ప్రధాని పదవికి రాహుల్ అనర్హుడా?.. రాబర్ట్ వధేరా మాటల ఆంతర్యమేంటి?
posted on Dec 24, 2025 12:21PM

కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సొంత కుటుంబం నుంచే వ్యతిరేక సెగ తగులుతోందా? ఇటీవలి బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ఘోర పరాజయం తరువాత ఇండీ కూటమి నేతలు రాహుల్ నాయకత్వంపై ఒకింత ఆసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీలో కూడా పలువురు నేతలు రాహుల్ నాయకత్వ సామర్థ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేశారు. తాజాగా రాహుల్ సొదరి ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వధేరా కూడా అదే తరహా వ్యాఖ్యలు చేశారు. నేరుగా రాహుల్ పేరు ఎత్తకుండానే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడానికీ, ప్రధాని మంత్రి పదవిని అధిష్టించడానికి కాంగ్రెస్ లో సమర్థత ఉన్న నేత తన సతీమణి ప్రియాంక వధేరా గాంధీ మాత్రమేనంటూ రాబర్ట్ వధేరా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పార్టీలో ప్రధాన మంత్రి పదవికి తన భార్య, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ అర్హురాలంటూ రాబర్ట్ వధేరా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక పెను చీలికకు దారి తీసే అవకాశాలున్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
రాబర్ట్ వధేరా.. ప్రియాంక వధేరా లోక్ సభలో బలమైన గళం వినిపించారనీ, ఆమెకు ప్రధాన మంత్రి పదవి చేపట్టడానికి అవసరమైన అన్ని అర్హతలూ ఉన్నాయనీ అన్నారు. అక్కడితో ఆగకుండా, కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రియాంక గాంధీని ప్రకటిస్తేనే దేశంలో కాంగ్రెస్ కు ఆదరణ పెరుగుతుందని, అప్పుడే దేశంలో కాంగ్రెస్ విజయం సాధించి అధికారాన్ని హస్తగతం చేసుకోగలుగుతుందనీ రాబర్ట్ వధేరా అన్నారు.
లోక్ సభ శీతాకాల సమావేశాల ముగింపు సందర్భంగా దాదాపు ఇలాంటి వ్యాఖ్యలే కొందరు ఎంపీల నంచి కూడా వచ్చిన సంగతి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే రాబర్ట్ వధేరా వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. రాబర్ట్ వధేరా చేసిన వ్యాఖ్యలు ఆయన సొంత అభిప్రాయమనీ, వాటితో పార్టీకి సంబంధం లేదంటూ కొందరు సీనియర్లు వివాదం పెరగకుండా ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. ఇక ప్రియాంక వధేరా గాంధీ అయితే, తన భర్త వ్యాఖ్యలపై స్పందించకుండా మౌనం వహించారు. దీనిపై రాహుల్ ఏ విధంగా స్పందిస్తారన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతోంది.