ముగ్గురు వ్యాపారుల గుప్పెట్లో 342 మద్యం దుకాణాలు
posted on Apr 4, 2012 8:44AM
గుంటూరుజిల్లాలో మద్యం మాఫియా తీరు తెన్నులు ఎసిబి అధికారులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఈ జిల్లాలోని 342 మద్యం దుకాణాలు కేవలం ముగ్గురు వ్యాపారుల కనుసన్నల్లో నడుస్తున్నాయి. ఈ ముగ్గురు వ్యాపారుల పెట్టుబడులతో అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు, రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తుల సోమ్ముతోపాటు ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ డబ్బులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు వ్యక్తులు బినామీ పేర్లతో జిల్లాలో మద్యం దుకాణాలు నిర్వహిస్తూ కోట్లాది రూపాయలు దోచుకున్నారు.
జిల్లాలోని 65 దుకాణాలు ప్రతిపక్ష పార్టీకి చెందిన ఒక మాజీ ప్రజాప్రతినిధి పెట్టుబడితో నడుస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు తమ వద్ద పనిచేస్తున్న వారి పేరిట 20 మద్యం దుకాణాలను నిర్వహిస్తున్నారు. పల్నాడు, డెల్టా ప్రాంతాల్లో 52 దుకాణాలు కేవలం ఒకే పేరుతో బినామీలతో నడిపిస్తున్నారు. ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ తన సమీప బంధువుల సహాయ సహకారాలతో జిల్లాలో నాలుగు మద్యం దుకాణాలను నడుపుతున్నాడు. బినామీల గుట్టు రట్టు కావడంతో చాలామంది జిల్లానుంచి పరారైపోయారు. వీరి ఆచూకీ కోసం ఎసిబి అధికారులు విస్తృతంగా గాలిస్తున్నారు.