి.
 
ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు  (2008) లో వరంగల్’లో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్ధులపై యాసిడ్ దాడికి పాల్పడిన నిందితులను 3రోజుల అనంతరం పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. నిందితులు శాఖమూరి శ్రీనివాస్, బజ్జురి సంజయ్, పోతరాజు హరికృష్ణ తమ కస్టడీ నుంచి తప్పించుకుని పారిపోతుండగా ఎన్‌కౌంటర్ చేసినట్టు అప్పటి వరంగల్ ఎస్పీ వీసీ సజ్జనార్ ప్రకటించారు. నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ, ఆ ఇద్దరి ఎన్కౌంటర్ జరిగిన ముందు రోజు రాత్రి ఢిల్లీ నుంచి వచ్చిన ముఖ్యమంత్రి, అర్థరాత్రి వరంగల్ ఎస్పీకి ఫోన్ చేసి, ‘ఫైల్ క్లోజ్’ చేయమని ఇచ్చిన  చిన్ని  ఆదేశాల ప్రకారం పోలీసులు తెల్లారే సరికి ఫైల్ క్లోజ్ చేశారని ఆంటారు. 

నిజానికి అదొక బూటకపు ఎన్కౌంటర్ అన్న అనుమానాలు ఉన్నా, అలాంటి  వాదనలు కొందరు వినిపించినా  పోలీసుల చర్యను ఎవరూ తప్పు పట్టలేదు. పైగా సజ్జన్నార్ కు  జైజైలు పలికారు. అంటే, ఇలాంటి హేయమైన నేరాలకు పాల్పడిన వారికీ, విచారణ అవసరం లేకుండా తక్షణం శిక్షించాలని ఆ శిక్ష చావే కావాలని ప్రజలు బావిస్తున్నారు, కోరుకుంటున్నారు, అనుకోవచ్చును. అలాగే, 2019 లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశపై సామూహిక అత్యాచారం కేసులోనూ, ప్రజలు అదే కోరుకున్నారు, పోలీసులు అదే ఎన్కౌంటర్ శిక్షను అములు చేశారు. నలుగురినీ ఎన్కౌంటర్’లో లేపేశారు. అవును, ఇది కూడా బూటకపు ఎన్కౌంటర్ అయితే కావచ్చును, కానీ, అదే న్యాయం, అదే ధర్మంగా నిలిచి పోయింది. 

ఇప్పుడు,సైదాబాద్‌ బాలిక హత్యాచార ఘటనలో నిందితుడిగా ఉన్న పల్లకొండ రాజు ఆత్మహత్య కూడా అదే కోవకు వస్తుందా, అంటే వచ్చినా రావచ్చును. కధకు చిన్న ట్విస్ట్ ఇచ్చి పోలీసులే ముగింపు పలికి ఉంటే ఉండ వచ్చును. అయినా, ఎవరూ పోలీసులను తప్పు పట్టరు. అందుకే, ఎన్కౌంటర్ స్థానంలో ఆత్మహత్యను చేర్చారా అనే అనుమానాలు వస్తే రావచ్చును. అటు చేసి, ఇటు చేసి ఈ కేసు కీలక నేత మెడకు చుట్టుకోవడంతో... రాజు ఫైల్ క్లోజ్ చేశారా అనే సందేహాలు వచ్చినా రావచ్చును. ఈ ఉదయమే ఇద్దరు మంత్రులు వెళ్లి మృగాడికి బలైన చిన్నారి తల్లితండ్రులను కలిశారు. రూ. 20 లక్షల చెక్కును ఇచ్చివచ్చారు. అయినా ఆ చిన్నారి తండ్రి మాకు చెక్కు వద్దు.... న్యాయం కావాలని చెక్కును తిరస్కరించారు. ఆ తర్వాత రాజు చచ్చాడు. ఈ వరస సంఘటనల మధ్య ఏదైనా కన‌పడని లీంకు ఉందొ లేదో కానీ అనుమానాలకు మాత్రం అవకాశం ఉందనే అంటున్నారు.
 
అదెలా ఉన్నా ..ఇప్పటికైతే రాజు చచ్చాడు ..కానీ  రాక్షసుడు ఇంకా బతికే ఉన్నాడు. నిజానికి, ఈ కేసు ఫైల్ ఇక్కడితో క్లోజ్ కాదు, ఇక్కడి మొదలవ్వాలని, సోషల్ మీడియాలో కొందరు డిమాండ్ చేస్తున్నారు.   .ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి కొందరు కీలక్ నేతలు  చేసిన వ్యాఖ్యలు, చోటు చేసుకున్న పరిణామాల క్రమం నేపధ్యంలో ఇంకా లోతైన విచారణ జరప వలసిన అవసరం ఉందని, మంత్రి కేటీఆర్  ట్వీట్ లో పేర్కొన్నట్లుగా, ‘చిన్నారి ఆత్మకు శాంతి చేకురాలంటే, ఈ కేసును అనేక కోణాల్లో విచారించవలసిన అవసరం ఉందని అంటున్నారు. అలాగే, న్యాయస్థానాలు సుమోటోగా కేసు పూర్వా పరాలపై విచారణ జరిపించ వలసిన అవసరం ఉందని అంటున్నారు.