తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు

తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం (జులై 26) భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 24 గంటలలో బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

గత మూడు రోజులుగా వాతావరణం మేఘావృతమై చిరుజల్లులు, అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకూ భారీ వర్షం ముప్పు పొంచి ఉందని పేర్కొన్న వాతావరణ శాఖ.. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రజలకు సూచించింది. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని, అప్రపమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లాల కలెక్టర్లకు సూచించింది. విపత్తు నిర్వహణా దళాలను అప్రమత్తం చేసింది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu