సీఎం రమేష్ దందాగిరి.. జనసేన ఎమ్మెల్యేల దాదాగిరి!
posted on Jul 25, 2024 10:01PM
(శుభకర్ మేడసాని, ఇన్‌పుట్ ఎడిటర్, తెలుగువన్) చింతకుంట మునుస్వామి రమేష్, ఆయనే సీఎం రమేష్‌గా ప్రసిద్ధి. జూన్ 2019కి ముందు వరకు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. అక్టోబర్ 2018లో సీఎం రమేష్‌కి చెందిన కంపెనీ, ‘రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ ఆఫీసులపై నాటి కేంద్ర ప్రభుత్వం ఇన్‌కమ్ టాక్స్, ఎన్‌ఫోర్స్.మెంట్ డైరక్టరేట్ (ఈడీ)లతో దాడి చేయించింది. వందకోట్ల రూపాయల అంతుచిక్కని ట్రాన్సాక్షన్స్ కనుగొన్నట్టు అప్పట్లో కేంద్ర ఏజెన్సీలు ప్రకటించాయి. సరిగ్గా దాడులు జరిగిన ఆరు నెలలు తిరక్కముందే సీఎం రమేష్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 2023లో కీలకమైన కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు, ఈశాన్య రాష్ట్రాలు త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలకి ముందు 45 కోట్ల విలువైన ఎలక్ట్రోరల్ బాండ్లు భారతీయ జనతా పార్టీకి చందాగా సమర్పించారు సీఎం రమేష్.
‘ది క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్స్ ఎఫైర్స్’ (సీసీఈఏ) హిమాచల్‌ప్రదేశ్‌లో 2,614 కోట్ల విలువ చేసే సున్నీ డ్యామ్ హైడ్రో ప్రాజెక్టుని అప్రూవ్ చేసింది. అప్రూవ్ అయిన తర్వాత కేవలం పది రోజుల్లో సీఎం రమేష్ కంపెనీ రిత్విక్ ప్రాజెక్ట్స్ ఆ కాంట్రాక్ట్ దక్కించుకుంది. అంతేకాదు, ఇదే ప్రాజెక్టులో కోట్ల ఇంజనీరింగ్ అండ్ ప్రొక్యూర్‌మెంట్ కన్‌స్ట్రక్షన్ (ఈపీసీ) విధానంలో 11 వందల కోట్ల కాంట్రాక్ట్ సీఎం రమేష్‌కి దక్కింది. రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆపరేషన్స్ ప్రెసిడెంట్‌గా సీఎం రమేష్ కుమారుడు రిత్విక్ రమేష్ కొనసాగుతున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో తపోవన్ విష్ణుగఢ్ హైడ్రో ఎలక్ట్రో ప్రాజెక్టు కూడా సీఎం రమేష్ కంపెనీయే దక్కించుకోవడం విశేషం. ఇదంతా గతం.
మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలలో కూటమి అభ్యర్థిగా పొత్తుల్లో బీజేపీ తరఫున అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి పోటీచేసి విజయం సాధించారు. అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి దగ్గర భారత నౌకాదళం నావెల్ ఆల్ట్రనేటివ్ ఆపరేషన్స్ బేస్ (ఎన్ఏఓబీ) ప్రాజెక్టును ప్రారంభించింది. ఏపీ ప్రభుత్వం రాంబిల్లి వద్ద భారత నౌకాదళానికి భారీగా భూమిని కేటాయించింది. న్యూక్లియర్ సబ్‌మెరైన్ బేస్ ప్రాజెక్టు పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. వైజాగ్ నగరానికి దక్షిణంగా 60 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ రాంబిల్లి నావెల్ బేస్ 1600 హెక్టార్లలో విస్తరించి వుంది. ఈ స్థావరం బంగాళాఖాతంలోకి సులభంగా చేరుకోవడానికి సముద్ర గర్భంలో లోతైన టన్నెల్, అందుకు వీలుగా పెద్దపెద్ద భారీ రాళ్ళతో కొంతమేరకు సముద్రాన్ని పూడ్చటం, లోతు చేయడం ద్వారా ప్రత్యేకమైన సముద్ర, భూగర్భ స్టోరేజ్ సౌకర్యాలు మొదలగు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎల్ అండ్ టీ, మరో సంస్థ ఈ పనుల్లో చురుగ్గా పాల్గొంటున్నాయి. ఇక్కడకి సీఎం రమేష్ ఎంటరై ఆ సంస్థలను తప్పుకోండి అంటూ బెదిరిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మిగతా పనులు తన కంపెనీ రిత్విక్ ప్రాజెక్ట్స్ చేపడుతుంది అని హుకుం జారీ చేశారని సమాచారం. ‘తెలుగువన్’ సీఎం రమేష్‌తో మాట్లాడే ప్రయత్నం చేసింది. ఆయన ‘తెలుగువన్’కి అందుబాటులోకి రాలేదు.
బాధ్యతాయుతమైన ప్రజాసేవలో ఉన్నత పదవులు ప్రజలు కట్టబెడితే, రాజకీయ నాయకుల తీరు పూర్తి వ్యాపార ధోరణిలో తప్ప మరోలా కనిపించడం లేదు. పూర్వం ధనికులు రాజకీయాల్లోకి వస్తే తమ సర్వస్వం ప్రజాసేవకే ధారపోసేవారు. నేడు రాజకీయమంటే వ్యాపారం. కేవలం ధనార్జనగా మార్చేశారు.
టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు తప్పు చేస్తే, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటారు. జనసేన ఎమ్మెల్యేలు తప్పుచేస్తే ‘జనసేనాని’ పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకుంటారు. మరి, రాష్ట్రంలో బీజేపీ నాయకులు తప్పు చేస్తే ఎవరు చర్యలు తీసుకుంటారు? సీఎం రమేష్ తప్పు చేస్తే ఎవరు మందలిస్తారు? బీజేపీ పార్టీ చీఫ్ పురందేశ్వరి మందలిస్తారా? లేదా ఒక సాధారణ ఆర్ఎస్ఎస్ కార్యకర్త, కేంద్ర మంత్రి అయిన శ్రీనివాస వర్మ మందలిస్తారా? ఏనుగంత బలమున్న సీఎం రమేష్‌ని ఆ పార్టీలో ఎవరు ప్రశ్నించగలరు?
అనకాపల్లి జిల్లా యలమంచిలికి ప్రాతినిధ్యం వహిస్తున్న జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ తీరుపట్ల కూడా పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన వ్యక్తి పేరిట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దందాలు జరుగుతున్నాయని, పారిశ్రామికవేత్తలందర్నీ వాటాలకోసం బెదిరింపులకు దిగుతున్నారని, ఇది ఏమాత్రం సహించరానిదని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కి ఫిర్యాదులు వెళ్ళాయి. దాంతో యలమంచిలి నియోజకవర్గ కేంద్రం పరిధిలోని అచ్యుతాపురం కేంద్రంగా పనిచేస్తున్న పారిశ్రామికవేత్తలు పలువురు, విజయకుమార్ వైఖరి ఇలాగే కొనసాగితే తాము పారిశ్రామిక యూనిట్లను మూసివేయడం మినహా మరో మార్గం లేదని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఇంతకుముందు ప్రస్తావించిన రాంబిల్లి నావికాదళం ప్రాజెక్టు కాంట్రాక్టర్లను కూడా ఈయనగారు బెదిరించినట్టు ఫిర్యాదులు అందాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ తీవ్రంగానే మందలించారని తెలిసింది. పెందుర్తి నుంచి కూడా ఫిర్యాదులు వస్తున్నాయని పవన్ కళ్యాణ్ చెప్పినట్టు తెలిసింది.
పెందుర్తి నియోజకవర్గంలోని ఫార్మా పార్కులో వందలాదిమంది పారిశ్రామికవేత్తలు వున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు పేరిట తమకు బెదిరింపులు, వేధింపులు వస్తున్నాయంటూ కొందరు ఇప్పటికే అటు తెలుగుదేశం అధిష్ఠానానికి, ఇటు జనసేన అధిష్ఠానానికి ఫిర్యాదులు చేశారు. వీటిని దృష్టిలో వుంచుకుని పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి వైఖరిని సహించేది లేదని గట్టిగా చెప్పినట్టు తెలిసింది. ఈ ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకని, శాసనసభ్యులు అందరితో ఆయన మాట్లాడినప్పుడు, రౌడీయిజం చేస్తే సహించేది లేదని, అటువంటి ఎమ్మెల్యేలను వదులుకోవడానికి కూడా నేను సిద్ధమని ఆయన స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారని తెలిసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లాంటి గూండా పార్టీని ఎదిరించి వచ్చినవాడినని... బెదిరింపులు, దౌర్జన్యాల్లాంటి పనులు చేస్తే వేటు తప్పదని వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. ప్రజాస్వామ్య విధానాలను అపహాస్యం చేసినా, రౌడీయిజం చేసినా మీరు ఎంతటి వారయినా, మీరు పార్టీకి ఎంత విధేయులైనా వదులుకోవడానికి సిద్ధం అంటూ పవన్ కళ్యాణ్ హెచ్చరించారని తెలిసింది. అప్పుడే కొంతమంది శాసనసభ్యులు పాదాభివందనాలు చేయించుకుంటూ వుండటం, కార్యకర్తలు, ప్రజల పట్ల తలబిరుసుగా వ్యవహరిస్తూ వుండటం పట్ల పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారని తెలిసింది. శాసనసభ్యులుగా గెలిచిన వారికి సభ్యత, సంస్కారాలు నేర్పాల్సిన అవసరం లేదని, మర్యాదగా ప్రవర్తిస్తారని ఆశిస్తున్నానని సూచించినట్లు విశ్వసనీయ సమాచారం.