జయరామ్ కోమటికి పదవి.. కష్టానికి ఫలితం దక్కింది
posted on Jan 19, 2016 3:46PM
కొంత మంది పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా పని చేస్తారు.. పార్టీ అభివృద్దిలో కాని.. పార్టీకి సంబంధించిన ఏ విషయంలోనైనా కానీ తామున్నామంటూ ఎప్పుడూ ముందుండి నడిపిస్తుంటారు. కానీ అలాంటి వారికి కూడా అప్పుడప్పుడు ఎదురుదెబ్బలు తగులుతుంటాయి. ఎంత కష్టపడి పార్టీకోసం పనిచేసిన వారిని గుర్తింపురావడానికి.. పదవులు దక్కడానికి మాత్రం కొంచెం సమయం పడుతుంది. కానీ అలాంటి వారికి మాత్రం ఎప్పటికైనా మంచి జరుగుతుందని వేరే చెప్పనవసరం లేదు. అలాంటి కోవకు చెందిన వారే జయరామ్ కోమటి.
జయరామ్ కోమటి..
గత 35 సంవత్సరాలుగా అమెరికాలో ఉంటూ.. అక్కడి టీడీపీ కోసం ఎనలేని కృషి చేసిన వారిలో ముందు స్థానం ఎవరిదైనా ఉందంటే అది జయరామ్ కోమటిదే. తానా (అమెరికా తెలుగు సంఘం) నాయకుడిగా ఉంటూ.. కమ్యూనిటీ అభివృద్ధికి పాటుపడుతూ.. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ అక్కడి టీడీపీ అభివృద్ధికి కృషిచేసున్నారు. అంతేకాదు మన దేశం నుండి టీడీపీ పార్టీ తరుపున ఎంత మంది అమెరికా వెళ్లినా వారిని కోఆర్డినేట్ చేయడంలో జయరామే సాటి. చంద్రబాబు నాయుడి దగ్గర నుండి.. కొడుకు లోకేశ్ వరకూ అమెరికా వెళ్లి అక్కడ కార్యక్రమాల్లో పాల్గొనాలంటే జయరామే అన్ని వ్యవహారాలు చూసుకుంటారు. అంతేకాదు తెలుగు సేవా సంస్థలకు, స్వచ్ఛంద సంస్థలకు, వైద్య సంస్థలకు, దేవాలయాల నిర్మాణాలకు విరాళాలు ఇవ్వడమే కాకుండా, తోటివారితో కూడా విరాళాలను ఇప్పించిన ఘనత జయరామ్ దే. వీటన్నింటికి మెచ్చి టీడీపీ అధినేత చంద్రబాబు జయరామ్ కోమటి లాంటి వారు ఏపీ అభివృద్ధిలో ఉండాలని.. ఆయన సేవలు నవ్యాంధ్ర అభివృద్ధికి అవసరమని భావించి ఉత్తర అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా జయరామ్ కోమటిని నియమించారు.
అయితే జయరామ్ కోమటికి ఈ పదవి ఎప్పుడో రావాల్సింది కాని కొన్ని కారణాల వల్ల కాస్త ఆలస్యంగా వచ్చింది. గతంలో చంద్రబాబు ఏపీ ప్రభుత్వ సలహాదారునిగా వేమూరి రవిని నియమించారు. అయితే అప్పుడు అతని నియామకంపై పలువురు టీడీపీ నేతలు పెదవి కూడా విరిచారు. ఎప్పటి నుండో పార్టీ కోసం కృష్టి చేస్తూ.. అమెరికా టీడీపీ అభివృద్దికి పాటుపడుతున్న జయరామ్ కి కాకుండా వేమూరి రవికి ఇస్తారా అని అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. కాని జయరామ్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా పార్టీ అభివృద్ధికి దోహదపడుతూనే ఉన్నారు. ఇప్పుడు అతని శ్రమను గుర్తించిన చంద్రబాబు.. అతని శ్రమకు ఫలితంగా ఈ పదవిని కట్టబెట్టారు.
చంద్రబాబుకు కృతజ్ఞతలు
తనను నమ్మి తనకు ఈ పదవి ఇచ్చిన చంద్రబాబుకు జయరామ్ కృతజ్ఞతలు తెలిపారు. తనపై చంద్రబాబు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని.. నవ్యాంధ్ర రాజధాని అభివృద్ధికి తాము కూడా పాల్గొంటామని ఆయన అన్నారు. మొత్తానికి ఇంతకాలానికి జయరామ్ కోమటి శ్రమకు ఫలితం దక్కింది.