ముల్లంగి ఆకులు దొరికితే అస్సలు వదలకండి.. వీటితో ఎన్ని లాభాలంటే..!
posted on Nov 18, 2024 9:17AM
ముల్లంగి ఆరోగ్యానికి చాలా మంచిది. ఎక్కువ శాతం నీరు, ఫైబర్ కలిగిన ఈ దుంపలు చాలా రకాల ఆరోగ్య సమస్యలకు చెక్ పెడతాయి. ముఖ్యంగా మొలలు, మలబద్దకం. మధుమేహం వంటి సమస్యలున్న వారికి ముల్లంగి ఔషధం కంటే తక్కువ కాదు. అయితే ముల్లంగి దుంపలే కాకుండా ముల్లంగి ఆకులు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయట. ముల్లంగి ఆకులు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో.. ఇవి ఎవరికి ఎక్కువ ప్రయోజనాలు చేకూరుస్తాయో తెలుసుకుంటే..
ముల్లంగి ఆకులలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా పోషకాలు అందిస్తాయి. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ముల్లంగి ఆకులను తరచుగా తింటూ ఉంటే చాలా మేలు జరుగుతుంది. సాధారణంగా ముల్లంగిని కొన్నప్పుడు వాటికి ఆకులు ఉంటే వాటిని చాలామంది విసిరేస్తారు. చెత్తబుట్టలో వేస్తారు.
ముల్లంగి ఆకులు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. ముల్లంగి ఆకులలో ఫైబర్ మెరుగ్గా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్దకం, అజీర్ణం, ఇతర కడుపు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ముల్లంగి ఆకులను తరచుగా ఆహారంలో తీసుకోవాలి.
మధుమేహం ఉన్నవారికి కూడా ముల్లంగి ఆకులు సహాయపడతాయి. సాధారణంగా ముల్లంగి దుంపలు మధుమేహం ఉన్నవారికి మేలు చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రిస్తాయి. అలాగే ముల్లంగి ఆకులు కూడా అంతే శక్తివంతంగా పనిచేస్తాయి. శరీరంలో గ్లూకోజ్ స్థాయిని సమతుల్యం చేయడంలో ముల్లంగి ఆకులు సహాయపడతాయి.
శరీరంలో టాక్సిన్లు తొలగించడంలో ముల్లంగి ఆకులు
సహాయపడతాయి. కాలేయాన్ని శుధ్ది చేసి కాలేయ పనితీరును మెరుగ్గా ఉంచుతాయి. అదే విధంగా మూత్ర పిండాల పనితీరును కూడా మెరుగుపరుస్తాయి.
రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉండాలంటే శరీరానికి విటమిన్-సి చాలా అవసరం. ముల్లంగిలో విటమిన్-సి మెరుగ్గా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గు సమస్యలను సులువుగా తగ్గిస్తుంది.
మొలల సమస్యతో బాధపడేవారు ముల్లంగి ఆకులను ఆహారంలో తీసుకుంటే మంచిది. సాధారణంగా మలబద్దకం సమస్య వల్ల మొలల సమస్య వస్తుంది. ముల్లంగి ఆకులు ఆహారంలో తీసుకుంటే మలబద్దకం సమస్య తగ్గి మొలల సమస్య వచ్చే అవకాశమే ఉండదు. ఒక వేళ మొలల సమస్య ఉన్నా ముల్లంగి ఆకులను ఆహారంలో తీసుకుంటే చాలా తొందరగా సమస్య నుండి బయటపడతారు.
*రూపశ్రీ.