ఆజాద్ చేతికి రాష్ట్ర పగ్గాలు

న్యూఢిల్లీ: సీఎం కిరణ్, బొత్సల మధ్య కలహాన్ని ఆజాద్ తీర్చేశారు. సీఎం ,  బొత్స సత్యనారాయణ పరస్పరం కలహించుకొని.. తమ పగ్గాలను ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్ చేతికి అప్పగించారు. ఇకనుంచీ ఎలాంటి కీలక నిర్ణయం తీసుకోవాలన్నా తనను సంప్రదించి తీసుకోవాలని కిరణ్, బొత్సలకు ఆజాద్ స్పష్టం చేసినట్లు తెలిసింది. "మీరు గొడవ పడుతున్న తీరు చూసి.. మేడమ్ ఆగ్రహంతో ఉన్నారు. 18 నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో జగన్ ను మనం గట్టిగా ఎదుర్కోలేకపోతే.. మీతో సహా నేనూ ఇంటిదారి పట్టాల్సి ఉంటుంది'' అని సీఎం, పీసీసీ చీఫ్‌లను ఆజాద్ గట్టిగా హెచ్చరించినట్లు సమాచారం.

కాగా, డీసీసీల ఏర్పాటుకు వెంటనే చర్యలు ప్రారంభించాలని, సీఎంతో చర్చించి పేర్లను ఖరారు చేసి, తనకు పంపించాలని బొత్సను ఆజాద్ ఆదేశించారు. అదే విధంగా వివిధ కార్పొరేషన్లు, ఇతర పదవుల భర్తీ విషయంపై ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడితో చర్చించి జాబితాను రూపొందించి తనను సంప్రదించాలని సీఎంను కూడా ఆయన ఆదేశించారు. ఏ ఒక్క నిర్ణయమూ వివాదాన్ని రేకెత్తించడానికి వీలు లేదని, ఎవరూ మరొకర్ని విమర్శించరాదంటూ సీఎం, బొత్సలకు ఆజాద్ తేల్చి చెప్పారు. పెండింగ్ ఫైళ్ల గురించి సీఎంను ఆజాద్ ఆరా తీశారు. ప్రభుత్వం పనిచేస్తున్నట్లు కనిపించాలని, స్తబ్దుగా సాగవద్దని కిరణ్‌కు ప్రత్యేకంగా చెప్పారు.


ఇక, త్వరలో జరగనున్న పద్దెనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో కేంద్రమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ తన ముద్ర వేయనున్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరపరాజయం చెందడంతో, ఈసారి ఉప పోరులో ఆజాద్‌నే స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయించారు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గౌరవప్రదమైన సంఖ్యలో విజయాన్ని సాధించేందుకు భారీ ప్రణాళికను ఆజాద్ రూపొందించారు. ఈనెల 7న ఆజాద్ నగరానికి రానున్నారు. ఉప ఎన్నికలపై పార్టీ నేతలతో విస్తృత చర్చలు జరుపుతారు. ఆజాద్ రూపొందించిన ప్రణాళిక మేరకు ఉప ఎన్నికలు జరగనున్న పద్దెనిమిది అసెంబ్లీ స్థానాలతోపాటు నెల్లూరు లోక్‌సభ స్థానం పరిధిలోకి వచ్చే నియోజకవర్గాలను కలిపి మొత్తం ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలకు సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఈనెల 10నుంచి 14 వరకు తమకు కేటాయించిన అసెంబ్లీ నియోజకవర్గల్లో పర్యటించనున్నారు. నియోజక వర్గ పరిధిలో ఉండే మండలాల్లో ఒక్కో మండలంలో ఐదారు గ్రామాల్లో పార్టీ కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసి వారితో విస్తృత చర్చలు జరుపుతారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాల అమలు తీరు, లోపాలు, ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, పార్టీని మరింత పటిష్టం చేయడానికి చేపట్టాల్సిన చర్యలు, ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా ఎవరుంటే బాగుంటుంది, అందుకు కారణాలు ఏమిటన్న వివరాలు సేకరిస్తారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu